ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జిల్లాలో జయప్రదం చేయాలని బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సమావేశం ఉద్యోగ, కార్మికులకు పిలుపునిచ్చింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు గంటెనపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 28న సార్వత్రిక సమ్మె నిర్వహించాలని న్యూఢిల్లీలో కేంద్ర కార్మికసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సు నిర్ణయించిందని తెలిపారు. లాభాలు వచ్చే ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. శాశ్వత స్వభావం గల పనుల్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్లను నియమిస్తోందన్నారు. ఫలితంగా పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. రెగ్యులర్ వర్కర్లకు ఇచ్చే వేతనాలనే కాంట్రాక్ట్ వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనం రూ. పది వేలు నిర్ణయించాలన్నారు. పిఎఫ్, బోనస్ చెల్లింపు, గ్రాట్యుటీపై సీలింగ్ ఎత్తివేయాలని కోరారు. కార్మికులకు, ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం జరిగే సార్వత్రిక సమ్మెను జిల్లాలో జయప్రదం చేయాలన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమ్మె జయప్రదానికి సదస్సులు, మానవహారాలు, స్కూటర్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు కారుసాల శ్రీనివాసరావు, సిహెచ్ మజుందర్, బి వెంకట్రావు, డికెఎం రఫీ, ఎన్ బాబూరావు, డి శ్రీనివాసరావు, వై వెంకయ్య, ఎం మనోజ, ఎం అయ్యప్పరెడ్డి, టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
java.lang.NullPointerException