వీరేంద్ర ప్రతాపం

  • రాజస్థాన్‌ రాయల్స్‌పై
  • డేర్‌డెవిల్స్‌ విజయం

వీరేందర్‌ సెహ్వాగ్‌ విజృంభించి 75 పరుగులు చేయడంతో సోమవారం నాడు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఘన విజయం సాధించింది. రాయల్స్‌ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని డేర్‌డెవిల్స్‌ సునాయాసంగా చేరుకుంది.లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేరుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది వరుసగా రెండో విజయం కాగా మాజీ ఛాంపియన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు వరుసగా రెండో ఓటమి. శనివారం నాడు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుపై విజయం సాధించిన డేర్‌డెవిల్స్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది తన ఖాతాలో మరో రెండు పాయింట్లు జమ చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌కు ఈ ఓటమి ఎదురుదెబ్బ వంటిది.ఈ మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.రాయల్స్‌ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమైంది.పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంభీర్‌ రాణించగా ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించే బాధ్యతను సెహ్వాగ్‌ తన భుజాలపై వేసుకున్నాడు. సెహ్వాగ్‌ తనదైన శైలిలో ఆడటంతో డేర్‌డెవిల్స్‌ పది ఓవర్లలోనే 99 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గంభీర్‌ తొమ్మిది పరుగులు చేసాడు. దిల్షన్‌ మరోసారి విఫలమై డకౌటయ్యాడు.

సెహ్వాగ్‌ 34 బంతుల్లో 75 పరుగులు చేసి మునాఫ్‌ పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సెహ్వాగ్‌ స్కోరులో ఎనిమిది బౌండరీలు, ఐదు సిక్సర్లున్నాయి. మాజీ ఛాంపియన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైంది. ఐపిఎల్‌ - టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం నాడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఝుంఝున్‌వాలా ఒంటరిపోరాటం చేసి అర్ధసెంచరీ చేసినప్పటికీ ఆ జట్టు స్కోరు 150 పరుగుల మార్క్‌ చేరుకోలేకపోయింది. ఝుంఝున్‌వాలా అర్ధ సెంచరీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేయగలిగింది. ఝుంఝున్‌వాలా 45 బంతుల్లో ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి డోగ్రా సహకరించి 29 పరుగులు చేయడంతోపాటు ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్‌ తీసుకున్నారు. నాన్నెస్‌ అద్భుత ఓపెనింగ్‌ స్పెల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది. అస్నోద్కర్‌ మరోసారి విఫలమై రెండో ఓవర్‌లోనే అవుట్‌ కావడంతో రాయల్స్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఐపిఎల్‌-2 టోర్నమెంట్‌లో రాణించిన నామన్‌ ఓజా ఈ మ్యాచ్‌లో కూడా విఫలమై నిరాశపరిచాడు. అతడు 24 పరుగులు చేసాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేసి 37 బంతుల్లోనే సెంచరీ చేసిన యూసుఫ్‌ పఠాన్‌ ఈ మ్యాచ్‌లో ఐదు బంతులను ఎదుర్కొని ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అతడు అవుట్‌ కావడం రాయల్స్‌కు అశనిపాతంగా పరిణమించింది. బిగ్‌హిట్టర్‌గా పేరుగాంచిన మాస్కరెన్హాస్‌ కూడా రాణించలేక పోతున్నాడు. డోగ్రా రాణిస్తూనే రనౌటవుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రాయల్స్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. ఈ మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది.ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తదుపరి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో బుధవారం నాడు తలపడుతుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ నెల 18న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తో బెంగుళూరులో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ రాయల్స్‌ జట్టుకు ఎంతో కీలకమైంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్