ప్రధాని అభ్యర్థిత్వంపై అటు బిజెపి కేంద్ర నాయకత్వంలో కుమ్ములాటలు, ఇటు కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్ప చుట్టూ బిగుసుకుంటున్న అవినీతి కేసులు కాషాయ పార్టీకి పట్టిన దుర్గతిని తెలియజేస్తున్నాయి. వచ్చే ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బిజెపియేతర వ్యక్తి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న అద్వానీ వ్యాఖ్యలు పార్టీ నైతికతను దెబ్బతీశాయని వాపోయిన ఎడ్యూరప్ప ఇప్పుడు తనే ఆ పార్టీకి ఓ పెద్ద గుదిబండగా మారారు. మూడు సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన ఎడ్యూరప్ప ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగానికి ఎలా ప్రతీకగా నిలిచినదీ ఆయన ఎదుర్కొంటున్న కేసులే నిదర్శనాలు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్తకు అడ్డంగా దొరికిపోయి ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న ఎడ్యూరప్ప ఇప్పటికే దానిపై కేంద్ర నేర దర్యాప్తు సంస్థను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు కోర్టునాశ్రయించి ఏదో ఒక విధంగా షరతులతో కూడిన ముందస్తు బెయిలు సంపాదించుకున్నారు. ఆ కేసు ఇంకా తెమలనేలేదు, భూ కుంభకోణం కేసులో ఎడ్యూరప్ప పైన, ఆయన పుత్రరత్నం, ఎంపీ రాఘవేంద్ర పైన సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్త కోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఎడ్యూరప్పతో పాటు బిజెపి పరిస్థితీ మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది. అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసుల్లో ఎడ్యూరప్ప మునిగి తేలుతుండడంతో ఇప్పటికే మంటగలిసిన బిజెపి ప్రతిష్ట మరింత దిగజారింది. ముఖ్యమంత్రిగా తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగపరచి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యులకు కేకు ముక్కల్లా పంచిపెట్టారు. ఆయన కుమారుడు రాఘవేంద్ర, మరో అయిదుగురు బినామీలతో దావళగిరి డెవలపర్స్ సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకున్న పది రోజులకే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను దానికి బదలాయించారు. దీనికి వీలుగా అంతకు రెండు వారాల ముందే భద్రావతి ఫారెస్టు ఏరియాలోని ఆ 69 ఎకరాల భూమిని ఆయన డీనోటిఫై చేశారు. ఆ తరువాత తన అల్లుడు, కోడలు ఆధ్వర్యంలో భగత్ హోమ్స్ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు వారాలకే చిత్రదుర్గలోని కోట్లాది రూపాయల విలువైన భూములను దానికి ధారాదత్తం చేశారు. కర్నాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు (కెెఐడిఎబి) ద్వారా ప్రజల నుంచి తక్కువ ధరకు భూములు లాక్కొని తన కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో నెలకొల్పిన సంస్థలకు పంచిపెట్టారు. ఆనాడు పనిలో పనిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుని కుమారునికి, అప్పటి తన మంత్రివర్గంలో అనుంగు సహచరురాలైన శోభా కరండ్లాజె భాగస్వామిగా ఉన్న కపిల్ మంజుశ్రీ అపారెల్‌కు కూడా భూ పందారం చేశారు. 2010-11 మధ్య కాలంలో భద్రావతి ఏరియాలోని 250 ఎకరాలకు పైగా అటవీ భూములను డీనోటిఫై చేశారు. ఈ విధంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజల ఆస్తులు కైంకర్యమయ్యాయి. దీనిపై అప్పట్లో ప్రతిపక్షం పెద్దయెత్తున ఆందోళన చేస్తే దానిని రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా కొట్టిపారేసింది. బిజెపి అధికారంలోకి వచ్చిన ప్రతి చోటా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతోంది. నిజానికి కర్నాటకలో బిజెపి ప్రభుత్వమే అవినీతి పునాదులపై ఏర్పడింది. 2008 ఎన్నికల్లో మెజారిటీ లభించకపోయినా ఏకైక అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపి ఆ వెంటనే 'ఆపరేషన్ లోటస్' చేపట్టింది. డబ్బు మూటలను ఎరగా వేసి కాంగ్రెస్, జెడి(ఎస్) వంటి పార్టీల నుంచి కొందరు సభ్యులను, ఇండిపెండెంట్లను లాగేసుకోవడం ద్వారా మెజార్టీ కూడగట్టుకుంది. 2009, అక్టోబరులో బళ్ళారి రెడ్డి బ్రదర్స్ సంక్షోభం సృష్టించినప్పుడు అవినీతిపై రాజీపడింది. 2010, అక్టోబరులో మళ్లీ సంక్షోభం తలెత్తినప్పుడు డబ్బు, పదవులు ఎరగా వేసి అసమ్మతి ఎమ్మెల్యేలలో కొందరిని తిరిగి తనవైపు లాక్కుంది. మైనింగ్ మనీ బ్యాగ్‌ల ద్వారా సాధించిన ఈ సుస్థిరతను ఉపయోగించుకుని తమ సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఎడ్డీ ప్రభృతులు ఉపయోగించుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల మీద లోకాయుక్త కోర్టు ఇప్పటికైనా సమగ్ర విచారణకు ఆదేశించడం ఒక మంచి పరిణామం.
ఈ అవినీతితోపాటు ప్రధాని అభ్యర్థిత్వం కోసం ఆ పార్టీ నాయకుల మధ్య కుమ్ములాటలు బిజెపిలో ముదురుతున్న సంక్షోభాన్ని ముందుకు తెస్తున్నాయి. వాస్తవానికి ఈ కుమ్ములాటలు 2009 పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఘోర పరాజయం ఎదురైనప్పటి నుంచే మొదలయ్యాయి. మొన్న మే నెలలో ముంబయిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆరెస్సెస్ నితిన్ గడ్కరికి రెండో పర్యాయం అధ్యక్షునిగా కొనసాగేందుకు అనుమతించడంతో ఇవి మరింత ముదిరాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపి తరపున ప్రధాని అభ్యర్థిగా నిలిచే అవకాశాలు తనకు సన్నగిల్లాయని భావించిన అద్వానీ ముంబయి ర్యాలీకి డుమ్మా కొట్టడం, 2014 ఎన్నికలకు ముందే బిజెపి ఓటమిని అంగీకరించడం, తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యుపిఎ-2 ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమైనదంటూ వ్యాఖ్యానించి, దానిని సమర్థించుకోలేక వెనక్కి తగ్గడం వంటివి చూస్తున్నాము. అద్వానీ చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. కానీ, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ఎంచుకున్న సమయం ఆయనలోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. అసోం హింసాకాండను బయట నుంచి వచ్చినవారికి, స్థానికులకు మధ్య ఘర్షణగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిని బట్టి మతోన్మాదం విషయంలో ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని అర్థమవుతుంది. అద్వానీ సృష్టించిన గందరగోళం సద్దుమణగక ముందే ఆరెస్సెస్ నేత భగవత్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలన కన్నా, బీహార్ ముఖ్యమంత్రి పాలనే గొప్పదని చేసిన వ్యాఖ్యలు సంఫ్‌ు పరివార్ శ్రేణులను అయోమయానికి గురి చేసేవిగా ఉన్నాయి. మొత్తం మీద అవినీతి, కుమ్ములాటలు బిజెపిలో నెలకొన్న సంక్షోభాన్ని మరోసారి ఎత్తిచూపాయి.