అసోం గుండాన్ని ఆర్పాలి

అసోంలో రాజుకుంటున్న ఉద్రిక్తతల అగ్నిగుండం ఆందోళనకరం. ఇప్పటికే 44 మంది బలయ్యారు. ఇంకా చల్లారని వేడికి ఎందరు విగతులుగా మారనున్నారోననే కలవరం మరింత కలతకు గురిచేసే అంశం. జులై ఆరునే ఉద్రిక్తతల తీవ్రత తెలిసినా చేష్టలుడిగిన పాలక కాంగ్రెసు నిర్లక్ష్యానికి సామాన్యులు సమిధలవుతున్నారు. హింస చెలరేగి ఆపై అది మతం రంగు పులుముకుని ఊళ్లకు ఊళ్లు బుగ్గయ్యేంత వరకూ తీరుబడిగా వీక్షించిన పాలక కాంగ్రెస్‌ చేవలేనితనమే నేటి దుస్థితికి కారణం. బోడో ప్రాంతీయ పరిపాలన జిల్లా, కోక్రఝార్‌ నుంచి మొదలైన హింస నేడు సరిహద్దు ప్రాంతాలకూ విస్తరించింది. వేలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలిపెట్టాల్సొచ్చింది. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ఒక చిన్నారికి బుల్లెట్‌ గాయమైందంటే అదుపు తప్పిన హింస స్థాయిని అర్థం చేసుకోవచ్చు. బెంగాల్‌, అసోం సరిహద్దులో పారామిలిటరీని బెంగాల్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆఖరుకు అసోం సహాయ శిబిరాల్లో రక్షణ పొందుతున్నవారు సైతం భయాందోళనలతో తల్లడిల్లుతున్న స్థితి బాధాకరం. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలు అంటూ మైనారిటీలపై దాడులను సమర్ధించే ప్రచారాలకు తెగబడుతున్న ప్రబుద్ధుల కళ్లకు మారణకాండను చూడలేని మసక కమ్మేసినట్టుంది. దశాబ్దాల నుండీ ఇక్కడే ఉంటున్న ప్రజల మధ్య విభజనలు సృష్టించి ఐక్యతకు బీటలేసి తద్వారా తమ రాజకీయ లబ్ధిని ఆశించిన పార్టీల అవకాశవాద ఫలితమే ప్రస్తుత మారణకాండ. ఇటీవల వరకూ సద్దుమణిగి ప్రశాంతంగా ఉన్నట్టు కన్పించిన అసోంలో మళ్లీ అల్లర్లెందుకు రాజుకున్నాయన్నది ప్రశ్న.

1980లలో ప్రత్యేక బోడోల్యాండ్‌ పేరిట ముందుకొచ్చిన వేర్పాటువాదం అనంతర కాలంలో ఉగ్రవాద ధోరణులతో పెచ్చరిల్లింది. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆనాడు అసోం ప్రస్తావన లేకుండా ఏరోజూ వార్తలు ముగిసేవి కావు. దాదాపుగా ఈశాన్య రాష్ట్రాలన్నింటిపై తీవ్ర ప్రభావం చూపిన అంశమిది. 2003లో ప్రత్యేక బోడో ప్రాదేశిక మండలి(బిటిసి) ఏర్పాటు ఒప్పందం తర్వాత పరిస్థితి కొంత అదుపులోకొచ్చినట్టే కనిపించింది. ఆనాడు వేర్పాటువాదులుగానున్నవారు అనంతర కాలంలో రాజకీయ నాయకుల పాత్రలోకి మారారు. బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బిపిఎఫ్‌)పేరిట పార్టీకీ నాయకులుగా ఉన్నారు. ఇప్పుడేదో ఇది ముస్లింలకూ, స్థానికులకూ మధ్య జరుగుతున్న వివాదంగా ప్రచారంలో పెడుతున్నారు. ఆది నుంచీ ఇక్కడ ముస్లిములున్నారు. మైనార్టీలపై సాగుతున్న దుర్మార్గమైన దాడిని సమర్ధించే ప్రబుద్ధులు వారంతా బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అక్కడ అత్యధిక ప్రజానీకం భారతీయ పౌరులే. బ్రహ్మపుత్ర, ఇతర నదుల వల్ల వారివారి నివాస ప్రాంతాల్లో భూమికోతకు గురైనందున బ్రతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారే ! నూతన ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశంలో కొద్దిమంది వెలిగిపోతుంటే అసంఖ్యాకులు నలిగిపోతున్నారని అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. ఉపాధి రహిత అభివృద్ధి ఈనాడు దేశంలో తీవ్ర అసంతృప్తులకు కారణమౌతోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం స్వార్థంతో రెచ్చగొట్టే శక్తుల వెంట అసంతృప్తికి మూలాలను వెదుకుతూ అనేక చోట్ల జనాలు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తుండటం నేడు చూస్తున్నాం. అసమానతలను, నిరుద్యోగితను పెంచిపోషిస్తున్న కాంగ్రెసు అవకాశవాద వైఖరి ప్రజల మధ్య వైషమ్యాలు రగులుస్తోంది. నేడు అసోంలో ప్రజ్వరిల్లిన హింసకు కాంగ్రెస్‌ వినాశకర విధానాలదే బాధ్యత.

బిటిసిలో బోడోయేతరులకు స్థానం కల్పించినా వారిక్కడ మైనారిటీయే. ఈ మండలిలో స్థానం ఉన్నా నిర్ణయాత్మక పాత్రలో తాము లేమన్న అసంతృప్తి ఇక్కడి మైనార్టీల్లో క్రమంగా బలపడింది. తగిన స్థానం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి సంఘాలు ఎక్కడ బలపడతాయోనన్నది బోడోల ఆందోళన. రెండింటికీ సవ్యంగా దిశానిర్దేశం చేయాల్సిన పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడేది అనుకూలమైతే అప్పుడు దాన్ని రెచ్చగొట్టే వైఖరులతో పబ్బం గడుపుకుంటుండటంతో వైషమ్యాలకు విరుగుడు లేక హింసకు కారణమౌతోంది. అందుకనే దీన్ని చల్లార్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. వారి నిర్లక్ష్యానికి ఇప్పటికే జనం ప్రాణాలు కోల్పోయారు, నిరాశ్రయులయ్యారు. ఇంకా తీవ్ర నష్టం జరగకముందే పాలకులు మేల్కోవాలి. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాల్సిన బాధ్యత సర్కారుదే. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. హింసకు పాల్పడిన, పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారమివ్వాలి. భద్రతను కట్టుదిట్టం చేసి హింసకు ముగింపు పలికి దోషులను శిక్షించాలి. అస్థిత్వ వాదాలకూ, అస్థిరత్వాలకూ మూలమైన విధానాలను జనం తిప్పికొట్టాలి. ప్రజలు సంయమనం పాటించాలి. అసోం పర్యటనలో ప్రధాన మంత్రి వాస్తవాలను జీర్ణం చేసుకుని ప్రవచనాలు కాకుండా తగిన చర్యలకు ఆదేశించడం అవసరం.