రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి

సర్వ సత్తాక గణతంత్ర దేశ అత్యున్నత పదవికి ప్రణబ్‌ ముఖర్జీ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈ నెల 25న భారత 13వ రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార యుపిఎతో పాటు పలు పార్టీల విస్తృత మద్దతుతో రాష్ట్రపతి పదవిని అలంకరిస్తుండటంతో ప్రణబ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అత్యధిక పార్టీలు దాదాకు మద్దతు తెలపడంతో మొదటి నుంచీ ఆయన గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు. ఎటొచ్చీ మెజార్టీపైనే కొద్దిపాటి ఉత్కంఠ. ఆదివారంనాటి ఓట్ల లెక్కింపుతో అది కూడా పటాపంచలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన ఓట్లలో ప్రణబ్‌కు 69 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి సంగ్మాకు పడిన ఓట్ల కంటే దాదాకు వచ్చిన మెజార్టీయే ఎక్కువ. సంగ్మా చెప్పినట్లు అద్భుతాలేమీ జరగలేదు సరికదా తన అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చిన బిజెపి నుంచి కర్నాటకలో ఆశించిన మేరకు ఓట్లు రాబట్టుకోలేక పోయారు. సంగ్మా చీకట్లో సంధించిన గిరిజన, ఈశాన్య ప్రాంత అస్త్రాలేవీ పని చేయలేదు. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు వేసిన 81 ఓట్లు చెల్లలేదు. ఎక్కడో కుగ్రామాల్లోని నిరక్షరాస్యులు వేసిన ఓట్లు చెల్లలేదంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని లక్షల మంది ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వారు అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఓటింగ్‌లో సరిగ్గా ఓటు వేయలేకపోయారంటే మన నేతల నిర్వాకంపై ఏమనుకోవాలి!

రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ జాప్యం చేసింది. యుపిఎ పార్టీల మధ్య నెలకొన్న విభేదాల వల్లనే కాంగ్రెస్‌ భయపడింది. అందుకు తగ్గట్టుగానే అధికార కూటమిలోని మమతా బెనర్జీ చివరి వరకూ పిల్లిమొగ్గలేశారు. బెంగాల్‌ ప్రజల ఒత్తిడి, రాజకీయ పరిస్థితుల వల్లనే ప్రణబ్‌కు తృణమూల్‌ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. యుపిఎ పరిస్థితి ఇలావుంటే ఎన్డీఏ పరిస్థితి మరోలా తయారైంది. కూటమిలోని శివసేన, జెడియు పార్టీలు ప్రణబ్‌కు మద్దతు తెలపడంతో బిజెపి గొంతులో పచ్చివెలక్కాయ పడింది. పోటీ చేయడానికి సంగ్మా ముందుకొచ్చాక ఆయన అభ్యర్థిత్వాన్ని విధిలేని పరిస్థితుల్లో బలపరిచింది. సంగ్మా గెలుపునకు ఆ పార్టీ ప్రత్యేకంగా కృషి చేసిందేమీ లేదు. ఓట్ల లెక్కింపులో కర్నాటకలో తమ ఓట్లు క్రాస్‌ కావడం బిజెపికి పెద్ద షాక్‌. అధికారంలో ఉన్న కర్నాటకలో ప్రణబ్‌కు ఎక్కువ ఓట్లు పోల్‌ కావడాన్నిబట్టి ముఖ్యమంత్రిని మార్చినా ఆ రాష్ట్ర బిజెపిలో కీచులాటలు సమసి పోలేదని నిరూపితమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ బలపరిచిన అభ్యర్థి గెలుపొందినందున ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను సమర్ధించినట్లు కాదు. ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ అమలు చేసిన నయా ఉదారవాద సంస్కరణలు మంచివి అయిపోవు. రాష్ట్రపతి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి మ్యాండేట్‌ కాబోవు. ప్రణబ్‌కు మద్దతిచ్చిన సిపిఎం ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

బెంగాల్‌లోని కుగ్రామం మిరాటీ నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ వరకూ ప్రణబ్‌ ప్రస్థానం రాత్రికి రాత్రి జరగలేదు. ఒక సాధారణ గుమాస్తా నుంచి దేశ సర్వపైన్యాధిపతి స్థానానికి చేరడానికి మధ్య ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉంది. పాలనా అనుభవం, కార్యదక్షత కూడా ఆ ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి. ఇందిరా గాంధీ హయాంలోనే నెంబర్‌ టూగా ఎదిగిన ఆయన మన్మోహన్‌ కేబినెట్‌లోనూ అదే స్థానాన్ని పదిలపర్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఒకసారి వీడి మళ్లీ వెనక్కి రావడంతో రాజీవ్‌ మరణానంతరం ప్రణబ్‌కు ప్రధాని పదవి తృటిలో తప్పిపోయిందంటారు. ఇప్పుడు కూడా మన్మోహన్‌ తర్వాత ప్రణబే పిఎం పదవికి అర్హుడంటారు. రాహుల్‌ను ప్రధాని పదవిలో ప్రతిష్టింపజూస్తున్నందున ప్రణబ్‌కు రాష్ట్రపతి పదవి ఇచ్చి సోనియా మార్గం సుగమం చేశారనేవారూ ఉన్నారు. కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నా సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం కలిగిన ప్రణబ్‌ రాష్ట్రపతి పదవికి అర్హుడనడంలో ఎలాంటి సందేహం లేదు. గణతంత్ర దేశ రాష్ట్రపతి హోదాలో రాజ్యాంగ గౌరవాన్ని కాపాడే, పరిరక్షించే విషయంలో గత అనుభవం పనికొస్తుంది.

రాష్ట్రపతి పదవి రబ్బరు స్టాంపు అనే నానుడి ఉంది. గతంలో కొంత మంది అధికార పార్టీ చెప్పినట్లు తలాడించారు. రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యహరించని కారణంగానే 1975లో దేశానికి ఎమర్జెన్సీ చీకటి రోజులు దాపురించాయన్న విమర్శలు ఎలాగూ ఉన్నాయి. విపక్ష పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక సాకుతో 356 ఆర్టికల్‌ను ప్రయోగించి వాటి పీక నొక్కినప్పుడు కనీస విచక్షణ పాటించలేదన్న అపవాదును పలువురు రాష్ట్రపతులు మూటగట్టుకున్నారు. దేశ ప్రథమ పౌరుడిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలి. లౌకికత్వానికి నికరంగా కట్టుబడాలి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అచేతన స్థితిలో ఉన్న పివి నరసింహారావు ప్రభుత్వాన్ని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ కదిలించారు. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో రాష్ట్రపతి పాత్ర మరింత కీలకంగా మారింది. బిజెపి వంటి మతతత్వ పార్టీలు దేశ రాజకీయాల్లో కీలక స్థాయికి చేరుకుంటున్న సమయాన లౌకిక విలువలను, ప్రజాస్వామ్యాన్ని, జాతి సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉంది. మనుధర్మ పార్టీలు రాజ్యాంగాన్నే సమీక్షించాలంటున్న తరుణంలో ఆనాటి రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ అక్కర్లేదని విస్పష్టంగా ప్రకటించారు. ప్రతిష్టాత్మక పదవిని అధిష్టించాక రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. అత్యధిక పార్టీల మద్దతు పొందిన Publiture