'పవర్‌' ట్రిక్స్‌

రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో మమతాబెనర్జీని తమ దారిలోకి తెచ్చుకున్నామన్న సంతోషాన్ని పూర్తిగా అనుభవించకుండానే కాంగ్రెస్‌కు శరద్‌పవార్‌ తలనొప్పి మొదలైంది. పవార్‌ను బుజ్జగించేందుకు ప్రధాని మొదలు ఛోటా నాయకుల వరకూ మెరమెచ్చు మాటలతో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సోమవారం నాడు అంతిమంగా నిర్ణయిస్తామని పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రకటించడంతో అప్పటిలోగా ఈ సంక్షోభం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. తాము రాజీనామా చేసినట్లు చెప్పకుండానే తాము అధికారంలో లేకపోయినా యుపిఎలో కొనసాగుతామని, బయటి నుంచి మద్దతిస్తామని ఎన్‌సిపి నాయకులు చెప్పడం తాడు తెగకుండా చూసుకునే ఎత్తుగడలో భాగమే. కొన్ని విధాన సమస్యలపై తాము విభేదిస్తున్నట్లు ఎనిమిదేళ్లు అధికారంలో కొనసాగిన తరువాత వారు చెప్పడం ఒకసాకు మాత్రమే. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయిన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూలేదు. పవార్‌తో పాటు ఎన్‌సిపికి చెందిన మరో కేంద్ర మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ ఏక వాక్యంతో రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపి శనివారం నాడు ముంబయి వచ్చి కూర్చున్నారు. తనకు తానై సమస్యను సృష్టించుకున్న కాంగ్రెస్‌ శరద్‌ పవార్‌ను ఎలా అంకెకు తెచ్చుకుంటుందనేది తెరపై చూడాల్సిందే. రాష్ట్రపతి పదవికి యుపిఎ తరఫున అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ప్రధాని పక్కన తర్వాతి స్థానంలో శరద్‌పవార్‌ కూర్చున్నారు. తరువాత జరిగిన మరో సమావేశంలో ఆ స్థానాన్ని రక్షణమంత్రి ఎకె ఆంటోనీతో భర్తీ చేయడం శరద్‌ పవార్‌ను కాంగ్రెస్‌ పొమ్మనకుండానే పొగబెట్టినట్లా? గురువారం నాడు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ముగిసే వరకూ గుంభనంగా ఉన్న ఎన్‌సిపి నాయకులు మరుసటి రోజే రాజీనామా పంపి కాంగ్రెస్‌ నాయకత్వానికి తమ అసమ్మతిని తెలిపారు. నిజానికి ఈ సమస్య ప్రణబ్‌ముఖర్జీ యుపిఎ అభ్యర్థిగా ప్రతిపాదన వచ్చినప్పుడే మొగ్గతొడిగి ఇప్పుడు విచ్చుకుందని చెప్పవచ్చు.

మంత్రివర్గంలో రెండవ స్థానం ఎవరిదన్న వివాదంగా ఈ సమస్య పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుల్లోకి వెళితే అనేక అంశాలు దీనితో ముడిబడి ఉన్నాయి. ఎన్‌సిపి గతంలో అనేక సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ గడచిన ఎనిమిది సంవత్సరాలలో శరద్‌పవార్‌ మంత్రివర్గ సమావేశానికి గైరుహాజరు కావడం ఇదే తొలిసారి. యుపిఎలో కాంగ్రెస్‌ తరువాత సంఖ్యాపరంగా చూసినప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండవ స్థానంలో ఉంది. మరొక పార్టీకి రెండవ స్థానమిస్తే ఆ పార్టీకి మరొక ఆయుధాన్ని కాంగ్రెస్‌ ఇచ్చినట్లు అవుతుంది. యువనేత రాహుల్‌గాంధీని అధికార ఆరంగేట్రం చేయించేందుకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో శరద్‌పవార్‌ను రెండవ స్థానంలో కూర్చోబెడితే రేపు ఎన్నికల తరువాత ప్రధాని పదవే కావాలంటే ఎలా అన్నది కాంగ్రెస్‌కు తెలియంది కాదు. పవార్‌కు రెండవ స్థానమిచ్చి 'పవర్‌' ఇవ్వటం ప్రస్తుతం ఉప్పునిప్పుగా రెండు పార్టీల మధ్య పరిస్థితి ఉన్న తరుణంలో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు నష్టదాయకమన్నది ఆ రాష్ట్ర నాయకత్వ అభ్యంతరం.

మొదటి కుర్చీ కోసమే గతంలో తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ శరద్‌ పవార్‌ సోనియాగాంధీపై ధ్వజమెత్తిన పెద్దమనిషి అని తెలిసిందే. మహారాష్ట్రలో ఆధిపత్యం కోసం కాంగ్రెస్‌, ఎన్‌సిపి పోటీపడితే శివసేన, బిజెపి కూటమి అధికారాన్ని తన్నుకుపోవడం సులభం. అందుకే రెండు పార్టీలూ ఎవరి అవసరం కోసం వారు కలిసి ఉండక తప్పని స్థితి. అయినప్పుడు శరద్‌ పవార్‌కు ఇప్పుడు కాంగ్రెస్‌తో లడాయి పెట్టుకుంటే కలిసొచ్చేదేమిటన్నది ప్రశ్న. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు దిగజారిపోవటం, దానిని ప్రభావితం చేసే ఐరోపా, అమెరికా ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు బాగుపడతాయో తెలియని స్థితి ఒకవైపు. రెండోవైపు కనీవినీ ఎరుగని భారీ కుంభకోణాల్లో చిక్కుకున్న యుపిఎ ప్రతిష్ట గంగలో కలిసింది. ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత తాము ఆశించిన తీరులో సంస్కరణలు చేయలేకపోయిందని ఇంటాబయటా కార్పొరేట్‌ సంస్థలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. మరిన్ని సంస్కరణలంటే జనంపై మరిన్ని భారాలు మోపటమే. ఎటునుంచి చూసినా యుపిఎ మునిగిపోయే పడవగా కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమిలో శివసేన, జెడియు బిజెపి వైఖరితో విభేదించాయి. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అంగీకరించేది లేదని జెడియు ఇప్పటికే ప్రకటించింది. పాలక పార్టీ రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నీతి ప్రకారం మహారాష్ట్రలో శివసేనతో లోపాయికారీగా సంబంధాలున్నాయనే విమర్శల పూర్వరంగంలో దానితో చేతులు కలిపేందుకు పవార్‌ పావులు కదుపుతున్నారా? కాంగ్రెస్‌, బిజెపిలు మరింత బలహీనపడి ప్రాంతీయ పార్టీలకు తగినన్ని సీట్లు వస్తే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శరద్‌పవార్‌ అడుగులు వేస్తున్నారా? లేదు కాంగ్రెస్‌ను అదిరించి, బెదిరించి మరిన్ని రాయితీలు, ప్రయోజనాలు పొందేందుకు ఇలాంటి చర్యకు పూనుకున్నారా? ఏ అంశాన్నీ కొట్టిపారవేసేందుకు వీలులేదు. ఆర్థిక వ్యవస్థ విఫలమైనప్పుడు దాని ప్రభావం రాజకీయాలు, రాజకీయ వ్యవస్థలపై పడుతుంది. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలున్నచోట ఎవరికి వారు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించడం అన్ని దేశాలలో జరిగేదే. ఇక్కడా అదే జరుగుతోంది.

Publiture