వంద మంది చూస్తుండగా ఇరవై మంది దుండగులు రాష్ట్ర సచివాలయానికి కూతవేటు దూరంలో రద్దీగా ఉండే వీధిలో ఒక యువతి గౌరవ మర్యాదలను మంటగలపడం ఒక్క గువాహతి నగరమే కాదు, యావత్ దేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు అంతా అయిపోయిన తరువాత తీరిగ్గా వచ్చే పోలీసులు హడావుడి చేయటం తెలిసిందే. ఈ ఉదంతంలో పోలీసులు ఆలస్యంగా రావటమే కాదు, యువతిని అవమాన పరచిన దుండగులు తమపై తిరగబడినా వారిలో ఒక్కడంటే ఒక్కడిని కూడా పట్టుకొనే ప్రయత్నం చేయలేదు. ఒక రోజు తరువాత తీరా ఈ ఉదంతాన్ని కెమెరాలో బంధించిన ఒక టీవీ ఛానల్ వారు దానిని యూట్యూబ్(ఇంటర్నెట్)లో పెట్టిన తరువాత అంటే ఉదంతం జరిగిన రెండు రోజుల తరువాత గాని పోలీసుల్లో చలనం కలగలేదు. ప్రభుత్వాలు ఏటేటా బార్లు, పబ్బులను పెంచుతూ జనం తాగటానికి లక్ష్యాలను నిర్దేశిస్తున్న రోజులివి. చేతి నిండా డబ్బుండి పనీపాటా లేని యువతీయువకులు పబ్బుల్లో తెల్లవార్లూ తాగటం, తినటం, తిరగటమే జీవితం అనుకొంటున్న స్థితి. యువతీయువకులు పుట్టిన రోజుల పేరుతో బార్లు, పబ్బులకు పరుగుతీస్తున్నారు. అలాంటి సందర్భంలోనే ఒక యువతి గువాహతిలోని ఒక బార్‌కు వెళ్లింది. అక్కడ ఒక పోకిరీ చేసిన ఆగడంతో యువతీయువకుల మధ్య కొట్లాటకు దారి తీసింది. బార్ సిబ్బంది వారిని బయటకు నెట్టిన తరువాత ఆ యువతిపై ఈ దారుణం జరిగింది.
యువతిని అవమానించి, చేయి చేసుకొని, దుస్తులు చించేసి అమానుషంగా ప్రవర్తిస్తుంటే చుట్టుపక్కల వారు ప్రేక్షకపాత్ర వహించడం మన సమాజంలో దిగజారిన మానవత్వానికి నిదర్శనం. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే పోలీసులు దుండగులను స్వేచ్ఛగా వదిలి అసలు ఆ సమయంలో అక్కడ మీరెందుకున్నారంటూ వేధిస్తారనే భయం కూడా సామాన్యుల్లో లేకపోలేదు. ఈ ఉదంతంలో పోలీసులే కనీసం ఒక్కడంటే ఒక్క దుండగుడిని కూడా పట్టుకొనేందుకు ప్రయత్నించలేదు. అర్ధగంట పాటు జరిగిన రాక్షసకాండ గురించి సమాచారం తెలిసి అటుగా వచ్చిన టీవీ ఛానల్ వారు, ఇంటికి వెళుతూ అటుగా వచ్చిన మరో విలేకరి పోలీసులకు సమాచారం అందించటం తప్ప అక్కడున్నవారెవరూ ఆ పని చేయలేదంటే ఏమనుకోవాలి? విలేకర్లు అడ్డుకున్నా దుండగులు లెక్కచేయలేదు. దాంతో ఆ ఉదంతాన్ని చిత్రీకరించారు. కొందరు ఇప్పుడు జర్నలిస్టులు చేసిన పని మంచిచెడ్డల గురించి అసందర్భమైన చర్చ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వంద మంది అడ్డుకోలేని ఆగడాన్ని ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు అడ్డుకునేందుకు ప్రయత్నించి, విఫలమై, తమ చేతిలో కెమెరా ఉంది కనుక ఉదంతాన్ని చిత్రించారు. అదేగనుక చేసి ఉండనట్లయితే అసలు ఈ దుండగం బయటకు వచ్చేదే కాదు. యువతి పరువును గమనంలో ఉంచుకొని, పోలీసులేమైనా చర్య తీసుకొంటారేమోనని ఒక రోజు వేచి చూసిన సదరు ఛానల్ వారు ఆ దృశ్యాలను ప్రసారం చేసిన తరువాతే పోలీసులకు మెలకువ వచ్చింది. ఆ దృశ్యాల ఆధారంగానే దుండగులను గుర్తించామని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
అత్యాచారాల కేసుల్లో సులభంగా బెయిలు వచ్చే అవకాశాలుండటం, అన్నింటికీ మించి పరువుప్రతిష్టలకు భంగం, పోలీసులు, కోర్టులలో ప్రశ్నల వేధింపులు తట్టుకోలేక అనేక ఉదంతాలు అసలు బయటకు రావటమే లేదు. దీంతో దుండగులు చెలరేగిపోతున్నారు. ఏటేటా అత్యాచారం కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఒక సామాజిక సమస్యగా మారుతున్నాయి. రాజధాని ఢిల్లీ దేశానికే ఈ కేసుల్లో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచీకరణ యుగంలో యువతులు కూడా అర్ధరాత్రి, అపరాత్రి వరకూ పని చేసి ఇళ్లకు వస్తున్న రోజులివి. అందుకే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అత్యాచారాల కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో మహిళలను గౌరవంగా చూస్తారనే అభిప్రాయం మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవల కొల్‌కతా, ఇప్పుడు గువాహతి నగరాల్లో జరిగిన ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. అత్యాచారాల ఉదంతాలు తన ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేసేందుకు అల్లిన కట్టుకథలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మహిళై ఉండి కూడా నోరుపారేసుకున్నారు. అస్సాంలో రెండు రోజులు గడిచిన తరువాత గానీ ముఖ్యమంత్రి గొగోరు పోలీసులను కదిలించలేకపోయారు. ఇలాంటి ఉదంతాలను అరికట్టటంలో అధికార యంత్రాంగంతో పాటు దుండగాలను ఎదిరించాలనే చైతన్యం సమాజంలో కూడా రావాలి. కేవలం బెయిలిచ్చేందుకు పదుల కోట్ల లంచాలు మేస్తున్న న్యాయమూర్తులున్న కోర్టులలో అత్యాచారాలకు పాల్పడిన వారు ఎలాంటి శిక్షలు లేకుండా బయట పడటంలో ఆశ్చర్యం ఏముంది. ఒక మహిళను వివాహం చేసుకోకుండానే సంసారం చేసి బిడ్డను కన్న ఒక పెద్దమనిషి ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గిరీ వెలగబెట్టిన ఉదంతం సమాజంలోని వక్రమార్గులకు ఎలాంటి సందేశం ఇస్తున్నది? మహిళలు, దళితులు, గిరిజనులు, తదితర బలహీన వర్గాలపై జరిగిన అత్యాచారాలన్నీ నమోదు కావటం లేదు. నమోదైన కేసుల్లో శిక్షలు పడుతున్నవి నామమాత్రం. అందువలన ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారు. అయితే చెట్టుముందా, విత్తు ముందా అన్న తెగని చర్చలతో ఉపయోగం ఉండదు. ఉన్నత స్థానాలలో ఉన్నవారి నుంచి ఇది ప్రారంభమైతే అధికార యంత్రాంగంలో కింది వరకూ జవాబుదారీతనం వస్తుంది. అప్పుడే జనం, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది.