కమలం పార్టీ కుమ్ములాటల పార్టీగా మారింది. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ఆ పార్టీ నేతలకు అధికారమే పరమావధిగా మారింది. ముఖ్యమంత్రి కుర్చీయే లక్ష్యంగా కర్నాటకలో ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను బెంగళూరు నడివీధుల్లో సమాధి చేశారు. విచ్చలవిడిగా సహజవనరుల దోపిడీ, అక్రమ గనుల కేటాయింపుతో కర్నాటకలో చెలరేగిన 'గాలి' దుమారం బిజెపి నేతలు చెప్పే విలువల బండారాన్ని బట్టబయలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి సదానందగౌడల ముఠా కుమ్ములాటలు పతాక స్థాయికి చేరడం 6.11 కోట్ల కన్నడిగులకు శాపంగా మారింది. కనీస సమస్యలూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. 24 జిల్లాల్లోని 173 తాలుకాలు కరువు కోరల్లో చిక్కుకున్నా కమలనాథులకు చీమకుట్టినట్టుగా కూడా లేదు. తాగడానికి చుక్క నీరులేక గ్రామీణ కర్నాటకం సతమతమవుతుంటే బిజెపికి అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యమైపోయింది. ప్రభుత్వ సమాచారం ప్రకారమే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర దుర్భిక్షస్థితిని కర్నాటక ఎదుర్కొంటోంది. గత 17 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఉత్తర కర్నాటక జిల్లాల్లో 90 శాతం పైగా బోర్‌వెల్స్ ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇటీవల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత కనీస స్థాయికి పడిపోయాయి. ఇంత తీవ్రమైన ముప్పు ముంగిట రాష్ట్రం నిలిచినా బిజెపి నేతలకు అదేమీ పట్టడం లేదు. వాస్తవానికి 2008లో అధికారంలోకి వచ్చినప్పటినుండి కర్నాటకలో బిజెపి ప్రభుత్వం వక్రమార్గానే నడిచింది. గాలి జనార్దనరెడ్డి కరుణా కటాక్షాలతో అధికారపగ్గాలను చేపట్టిన ఆ పార్టీ దానికి తగ్గ మూల్యాన్నీ భారీగా చెల్లించాల్సివచ్చింది. అయినా, ఆ పార్టీ నేతల్లో ఇసుమంత మార్పుకూడా రాకపోగా, అధికారం రుచి మరిగి మరింత చెలరేగిపోయారు. ప్రపంచీకరణ విధానాలతో పాటు, అవినీతి సొమ్మును బొక్కడంలో కాంగ్రెస్ తానులో ముక్కలమేనని నిరూపించుకున్నారు. అస్మదీయుల ఆకాంక్షలకు పట్టం కట్టడం, సొంతలాభాన్ని ఘనంగా చూసుకోవడం వంటి ఆశ్రితపెట్టుబడిదారీ విధానాలు కర్నాటకలోనూ వాయు వేగంతో కమలనాథులు పరుగులు పెట్టించారు. ఫలితం ప్రజలందరికీ చెందాల్సిన జాతి సొత్తు కొద్దిమంది వద్ద పోగుపడింది. పాలకపక్ష నేతలూ తమ వంతు భారీగానే దండుకున్నారు. విచ్చలవిడిగా సాగిన ఈ అక్రమార్జన ఫలితమే ప్రస్తుతం సాగుతున్న కుర్చీలాట! అధికారపగ్గాలను తిరిగి దక్కించుకోవడానికి యడ్యూరప్ప, ఉన్న పవర్‌ను నిలుపుకోవడానికి సదానందగౌడ సర్వశక్తులూ ఒడ్డారు. ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి మరీ పోటీపడ్డారు. ఎంఎల్‌ఏలను, మంత్రులను నిలువునా చీల్చారు. కర్నాటకలో జరిగిన ఈ ప్రజాస్వామ్య వస్త్రాపహరణ ప్రక్రియకు బిజెపి అగ్రనేతలూ తలా ఓచేయి వేశారు. నేతల జోరుకు ముకుతాడువేసి పాలనపై దృష్టి సారించేలా దిశానిర్దేశం చేయాల్సిన ఆ పార్టీ అగ్రనాయకత్వం దానికి భిన్నంగా వ్యవహరించి, ముఠాలకు కొమ్ము కాసింది. సుష్మాస్వరాజ్ బహిరంగంగా యడ్యూరప్పకు మద్దతు తెలపగా, గడ్కరీ ప్రస్తుత ముఖ్యమంత్రికి వత్తాసు పలకడం జాతీయ స్థాయిలో ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితికి అద్దం పట్టింది. 50 మంది ఎంఎల్‌ఏలను, 9మంది మంత్రుల మద్దతు సంపాదించిన యడ్యూరప్ప ఈ పోటీలో ప్రస్తుతానికి పై చేయి సాధించినట్లు కనపడుతోంది. 9 మంది మంత్రుల రాజీనామా బెదిరింపుతో పార్టీ అధిష్టానాన్ని తన దారికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి మార్చే విషయం ఆలోచిస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చిన మీదటే యడ్యూరప్ప గ్రూప్ మెత్తబడి ఆ తొమ్మిది మంది మంత్రుల రాజీనామాలను వాపసు తీసుకుంది. సదానందగౌడను సాగనంపాలన్న తన పంతాన్ని యడ్డీ ముఠా నెగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రిని మార్చడంతో కర్నాటక బిజెపి అంతర్నాటకం ముగిసిందని చెప్పలేం! క్యాడర్‌పార్టీగా, క్రమశిక్షణకు మారుపేరుగా కార్పొరేట్ మీడియా ఒకప్పుడు ఆకాశానికెత్తిన బిజెపిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీ దివాళాకోరుతనాన్ని తెలియ జేస్తున్నాయి. పార్టీని ముందుకు నడిపించాల్సిన బిజెపి అగ్రనాయకత్వమే ముఠాకుమ్ములాటల్లో చెరో పక్షం వహిస్తున్నది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీకి మధ్య నెలకొన్న విభేదాలు బహిరంగ రహస్యమే! ప్రధాని పీఠం చుట్టూ వీరి ఎత్తులు సాగుతున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీకి అద్వానీకి మధ్య విభేదాలు ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశంలో స్పష్టంగా బయటపడ్డాయి. పార్టీలోని మిగిలిన అగ్రనేతలూ తామేమీ తక్కువతి నలేదంటూ ఎక్కడికక్కడ ముఠాలను ప్రోత్సహిస్తున్నారు. అవినీతిలో పోటీపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కాసా ్త జగడాల పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం మేమేనంటూ గప్పాలు కొట్టుకున్న ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ నాయకులకు నకళ్ళుగా మారిపోయారు. అసంఖ్యాక ప్రజానీకాన్ని కడగండ్ల పాల్జేస్తున్న నయాఉదారవాద ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అని ఎప్పుడో తేలిపోయింది. అందుకే. కాంగ్రెస్, బిజెపిలకు బలమైన ప్రత్యామ్నాయం ఉన్న చోట ప్రజలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్లో సిపిఎం అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టడం ఇందుకు ఒక నిదర్శనం. ఆర్థిక విధానాలతో పాటు, అవినీతిలోనూ కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా మారిన బిజెపి ఈ దేశాన్ని పాలిస్తామని చెప్పుకునే అర్హత కోల్పోయింది. ప్రజలు కూడా ఈ వాస్తవాన్ని గమనిస్త