కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ మంత్రులను చూస్తుంటే ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరుతో ఆంగ్లేయులను ఆహ్వానించి మన నెత్తిన రుద్దిన రాజరిక ప్రభువులను గుర్తుకు తెస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం రూపొందించిన విదేశీ విద్యాసంస్థల ప్రవేశం, నియంత్రణ, నిర్వహణ బిల్లు-2010ని రాజ్యసభలో ఆమోదించుకునే సంఖ్యాబలం ప్రభుత్వానికి లేకపోవడంతో దొడ్డిదారిన విదేశీ విద్యా సంస్థల ప్రవేశానికి విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘాన్ని వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఆ సంస్థ నిబంధనావళిని మార్చడం ద్వారా విదేశీ సంస్థలకు ఎర్రతివాచీ పరిచేందుకు ఆలోచిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ అమెరికా పర్యటనకు ముందు ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మంత్రిగారి పర్యటన కోసం యుజిసి సమావేశాన్ని కూడా ముందుకు జరిపారు. దాని నిబంధనలను ఏవిధంగా సవరిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. మేధావిగా కొందరి అభిమానం ఇప్పటికీ పొందుతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ దేశ రక్షణ, విదేశాంగ విధానంలో కీలక పాత్ర వహించే అమెరికాతో అణు ఒప్పందాన్నే పార్లమెంటుకు చెప్పకుండా చేసుకున్న ఉదంతం మనకు తెలిసిందే. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఇప్పుడు కపిల్ సిబల్ పార్లమెంటు ముందున్న బిల్లును అలాగే ఉంచి దొడ్డిదారిన విదేశీ సంస్థల ప్రవేశానికి తెరతీయనున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఇది ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు. గతంలో మానవ వనరుల శాఖ మంత్రిగా అర్జున్‌సింగ్ ఉన్న సమయంలోనే అలాంటి ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పటికే దొడ్డిదారిన అనేక సంస్థలు మన దేశంలో ప్రవేశించాయి. విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలను క్రమబద్ధీకరించే నియంత్రణ వ్యవస్థ లేనందున విదేశీ సంస్థలు ఎన్ని వచ్చాయో నిర్థారిత సమాచారం లేదని మానవవనరులశాఖ సహాయ మంత్రి ఇ అహమ్మద్ మన సర్వసత్తాక గణతంత్ర రాజ్య పార్లమెంటులో చెప్పడం సిగ్గుచేటు. ఈ ప్రశ్నపై వచ్చిన ఉప ప్రశ్నలకు మంత్రి సిబల్ సమాధానమిస్తూ ఇంకా 800-900 విశ్వవిద్యాలయాలు, 45 వేల కళాశాలల అవసరం ఉందని, వాటిని ఏర్పాటు చేయగల సత్తా ప్రభుత్వానికి లేనందున ప్రయివేటు రంగంపై ఆధారపడాలని సన్నాయి నొక్కులు నొక్కారు. ఒకవైపు మన ఆర్థిక వ్యవస్థ త్వరలో చైనా, అమెరికాలను కూడా అధిగమించనున్నదని గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు విద్యాసంస్థల విషయంలో విదేశీ సంస్థల కోసం సర్కారు వెంపర్లాడటాన్ని చూస్తే దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లు ఉంది.
పోనీ విదేశీ విద్యా సంస్థలు ఏ విషయంలో గొప్పగా ఉన్నాయి? అమెరికా, ఐరోపా ధనిక దేశాలకు చెందిన విద్యా సంస్థలు తయారు చేసిన మేధావులు అక్కడి ఆర్థిక వ్యవస్థలలో తలెత్తుతున్న సంక్షోభాలను ఊహించారా? నాలుగేళ్లనాడు ప్రారంభమై అనేక ధనిక దేశాలను, వాటితో ఆర్థిక సంబంధాలను పెనవేసుకున్న దేశాలను అతలాకుతలం చేస్తున్న వర్తమాన ఆర్థిక సంక్షోభాన్ని వారి తెలివితేటలు ఎందుకు నివారించలేకపోయారు? ఎలా పరిష్కరిస్తారో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పరిష్కారం పేరుతో తీసుకుంటున్న చర్యలన్నీ ఎందుకు విఫలమౌతున్నాయి? ఈ ప్రశ్నలకు సిబల్ గానీ, విదేశీ సంస్థల కోసం అర్రులు చాస్తున్నవారు గానీ సమాధానం చెప్పాలి. పశ్చిమ దేశాల దృష్టిలో మన దేశం ఇప్పుడు గంగిగోవులాంటిది. ఇక్కడ ఎంత పితికితే అన్ని పాలు తాగవచ్చు. ఇటీవలి కాలంలో మన దేశంలో బిజినెస్ స్కూళ్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. గతంలో డిగ్రీ మాదిరి ఇప్పుడు ఎంబిఎ పట్టాలు ప్రతి ఒక్కరూ పుచ్చుకుంటున్నారు. ఈ స్కూళ్లలో మన దేశానికి సంగతంగాని ఉత్తర అమెరికా పాఠాలు చెబుతున్నట్లు కెనడాకు చెందిన డాక్టర్ అరిఫ్ కచరా వెల్లడించారు. భారత్ తమకు మంచి బిజినెస్ స్కూళ్ల మార్కెట్‌గా ఉందని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. వారి కంపెనీ ఇప్పటికే 400 కాలేజీల్లో పాఠాలు చెప్పగా రానున్న మూడు సంవత్సరాలలో వెయ్యి కాలేజీలకు విస్తరించనున్నది.
పార్లమెంటును కూడా పక్కన పెట్టి దొడ్డిదారిన విదేశీ విద్యా సంస్థలను రప్పించే ప్రయత్నాలు వ్యతిరేకిస్తున్నది ఒక్క సిపిఎం వంటి వామపక్ష పార్టీలే కాదు. అలా వచ్చే సంస్థలు మన న్యాయవ్యవస్థకు తెచ్చే ముప్పు గురించి సాక్షాత్తూ భారత బార్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తంచేయడమే కాదు, అందుకు నిరసనగా జులైలో లక్ష మంది లాయర్లతో న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. న్యాయవాదుల చట్టం కింద రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల, భారత కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉన్న న్యాయవిద్య, రాజ్యాంగబద్ధమైన కార్యకలాపాలను కూడా హరించివేసేందుకు కేంద్రం చట్ట సవరణ తలపెట్టినట్లు బార్ కౌన్సిల్ పేర్కొన్నది. ఈస్టిండియా కంపెనీ ప్రారంభంలోనే దేశమంతా మేల్కొని ఉంటే మనకు దిక్కుమాలిన బ్రిటీష్ పాలన దాపురించేది కాదు, దేశం వెనక్కుపోయేది కాదు. నాటి ఫ్యూడల్ ప్రభువులు దేశాన్ని బ్రిటన్‌కు అప్పగిస్తే నేటి పెట్టుబడిదారీ ప్రతినిధులు అమెరికాకు అర్పణ చేయజూస్తున్నారు. ఈ ప్రయత్నాలను రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా దేశ ప్రయోజనాలను కాంక్షించే వారందరూ ఐక్యంగా అడ్డుకోవడం అవసరం. దేశభక్తులంతా కదలాలి.