పాతికేళ్లు దాటినా బోఫోర్స్ భూతం ఇంకా కాంగ్రెస్‌ను వెంటాడుతూనే ఉంది. ఓ తెలుగు సినిమా డైలాగ్ 'బొమ్మాళీ... నిన్నొదల...' గుర్తుకొస్తుంది కదూ! స్వీడన్‌కు చెందిన బోఫోర్స్ కంపెనీ హోవిట్జర్ తుపాకులను భారత ప్రభుత్వానికి అమ్మిన సందర్భంగా చెల్లించిన 64 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన వ్యవహారమిది. రూ. 640 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్ ఇప్పటికీ మన దేశంలో చర్చనీయాంశంగానే ఉంది. 1986లో జరిగిన కుంభకోణాన్ని 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో వెల్లడించడంతో లోకం నివ్వెరబోయింది. ఆ తరువాత హిందూ పత్రిక సాధికారికమైన పత్రాలు, ఆధారాలతో బోఫోర్స్ కుంభకోణం కథా కమామిషు, దళారీల పాత్రనూ కళ్లకు కట్టినట్లు ధారావాహికంగా ప్రచురించింది. ఆనాడు హిందూ పత్రికా ప్రతినిధిగా పనిచేసిన చిత్రా సుబ్రమణ్యం బోఫోర్స్‌కు 25 ఏళ్లు నిండిన సందర్భంగా అప్పటి స్వీడన్ పోలీసు దర్యాప్తు అధికారి స్టెన్‌లింగ్ స్ట్రామ్‌ను ఇంటర్వ్యూ చేసి 'ద హూట్' అనే వెబ్ జర్నల్‌లో ప్రచురించారు. నాటి అనుభవాలను భారత, స్వీడన్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాల స్పందనలను, అధికారులు వ్యవహరించిన తీరును స్ట్రామ్ వివరించారు. దర్యాప్తు సందర్భంగా లభించిన ఆధారాలను మీడియాకు తానే అందించానని ఇప్పుడు బహిరంగపర్చారు.
బోఫోర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. 1987 నుంచి 1989 వరకూ పార్లమెంట్‌లోనూ బయటా బోఫోర్స్ కుంభకోణాన్ని ఎండగడుతూ ఉద్యమాలు నడిచాయి. లోక్‌సభలోని విపక్ష సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేసిన అరుదైన సందర్భమది. వామపక్షాలు, విపి సింగ్ తదితర ప్రజాతంత్ర శక్తులు ఆ ఉద్యమాల్లో ముందున్నాయి. ఆ ప్రభావం వల్లనే1989లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. ఆనాటి కుంభకోణాన్ని కేవలం 64 కోట్ల రూపాయలది మాత్రమేననిగాక దేశ రక్షణను పాలకులు పణంగా పెట్టారని ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. అత్యున్నత రాజకీయ పదవిలో ఉన్న నాటి ప్రధాని రాజీవ్‌కు అవినీతి మరకలు అంటడం జనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అంత తీవ్ర ఆరోపణలు అంతకు ముందరి ప్రధానులపై రాలేదు. రాజీవ్‌కు ముడుపులు ముట్టినట్లు నిర్దిష్ట ఆధారాలు లభించలేదని చెప్పి 2004లో కోర్టు కేసు క్లోజ్ చేసింది.
కేసులో ప్రధాన నిందితుడైన ఇటాలియన్ వ్యాపారి ఒటావియో ఖత్రోచి రాజీవ్ కుటుంబానికి సన్నిహితుడు. అప్పటి దర్యాప్తు సందర్భంగానూ ఇది వెల్లడయింది. ఇప్పుడు స్ట్రామ్ దాన్ని నిర్ధారించారు. తాము దర్యాప్తు చేస్తుంటే బోఫోర్స్ సంస్థ ఎండి మార్టిన్ ఆర్డ్‌బో తీవ్రంగా భయపడ్డారని స్ట్రామ్ పేర్కొన్నారు. ఎన్ (అరుణ్ నెహ్రూ) పేరు బయపటడినా పరవాలేదుగానీ క్యూ (ఖత్రోచి) పేరు మాత్రం వెల్లడికారాదని ఆర్డ్‌బో భావించాడు. ఖత్రోచి ఆర్ (రాజీవ్‌గాంధీ) కుటుంబానికి సన్నిహితుడు కనుక అంతలా భయపడ్డారని స్ట్రామ్ ఇప్పటికీ చెబుతున్నారు. 1993లో ఖత్రోచీని మన దేశం నుండి వెళ్లిపోయేందుకు అనుమతించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కావడం గమనార్హం. ఆ తరువాత మళ్లీ ఆయనను రప్పించడానికి, మన కోర్టుల ముందు నిలబెట్టడానికి సర్కారు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇదేదో కాంగ్రెస్ వారి నిర్వాకమే అనుకోరాదు. బోఫోర్స్‌ను ఒక రాజకీయ ఆయుధంలా ఉపయోగించకున్న బిజెపి దాదాపు ఏడేళ్ల తన పాలనలో అందుకోసం చిత్తశుద్ధితో ఎన్నడూ ప్రయత్నించలేదు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అనడానికి ఇదో దృష్టాంతం. తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకున్న బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను కోర్టు దోషిగా ఇప్పుడు నిర్ణయించింది. భారత అమెరికా అణు ఒప్పందం నేపథ్యంలో జరిగిన యుపిఏ -1 బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్ నోట్లకట్టలనిచ్చి అధికారాన్ని నిలబెట్టుకున్న తీరు చూశాం. తాజాగా మైనింగ్ కుంభకోణాల్లో ఆ పార్టీల నేతలు, అనుయాయులు చిక్కుకున్న తీరు జగమెరిగినదే.
బొగ్గు కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్, ఆంత్రిక్స్ దేవాస్ ఒప్పంద కుంభకోణాల్లో లక్షల కోట్ల రూపాయలు గోల్‌మాల్ జరిగింది. వీటితో పోలిస్తే బోఫోర్స్ చిన్నదిలా అనిపించవచ్చు. కానీ కీలకమైన రక్షణ శాఖకు సంబంధించిన కుంభకోణమది. అంతేగాక ఆనాటి ప్రధాని కుటుంబానికి సన్నిహితులే అందులో ప్రధాన నిందితులు. ఎన్నో ఆధారాలున్నప్పటికీ ఖత్రోచీ, విన్‌చద్దాలను భారత్‌కు రప్పించి కనీసం విచారణనైనా జరిపించకపోవడం మన పాలకుల తీవ్ర వైఫల్యం. పాతికేళ్లు నిండినా కానీ బోఫోర్స్ భూతంలా వెంటాడుతూనే ఉంది. గనుక పునర్విచారణ జరిపించి దోషులను తేల్చి వారిని శిక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. బోఫోర్స్ దోషులకు శిక్షపడేలా స్వతంత్ర విచారణ జరిపించాలి. ప్రధాన నిందితుడైన ఖత్రోచీని మన దేశానికి రప్పించి బోనులో నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. పాతికేళ్లు పూర్తయిందిలే అని వదిలేయడానికి వీలులేని కుంభకోణమిది.
java.lang.NullPointerException