అకారణంగా ఒక నల్లజాతీయుడిని చంపిన నిందితుడిని కనీసం అరెస్టు కూడా చేయకుండా మొరాయించిన అమెరికాలోని ఫ్లోరిడా పాలకులు ప్రజాందోళనతో ఒక మెట్టు దిగివచ్చారు. దేశాధ్యక్ష స్థానంలో తమ జాతీయుడు ఉన్నందున తమపై రంగు, జాతి వివక్ష, దౌర్జన్యాలకు తెరపడుతుందని భ్రమలు పెంచుకున్న ఆఫ్రో-అమెరికన్లకు గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఉదంతాలు కనువిప్పు కలిగించాయి. ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్ అనే పట్టణంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి వర్షం పడుతున్న సమయంలో ట్రేవాన్ మార్టిన్ అనే 17 సంవత్సరాల బాలుడు ఒక దుకాణానికి వెళుతున్నాడు. కాలనీకి వంతుల వారీ కాపలాలో భాగంగా తిరుగుతున్న జిమ్మర్‌మెన్ అనే శ్వేతజాతి యువకుడి కంట మార్టిన్ పడ్డాడు. ఆ సమయంలో మార్టిన్ తలను కప్పే షర్టు(గూడీ) ధరించి ఉన్నాడు. అతడు కాలనీలో దొంగతనానికి వచ్చాడని జిమ్మర్‌మెన్ అనుమానించాడు. కొన్ని క్షణాల్లోనే అనుమానం పెనుభూతమైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. వారు వచ్చే సరికి మార్టిన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆత్మరక్షణకోసం మార్టిన్‌ను తుపాకీతో కాల్చి చంపానని జిమ్మర్ పోలీసులకు చెప్పాడు. ఓస్ అదా అయితే నువ్వెళ్లిపోవచ్చని పోలీసులు అతడిని పంపేశారు. ఈ ఉదంతం అమెరికాలోని యావత్ ఆఫ్రో-అమెరికన్లను, అభ్యుదయవాదులను కుదిపేసింది. దేశవ్యాపితంగా లక్షలాది మంది ప్రదర్శనలు జరిపారు. మరణించిన సమయంలో మార్టిన్ వేసుకున్న గూడీ షర్టులు ధరించి మమ్మల్ని కూడా దొంగలుగా పరిగణించి కాల్చివేస్తారా? అదే పని చేయండంటూ వినూత్న రూపంలో నిరసనలు తెలిపారు. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయటంతో పాటు విదేశాల్లో కూడా ప్రదర్శనలు జరిగాయి. ఉద్యమం ఉధృతిలో భాగంగా మంగళవారం నాడు దేశవ్యాపిత నిరసన దినం పాటించారు. ఈనెల 24వ తేదీన చలో వాషింగ్టన్ డిసి పిలుపు ఇచ్చారు. పౌరహక్కుల ఉద్యమనేతలు జెస్సీ జాక్సన్ వంటి వారు రంగంలోకి దిగారు. తనకే గనుక ఒక కొడుకు ఉండి ఉంటే అతడు కూడా మార్టిన్ మాదిరిగానే ఉండేవాడని అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వ్యాఖ్యానించాల్సి వచ్చింది. కొంత మంది డెమోక్రటిక్‌పార్టీ ఎంపీలు కూడా గూడీ షర్టులు ధరించి ఆందోళనకారులకు సంఘీభావంగా నిలిచారు. దాంతో ఫ్లోరిడా ప్రభుత్వం నియమించిన ప్రాసిక్యూటర్ జమ్మర్‌మన్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించగానే నాటకీయంగా జిమ్మర్‌మన్ పోలీసులకు లొంగిపోయాడు.
రక్షిత అటవీ ప్రాంతాలలో జంతువులను వేటాడటం నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా ఆత్మరక్షణ కోసం అలాంటి ప్రాణులను చంపితే తరువాత ఏం చేసినా ప్రాధమికంగా కేసు నమోదు చేయటం మనకు తెలుసు. కాని అమెరికాలో నల్లజాతీయులకు వన్యప్రాణుల పాటి విలువ కూడా లేదని ఇటీవల జరిగిన ఉదంతాలు వెల్లడించాయి. ఆరేళ్ల క్రితం కత్రినా తుపాను సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళుతున్న ఒక నల్లజాతి కుటుంబ సభ్యులపై పోలీసులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఆ కేసులో ఈనెల నాలుగున నామమాత్రపు శిక్షలతో కోర్టు తీర్పు చెప్పింది. నవంబరు 19న న్యూయార్క్ పోలీసులు కెన్నెత్ చాంబర్లేన్ అనే 68ఏళ్ల హృద్రోగి ఇంటికి వెళ్లి కాల్చి చంపారు. ఎందుకు చంపారో కూడా చెప్పలేదు. మార్చి ఏడున నల్లజాతీయుడైన 22 ఏళ్ల మైఖేల్ లెమ్‌హార్డ్ అనే యువకుడిని ఇంటివరకు తరుముకుంటూ వెళ్లి కాల్చి చంపారు. ఎందుకంటే అతడు తమపై దాడి చేసినట్లు కట్టుకథలు అల్లారు. తుల్సా అనే చోట శ్వేతజాతి దురహంకారులు రెచ్చిపోయి ముగ్గురు నల్లజాతీయులను కాల్చి చంపారు. ఇవన్నీ తాజా ఉదంతాలే. వీటికి పరాకాష్ట బాలుడు, నిరాయుధుడైన మార్టిన్ హత్య. ఈ కేసులో జిమ్మర్‌మన్‌పై పెట్టిన కేసు కూడా రానున్న రోజుల్లో చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లోరిడాలో ఆత్మరక్షణ కోసం ఎవరినైనా ఎక్కడైనా చంపవచ్చనే ఒక వివాదాస్పద చట్టం ఉంది. జిమ్మర్‌మన్‌పై ఇప్పుడు సెకండ్ డిగ్రీ హత్య కేసును నమోదు చేశారు. అంటే చంపాలనే ఉద్దేశం ముందుగా లేదని, అప్పటికప్పుడు తలెత్తిన పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం హత్యకు పాల్పడినట్లు భావించిన ఉదంతాల్లో ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. దీని ప్రకారం కేసును రుజువు చేయటం దాదాపు అసాధ్యం. న్యాయమూర్తి తొలి విచారణలోనే కేసును తిరస్కరించే అవకాశం కూడా ఉంది. అసలు కేసు పెట్టటానికే తిరస్కరించిన పోలీసులు ఇప్పుడు జిమ్మర్‌మన్‌కు శిక్ష పడే విధంగా వ్యవహరిస్తారంటే నమ్మటం కష్టం.
అమెరికాలో అనేక పట్టణాలలో నల్లజాతి యువకులు ఉద్యోగాలు చేస్తున్నవారి కంటే జైళ్లలో ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. వీరిలో 50నుంచి70శాతం వరకు నిరుద్యోగులే. చేస్తున్న ఉద్యోగాలు కూడా అతి తక్కువ వేతనాలు వచ్చేవే. అందువలన వారెప్పుడూ అసంతృప్తితో రగులుతూ ఉంటారు. ఇది ఒక్క అమెరికా పరిస్థితే కాదు, కొద్ది నెలల క్రితం లండన్, మరికొన్ని నగరాలు కొద్ది రోజుల పాటు తగుల బడటానికి ఒక ఆఫ్రికన్-కరీబియన్ జాతీయుడిని కాల్చిచంపటమే కారణమని తెలిసినదే. మార్టిన్‌ను చంపటం అన్యాయమంటూ కొందరు ఒకచోట మార్టిన్ బొమ్మలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలా చేయటం 'గూండా మనస్తత్వాన్ని ప్రోత్సహించటం' అవుతుందంటూ అధికారులు వాటిని చెరిపించారు. మార్టిన్‌ను హత్య చేసిన జిమ్మర్‌మన్‌ను పొగుడుతూ ఓహియో విశ్వవిద్యాలయంలో రాసిన రాతలను మాత్రం అలాగే ఉంచారు. నల్లజాతి విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఒక పాఠశాలలో మార్టిన్ కుటుంబ సహాయ నిధి వసూలు, గూడీలు ధరించి విద్యార్థుల నిరసన కార్యక్రమాలను ప్రోత్సహించారన్న ఆరోపణపై ఒక టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తాముంటామంటూ స్వంత డబ్బా కొట్టుకొనే అమెరికన్ మీడియా ఈ ఉదంతాలన్నింటినీ సాధ్యమైన మేరకు తొక్కిపెట్టేందుకే ప్రయత్నించింది.
మన దేశంలో ఎస్‌సి, ఎస్‌టిల వంటి బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు వాటి పట్ల అధికార యంత్రాంగం ఎలా వ్యవహరిస్తున్నదీ ఇక్కడ ప్రస్తావించటం సముచితం. అమెరికాలో మాదిరి మనం కూడా ఎక్కడ అన్యాయం, అక్రమం జరిగినా ఒక్కటై స్పందించాల్సిన అవసరాన్ని మార్టిన్ ఉదంతం తెలియజేస్తున్నది. దారిమళ్లుతున్న సబ్‌ప్లాన్ నిధుల విషయంలో అలాంటి ఐక్య ప్రయత్నం ప్రారంభమైంది. అది మరింత విస్తరించి ఇతర అన్యాయాలను కూడా ఎదిరించే స్థాయికి ఎదగటం అవసరం.