స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో ప్రభుత్వ ప్రమేయంతో సాగిన అత్యంత దారుణ మత మారణ కాండగా పేరొందిన గుజరాత్ నరమేథంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర నిలకడ మీదనైనా బయటపడక మానదు. పదేళ్ల క్రితం గోద్రా దుర్ఘటన అనంతరం సాగిన ఈ నరమేథంలో 1200 మంది దాకా అమాయక ముస్లింలు బలయ్యారు. ముస్లింలను లక్ష్యంగా పెట్టుకుని సాగించిన తొమ్మిది ప్రధాన ఊచకోత ఘటనల్లో ఒకటైన గుల్బర్గాసొసైటీ కేసులో దర్యాప్తునకు సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముఖ్యమంత్రి మోడీని ప్రాసిక్యూట్ చేసేందుకు తగిన ఆధారాలేవీ లభించలేదని ఇచ్చిన క్లోజర్ రిపోర్టును దిగువ స్థాయి విచారణ కోర్టు వెల్లడించడంతో న(నే)రేంద్ర మోడీ భుజాలెగరేస్తున్నాడు. సిట్ నివేదికే సర్వస్వం, అంతిమం అన్నట్లుగా మోడీ అండ్ కో ఊదరగొడుతున్నది. దానికి మీడియాలో ఒక సెక్షన్ కూడా వంతపాడుతున్నది. సిట్ అనేది సుప్రీం కోర్టు నియమించిన ఒక దర్యాప్తు బృందం. అది ఇచ్చిన నివేదిక న్యాయస్థానం తీర్పును ప్రభావితం చేయొచ్చు. ఏదేమైనా దీనిపై అంతిమంగా తీర్పు చెప్పాల్సింది సర్వోన్నత న్యాయస్థానం. మాజీ ఎంపి అషన్ జఫ్రీ మరో 68 మందిని ఊచకోతకు గురైన గుల్బర్గా సొసైటీ కేసులో మోడీపైన, మరో 57 మంది బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జఫ్రీ భార్య జకియా చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని సుప్రీం కోర్టు నియమించిన ఈ దర్యాప్తు బృందం మోడీని కేవలం తొమ్మిది గంటలు మాత్రమే విచారించింది. సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను బట్టి మోడీకి ఈ కేసుతో సంబంధం లేదని ఒక నిర్ధారణకు వచ్చింది. అంతేకానీ, తాను సేకరించిన సాక్ష్యాధారాలను క్రాస్ చెక్ చేసుకున్న దాఖలాలు లేవు. సిట్ నివేదికపైన, దానికి నాయకత్వం వహించిన రాఘవన్‌పైన విమర్శలు వెల్లువెత్తడానికి ఇదే కారణం. సిబిఐ మాజీ డైరక్టర్ రాఘవన్ గుజరాత్‌లోని ఒక పారిశ్రామిక సంస్థలో డైరక్టర్‌గా వున్నారని, ఆ సంస్థకు మోడీ ప్రభుత్వం వందలాది కోట్లు లబ్ధి చేకూర్చిందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిట్ నివేదిక విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తడం సహజమే. దీనికి తోడు సిట్ దర్యాప్తు తీరు కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేదిగాఉంది. హరేన్ పాండ్యా సిటిజన్స్ ప్యానల్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నరమేథం సందర్భంగా మోడీ హోం శాఖ మంత్రిగా ఉన్న తనను పక్కన పెట్టి సర్వం తానై ఎలా వ్యవహరించినదీ చెప్పారు. గోద్రాలో సబర్మతి రైలు దగ్ధం అనంతరం 2002 ఫిబ్రవరి27 రాత్రి ముఖ్యమంత్రి మోడీ పోలీస్ ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం గురించి మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్‌భట్ తన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయం సిట్ దృష్టికి రాకపోవడం విస్మయం కలిగిస్తుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ ప్రముఖులతో కూడిన సిటిజన్స్ ఫోరమ్‌లు గుజరాత్‌లో పర్యటించి నిగ్గుతేల్చిన నిజాలకు, సిట్ నివేదికలో వెల్లడించిన అంశాలకు పొంతన కుదరకపోవడం సిట్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్న మరో అంశం. బెస్ట్‌బేకరీ, బిల్కి బానో కేసుల్లో బాధితుల సాక్ష్యాధారాలను మాఫీ చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎలా వ్యవహరించినదీ తెలిసి కూడా సిట్ మోడీ పట్ల చాలా ఉదారంగా వ్యవహరించింది. ఆయన చెప్పినవే నిజాలన్నట్లు, తాను సేకరించినవే నికార్సయిన ఆధారాలన్నట్లు అది భావించింది. పది మంది, పదిహేను మంది హత్యకు గురైన అనేక కేసులను ఇలాగే ఆధారాలులేవని కింది కోర్టులు కొట్టివేశాయి. దీంతో బాధితులకు ఇప్పటికీ చాలా కేసుల్లో న్యాయం జరగలేదు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే వడోదరా (బరోడా), నరోడా పాటియా వంటి అత్యంత క్రూరమైన హత్యాకాండ కేసుల్లో కూడా న్యాయం హుళక్కి అవుతుందన్న భావనతో సుప్రీం కోర్టు బెస్ట్‌బేకరీ, బిల్కి బానో వంటి కేసులను గుజరాత్ నుంచి ముంబయి కోర్టుకు బదలాయించింది. మానవహక్కుల సంఘాలు, మేధావులు, సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు అందరూ గట్టిగా పోరాడబట్టి 33 మందిని సజీవదహనం చేసిన సర్దార్ పురా, 18మంది మహిళలు, పిల్లలతో సహా 23 మంది ఊచకోతకు సంబంధించిన ఓడ్ కేసుల్లో దోషులకు శిక్ష పడింది. ఇంకా అనేక కేసులు దర్యాప్తు సరిగా సాగక విచారణ నత్తనడకన సాగుతున్నది. ఆధారాలు లేవని గుజరాత్ పోలీసులు చాలా కేసులను మూసివేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని వీటిలో కొన్నిటిని తిరిగి తెరిపించింది. పోలీస్ అధికారులతో కుమ్మక్కయి న్యాయాన్ని సమాధి చేయాలని చూస్తున్న మోడీని బోనులో నిలబెట్టాల్సిన సిట్ ఆయన పాపాలను కప్పిపుచ్చేందుకు సాధనంగా ఉపయోగపడడం బాధాకరం. లొసుగులమయమైన సిట్ నివేదికను ఆమోదించడమంటే ఊచకోత కేసుల్లో బాధితులకు న్యాయం నిరాకరించడమే అవుతుంది. గోద్రా ఘటనలో విచారణ త్వరితగతిన పూర్తయి 11 మందికి మరణ శిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చూసిన మోడీ ప్రభుత్వం గోద్రా అనంతర ఊచకోత కేసుల్లో దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడుతున్నది. ఈ అననుకూల పరిస్థితుల్లో సైతం సర్దార్‌పురా కేసులో తీర్పు వెలువడిందంటే అది సుప్రీం కోర్టు చొరవ ఫలితమేననిచెప్పాలి. దానికి కొనసాగింపే ఓడ్ కేసులో వెలువడిన తాజా తీర్పు. ఇదే స్ఫూర్తితో గుల్బర్గా సొసైటీ కేసుతో సహా మిగతా ఊచకోతల కేసుల్లో విచారణను త్వరితగతిన పూర్తి చేసి దోషులకు శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది.