ఆకస్మిక తనిఖీలతో జిల్లా కలెక్టర్ వరప్రసాద్ అధికారులను హడలెత్తిస్తున్నారు. ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లాలోని ఆయా మండలాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సెట్‌రైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా.. అధికారులపై మండిపడుతున్నారు. దీంతో ఏ మండలానికి ఎప్పుడు వస్తారోనని అధికారులు జంకుతున్నారు. బుధవారం ఆయన మాచారెడ్డి మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యపు నీడలు ఆయన కంటబడ్డాయి. ఇంకేముంది.. సంబంధిత అధికారులకు చివాట్లు పడ్డాయి.
మండలంలోని తహసీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలతో పాటు అన్నారం గ్రామంలోని పిహెచ్‌సి ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మండలానికి ఆకస్మిక తనిఖీలకు వచ్చి అధికారులను విస్మయానికి గురి చేశారు. అధికారుల పని తీరు, కార్యాలయాల పనితీరు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. మొదటగా మండలంలోని అన్నారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న డాక్టర్, సిబ్బంది పని తీరును ఆయన మెచ్చుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సుధారాణిని ఈ విషయమై ప్రశ్నించారు. సిబ్బందిని సక్రమంగా వినియోగించుకుంటూ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఇలా తాళాలు వేసి ఉంచితే ఎలా అంటూ మండిపడ్డారు. తహసీల్దార్ కొమురయ్య ఏమయ్యారని అడగగా ఆయన సెలవులో ఉన్నట్లు డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. కార్యాలయంలో కనీసం అటెండర్లనైనా ఉంచి తాళాలు తీయించాల్సిందని, తాళం వేసుకొని వెళ్తే వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజల సంగతి ఏమిటని ప్రశ్నించారు. అనంతరం పక్కనే ఉన్న ఎంపిడిఓ కార్యాలయానికి వెళ్లారు. ఎంపిడిఓ సైతం అందుబాటులో లేకుండాపోయారు. సిబ్బందిని అడగగా ఆయన నిజామాబాద్ వెళ్లినట్లు కలెక్టర్‌కు తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో ఎలాంటి సమాచారమూ పొందుపర్చకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తనిఖీకి వచ్చారన్న విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురై అప్రమత్తమయ్యారు. ఎంపిపి ఫకీరానాయక్, ఎంపిటిసి శ్రీనివాసచారి అక్కడికి చేరుకుని మండలంలోని 24 పంచాయతీలకు గాను ముగ్గురు కార్యాదర్శులు మాత్రమే ఉన్నారని, దీంతో ప్రజలు ధ్రువీకరణ, ఆదాయపత్రాలు, ఇతర పనుల కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నీటి సమస్య గురించి తెలిపారు. దీంతో ఏయే ప్రాంతాల్లో నీటి సమస్య జఠిలంగా ఉందో పూర్తి వివరాలతో తనకు నివేదిక పంపాలని సూచించారు. పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల స్థితిగతుల గురించి, అధికారుల పనితీరు, గ్రామాలు, ప్రజల జీవనవిధానం, నీటి సమస్య, ఆరోగ్యం, తదితర అంశాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు.
లబ్డబ్...!
లెక్కింపుకు పకడ్బంధీ ఏర్పాట్లు : కలెక్టర్ వరప్రసాద్
లెక్కింపుకు పకడ్బంధీ ఏర్పాట్లు : కలెక్టర్ వరప్రసాద్
టెన్షన్..టెన్షన్..
తాగునీరు, అపరిశుభ్రతపై కౌన్సిలర్ల ఆగ్రహం
రూ.20 వేలకు గ్రామ కోఆర్డినేటర్ పోస్టు
మరోమారు ప్రేమోన్మాది ఘాతుకం
ఆలిండియా తరగతులకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ నాయకులు
మున్సిపల్ ఎదుట అఖిలపక్షం ధర్నా