సిసి రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపం

  • మంత్రి ఆదేశాలు బేఖాతరు
  • కన్నెత్తిచూడని అధికారులు

: రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి సొంత మండలానికి అభివృద్ధి పనులప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రతిసమావేశంలో పనుల నాణ్యతను పాటిఅధికారులకు, శ్రేణులకు కాంట్రాక్టర్లకు పదేపదే చెబుతుంటారు. కానీ వారు మాత్రం మంత్రి మాటలను పెడచెవిన పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి పనులను నాణ్యతా లోపంతో చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మండలంలోని అభంగపట్నం గ్రామంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో పదిలక్షల రూపాయల వ్యయంతో 370 మీటర్లమేర చేపట్టిన సిసిరోడ్డును సదరు కాంట్రాక్టర్‌ పాండురంగారెడ్డి నాణ్యతాలోపంతో నిర్మించాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఒక బస్తా సిమెంట్‌కు వేయాల్సిన ఇసుక, కంకరను రెట్టింపుగావేసి పనులు పూర్తిచేశాడని గ్రామస్తులు చాంద్‌పాష, పోశెట్టి ఆరోపించారు. వాటర్‌ క్యూరింగ్‌ సరిగ్గా చేయకపోవడంతో రోడ్డు సంవత్సరకాలం పాటైన ఉంటుందో ఉండదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే రోడ్డునుంచి కంకర తేలుతుండటంతో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సదరు కాంట్రాక్టర్‌ మంత్రి బావ కావడం గమనార్హం. మంత్రి బావనే కాంట్రాక్టర్‌ కాబట్టి అధికారులు అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రయత్నించలేదు. వారి పర్యవేక్షణ లోపించింది. కాంట్రాక్టర్‌ చేసిందేపని అన్నట్లుగా ఉంది. ఆయన సిమెంట్‌, కంకర, ఇసుక ఎంత వేస్తే అంతే. కాంట్రాక్టర్‌కు ఎదురు మాట్లాడే వారు అక్కడ లేరు.

రోడ్లు విస్తీర్ణం పెంచాలి : పది లక్షల రూపాయలతో 370 మీటర్లు వేసిన రోడ్డు విస్తీర్ణాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాల వరకు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి చొరవ చూపి సుమారు 100 మీటర్లు పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మంత్రి దయచూపితే... బావ దగా చేశారు...: ముత్యాల మల్లేషం

మంత్రి గ్రామస్తులపై దయ చూపి సిసి రోడ్డును మంజూరు చేస్తే ఆయన బావ పాండురంగారెడ్డి కాసులకు కక్కుర్తిపడి గ్రామస్తులను దగా చేశాడు. రోడ్డుకు నీటిక్యూరింగ్‌ సరిగ్గా చేయకపోవడం, సిమెంట్‌ శాతం తక్కువగా ఉండటంతో కంకర రాళ్లు తేలుతున్నాయి. దీంతో ఇటీవలే వేసిన రోడ్డు ఎన్ని రోజులు ఉంటుందో వేచి చూడాలి.

నీళ్ల క్యూరింగ్‌ తప్పనిసరి : పోశెట్టి

ప్రస్తుతమున్న ఎండకు నీళ్ల క్యూరింగ్‌ తప్పనిసరిగా చేయాలి. సిమెంట్‌ శాతం తక్కువగా ఉండటం, నీళ్ల క్యూరింగ్‌ చేయకపోవడంవల్ల కంకర పైకి తేలుతోంది. దీనిపై మంత్రి జోక్యం చేసుకుని నాణ్యతగల రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి.