దొరకని ఉన్మాది

ఇద్దరు అనుమానితులు విచారణ

భయంతో జనం జాగారం

ప్రజాశక్తి - తడ

ముగ్గుర్ని హత్య చేసిన ఉన్మాది పోలీసులకు ఇంకా దొరకలేదు. నిందితుని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానమున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారించాక వారు కాదని నిర్ధారించుకుని వదిలేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌ తేరుకున్నాక గానీ ఉన్మాది ఊహాచిత్రం రూపొందించడం సాధ్యం కాదని ఎస్‌పి బి.వి.రమణకుమార్‌ తెలిపారు. తడ వద్ద గురువారం తెల్లవారుజామున భద్రాచలం నుంచి చెన్నరు వెళ్తున్న ఆర్‌టిసి బస్సులో ముగ్గురి ప్రయాణికులను ఉన్మాది హత్య చేసిన ఉదంతం తెలిసిందే.

పోలీసులు ఉన్మాది కోసం శుక్రవారం పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ప్రత్యేక బలగాలు భారీగా కూబింగ్‌ నిర్వహించినా ఉన్మాది ఆచూకీని కనిపెట్టలేకపోయారు. దాంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడు ప్రాంతాల ప్రజలు వణికి పోతున్నారు. రాత్రి వేళల్లో జనం జాగారం చేస్తున్నారు. ముఖ్యంగా కరెంటు కోతలుండడంతో రాత్రి వేళల్లో గ్రామీణులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విలవిల్లాడుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భారీగా పోలీసు బలగాలు తడ పరిసరాలు, చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం, సత్యవేడు, కడూరు క్రాస్‌రోడ్డు, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాల్లోని అడవుల్లో ఉన్మాదికోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఉన్మాది జాడ కనిపించకపోవడంతో పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక పోలీస్‌ స్టేషన్ల నుండి అధిక సంఖ్యలో పోలీస్‌ బలగాలను రప్పించి పలుచోట్ల ముమ్మరంగా గస్తి ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రజలు కూడా సైకో ఎక్కడ తమ ప్రాంతాలకొచ్చి హత్యలు చేస్తాడోనని ఆందోళనకు గురవుతున్నారు. మూడు హత్యలకు పాల్పడింది సాంబ, ఆంటోని కాకపోవచ్చునని జిల్లా పోలీస్‌ అధికారులు బహిరంగంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాలో పలు హత్యలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న సాంబా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతల్లో హత్యలు చేసి తప్పించుకున్న తిరుగుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఆంటోనీలలో ఒకరు ఈ మూడు హత్యలను చేసి ఉండవచ్చనని మరోవైపు ప్రచారం జరుగుతోంది. పోలీస్‌ అధికారులు శరవేగంగా గాలించి నిందితుణ్ని పట్టుకుంటే తప్ప ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. డిస్కం అధికారులు ఉన్మాది దొరికే దాకా విద్యుత్‌ సరఫరాలో కోత విధించకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అడిగో సాంబ.. ఇడిగో ఆంటోని అంటూ పుకార్లు షికార్లు..

'అడిగో సాంబ... ఇడిగో ఆంటోని' అంటూ కొందరు పుకార్లు పుట్టిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎరుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఎవడైనా కన్పిస్తే ఉన్మాదంటూ భయపడుతున్నారు. వరదయ్యపాళెం మండలంలో అటవీ ప్రాంతంలో ఒడిస్సాలోని గంజాం ప్రాంతానికి చెందిన యువకుడు మదన్‌ అనుమానంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. సైకో కాదని నిర్ధారించాక వదిలేశారు. గూడూరు రైల్వే జంక్షన్‌లో ఎర్ర టీ షర్టు, నల్లని జీన్స్‌ ప్యాంట్‌ ధరించి భద్రాచలానికి చెందిన శీను అనుమానస్పదంగా కనిపించడంతో ఆప్రాంత ట్రాఫిక్‌ పోలీసులు అతన్ని పట్టుకుని తడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఉన్నత అధికారుల ముందు విచారణ జరిపించారు. ఈ యువకుడు కూడా సైకో కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.