ప్రజాశక్తి - నెల్లూరు
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలూ జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.రామిరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం తన ఛాంబర్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై ఎగ్జామినేషన్ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలోని 62 కేంద్రాల్లో 179 కళాశాలల్లో ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసుశాఖకు సూచించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అంతేగాక పరీక్షల సమయంలో చుట్టుపక్కల జెరాక్స్ షాపులను మూయించాలన్నారు. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స, తాగునీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా సిటింగ్ స్క్వాడ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా తహశీల్దార్లు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో కరెంటు కోత వేళల్లో మార్పులు చేయాలని డిస్కం అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా స్టోరేజీ పాయింట్ల వద్ద నిఘా ఉంచాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఎపిఎస్‌ఆర్‌టిసి వారు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పంపేలా చూడాలన్నారు. సమావేశంలో డిఇఓ మువ్వా రామలింగం, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, అదనపు ఎస్‌పి కె.నాగేశ్వరరావు, ఇండర్మీడియెట్ పరీక్షల నిర్వహణ కన్వీనర్ వై.పరంధామయ్య, సభ్యులు టి.శ్రీనివాసులు, ఎం.ఎస్. రవికుమార్, కె.ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
11న చీఫ్ సూపరింటెండెంట్ల సమావేశం
ఈనెల 16 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న దృష్ట్యా ఈనెల11వ తేదీన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ల ఆఫీసర్సు, అడిషనల్ సూపరింటెండెంట్ల సమావేశం స్థానిక కెఎసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని ఆర్‌ఐఓ పరంధామయ్య తెలిపారు. సమావేవానికి అధికారులందరూ తప్పక హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.