బడానాయకుల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం బడానాయకుల కొమ్ముకాస్తుందని ఎపి రైతు సంఘం గూడూరు డివిజన్‌ కన్వీనర్‌ కటికాల వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఎన్‌జిఓ హోమ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు డివిజన్‌లో బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళజాతి సంస్థలు వేల ఎకరాల భూములను ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందన్నారు. ఈ భూములు అధికంగా నిరుపేదలవేనన్నారు. జానెడు జాగా కోసం నిరుపేదలు ఉద్యమిస్తే జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేసే ప్రభుత్వం, బడాబాబులకు మాత్రం వేల ఎకరాలు ధారాదత్తం చేయడం దారుణమైన అంశమన్నారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదన్నారు. రైతు సంఘం డివిజన్‌ నాయకులు ఎస్‌కె. కాలేషా మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు ఇది రైతుల, పేదల ప్రభుత్వమని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. స్వాతంత్య్రం తర్వాత వామపక్షాల ఆధ్వర్యంలో అనేక భూపోరాటాలు జరిగాయన్నారు. అందులో భాగంగానే చిల్లకూరు మండలం వరగలి రామచంద్రారెడ్డి అనే జమీందార్‌ వద్ద 4,500 ఎకరాల సీలింగ్‌ భూములున్నాయని గుర్తించారన్నారు. ఆ భూముల్లో 2,700 ఎకరాలను అప్పట్లో పేదలకు పంపిణీ చేశారన్నారు. అయితే ప్రస్తుతం అదేస్థాయిలో భూ దోపిడీ సాగుతోందన్నారు. సెజ్‌ల పేరుతో వేల ఎకరాలను ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతోందన్నారు. చిల్లకూరుమండలం అంకులపాటూరులో నిర్మించిన ఎస్‌బిక్యూ స్టీల్‌ ఫ్యాక్టరీకు తొలుత 750 ఎకరాలను రెవన్యూ అధికారులు అప్పగించారన్నారు. రెండో విడతలోనూ మరో 750 ఎకరాలను అప్పగించారన్నారు. ప్రస్తుతం తాజాగా 1600 ఎకరాలను ఆ కంపెనీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. గూడూరు డివిజన్‌లోని ఏడు సర్వేయర్ల బృందాలు మండలంలోని చింతవరం, అంకులపాటూరు, కలవకొండ, ఏరూరు గ్రామాలకు చెందిన ప్రభుత్వ, పేదలు సాగుచేసుకుంటున్న భూములలో సర్వే నిర్వహిస్తున్నారన్నారు. సర్వేకు ముందు నిబంధనల మేరకు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాల్సిఉందన్నారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకనే సర్వే నిర్వహిస్తున్నారన్నారు. సేకరించిన భూములకు బదులుగా ప్రత్యామ్నాయ భూములు ఇస్తారా..లేక నష్టపరిహారం చెల్లిస్తారా అనే విషయాన్ని కూడా వెల్లడించలేదన్నారు. పేదల భూములు పేదలకే చెందాలన్నారు. నిరుపేద రైతులకు అన్యాయం జరిగితే రైతు సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జోగి శివయ్య పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్