రెండ్రోజులకోసారే.. మంచినీరు సరఫరా


  • అల్లాడుతున్న ప్రజలు పట్టని పాలకులు, అధికారులు

రెండ్రోజులకోసారే మంచినీరు సరఫరా అవుతోంది. అదీ మిట్టమధ్యాహ్న సమయంలో. చుక్కనీటికోసం ప్రజలు అల్లాడుతున్నారు. పాలకులు, అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ దుస్థితి దివిపాళెం పంచాయతీలో నెలకొంది. ఈ పంచాయతీ గూడూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది.పంచాయతీలో దివిపాళెం, అడవయ్యకాలనీ, సవటపాళెం, పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌, గాంధీనగర్‌, తిలక్‌నగర్‌ గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 10వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. మంచినీటి సరఫరా కోసం వేములపాళెం, సవటపాళెం, తిలక్‌నగర్‌, దివిపాళెంలలో మోటార్‌ పాయింట్లు ఏర్పాటుచేసి ఉన్నారు. ఇటీవల వార్డు సభ్యులు పంచాయతీలో ఇంటింటికి కుళాయి కోసం తీర్మానం చేశారు. అయితే కార్యదర్శులు వాటిని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లలేదనే ఆరోపణలున్నాయి. పంచాయతీ పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ మిట్టమధ్యాహ్న సమయంలో మంచినీటి సరఫరా చేస్తున్నారు. అదీ రెండురోజులకోసారి గంట మాత్రమే. దీంతో మండుటెండల్లో మంచినీటి కోసం మహిళలు బారులు తీరుతున్నారు. ఏళ్ల తరబడి మంచినీటి సమస్య ఉన్నప్పటికీ పరిష్కారం దిశగా ఎవరూ చర్యలు తీసుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుందరయ్యనగర్‌లో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. అధిక శాతం ప్రజలు కూలినాలీ చేసుకుని జీవనం సాగించేవారే. ఈ ప్రాంతంలో నాలుగేళ్ల కితం మంచినీటి ట్యాంకు నిర్మించారు. అయితే నేటికీ అది నిరుపయోగంగానే ఉంది. దానిని వినియోగంలోకి తీసుకురావాలని పలుమార్లు అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయింది. నాలుగు నెలల కితం కలెక్టర్‌ రామ్‌గోపాల్‌ ఈ కాలనీని సందర్శించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 13లక్షల రూపాయలతో పైప్‌లైన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయితే నేటికీ పైప్‌లైన్‌నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నెల రోజుల క్రితం 15 కోట్ల రూపాయలతో గూడూరు మండలంలో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఇటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అటు టిడిపి ఎంఎల్‌ఎలు విలేకర్ల సమావేశాల్లో ప్రకటించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సవటపాళెంలో మంచినీటి కుళాయిలున్నప్పటికీ మంచినీరు ఎప్పుడు సరఫరా అవుతుందో తెలియని పరిస్థితి. బిందెలు కుళాయిల వద్ద పెట్టుకుని మండుటెండల్లో కూర్చోవాల్సిన దుస్థితి. తరచూ మంచినీటి కోసం ఈ ప్రాంతంలో ప్రజలు వాగ్వాదాలు చేసుకుంటుంటారు. సంబంధిత అధికారులు, పంచాయతీ పాలకులు మాత్రం ప్రతి ఏడాది మంచినీటి ట్యాంకుల, కుళాయిల మరమ్మతుల నిమిత్తం లక్షల రూపాయలు నిధులు డ్రా చేసుకుంటున్నారని పలువురు వార్డు సభ్యులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. పంచాయతీకి శాశ్వత మంచినీటి సరఫరా సిబ్బంది లేరు. పంచాయతీకి రాబడి ఉన్నా సక్రమంగా వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. మంచినీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిధులు 15కోట్ల రూపాయలు విడుదల కానున్నట్లు ఎంఎల్‌ఎతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నిధులు దివిపాళెం పంచాయతీ తాగునీటి సమస్యల పరిష్కారానికి మాత్రం వినియోగించడడం లేదని తెలిసింది. మండలంలో మంచినీటి సమస్య తీర్చేందుకు ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దివిపాళెం పంచాయతీ ప్రజల దాహార్తిని తీర్చాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిఉంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్