పసలేని బడ్జెట్‌

మొరార్జీ దేశారుతో పాటు ఎనిమిది సార్లు యూనియన్‌ బడ్జెట్‌ సమర్పించిన ఖ్యాతి గడించిన చిదంబరం 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌లో పస ఎంతమాత్రం లేదని చెప్పాలి. సమస్యలను ఏకరువు పెట్టిన ఆర్ధిక మంత్రి వాటికిి సమర్థవంతమైన పరిష్కారాలను ప్రతిపాదించడంలో విఫలమయ్యారు. నిన్ననే పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి అభివృద్ధి రేటు కేవలం 5 శాతానికి పడిపోయిందని, అది అక్కడితోనే ఆగిపోతుందని గ్యారంటీగా చెప్పలేమని కూడ పేర్కొంది. ఈ రోజు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే రిజర్వుబ్యాంకు 5.5 శాతం ఉంటుందని అంచనా వేసిందని, ఏదేమైనా భారత దేశం సాధించకలిగిన 8 శాతం కన్నా తక్కువేనని డొంకతిరుగుడుగా మాట్లాడారు.

ద్రవ్యోల్బణం గురించి కూడ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. టోకు ధరల సూచి ప్రకారం 7.0 శాతం ఉన్న ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి ఆహార సరుకుల విషయంలో మరింత ఎక్కువగా ఉందని చెప్పారు. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 5.2 శాతం ఉంటుందని, 2013-14లో దాన్ని 4.8 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. కరెంటు ఎకౌంట్‌లో లోటు అనేది మరో పెద్ద సమస్య అని, దీన్ని భర్తీ చేయడానికి 7500 కోట్ల డాలర్ల నిధులు అవసరమవు తాయన్నారు. ''సమానత్వాన్ని సాధించడం నైతిక బాధ్యత, అదే సమయంలో స్థిరమైన ఆర్ధికాభివృద్ధిని సాధించవలసిన అవసరం కూడ ఉంది. ప్రజలనేవారు అత్యంత ప్రధానమైన వనరు'' అని నోబుల్‌ బహుమతి గ్రహీత జోసఫ్‌ స్టిగ్లిజ్‌ను ఉటంకించిన ఆర్థిక మంత్రి కొన్ని రాష్ట్రాలు ఆర్థికాభివృద్ధిని సాధించినప్పటికీ మహిళలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు, వెనకబడిన తరగతులను విస్మరించాయని, యుపిఏ వైఖరి అది కాదని సమ్మిళిత అభివృద్ధే దాని ధ్యేయమని గొప్పగా చెప్పారు. మానవాభివృద్ధి సూచికల్లో మెరుగుదలను సాధించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మహిళలు, బాలలు, యువత తమ లక్ష్యమని చిదంబరం తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.

ఇన్ని విషయాలు చెప్పిన ఆర్థిక మంత్రి వీటి సాధనకు ప్రతిపాదించిన అంశాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. అధిక ధరలు, ద్రవ్యోల్బణం గురించి చెప్పి దాన్ని తగ్గించడానికి నిర్దిష్టమైన చర్యలేమీ ఆయన ప్రకటించలేదు. ఆహార సరుకుల ధరలు తగ్గించాలంటే, సరఫరాలను మెరుగుపరచాలని, దానికోసం హరిత విప్లవ ప్రాంతాన్ని విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాని ఇవి సమస్యకు సరైన పరిష్కారం కాదు. ఒక వేళ అలా అనుకున్నా అవి ఫలించడానికి చాల కాలం పడుతుంది. ఆహార సరుకుల ధరలు పెరగడానికి ఓ ప్రధాన కారణం ఆహార ధాన్యాల వ్యాపారంలో ఫ్యూచర్స్‌, ఆప్ఫన్స్‌ను అంగీకరించడం అని బాధ్యతాయుతమైన ఆర్ధిక నిపుణులు, రాజకీయవేత్తలు చెబుతున్నారు. అయినా దాన్ని నిలిపివేయడానికి బదులు ఫ్యూచర్స్‌ వ్యాపారానికి మరింత ఊపునిచ్చే చర్యలను ఆయన ప్రకటించారు. చమురుదిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం, అధిక పరిమా ణంలో బొగ్గు దిగుమతులు, బంగారంపై మనమోజు, ఎగుమతులు మందగించడం- ఈ పరిస్థితుల్లో కరెంటు ఎకౌంటు లోటును సరిచేయాలంటే ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఐఐ, విదేశీ వాణిజ్య రుణాలే శరణ్యమని చెప్పిన ఆర్థిక మంత్రి వాటిని తెచ్చుకోవడానికి పలు రాయితీలను ప్రకటిం చారు. వీటిలో ఓ ముఖ్యమైనది, ఓ కంపెనీ ఈక్విటీలో 10 శాతం మించని ఏ పెట్టుబడినయినా ఎఫ్‌ఐఐగానే పరిగణించడం. అంతేకా కుండా ఎఫ్‌ఐఐలు కార్పొరేట్‌ బాండ్లలో తమ పెట్టుబడులను, ప్రభుత్వ సెక్యూరిటీలను, మరింత స్టాక్స్‌ కొనుగోళ్లలో మార్జిన్‌ మనీగా ఉపయోగించుకోవచ్చునని ఆర్ధిక మంత్రి చెప్పారు. అంటే, ఎఫ్‌ఐఐలు మరింత స్పెక్యులేషన్‌కు పాల్పడటానికి అంగీకరిం చడమే. పన్ను ఎగ వేతను నిరోధించడానికి ఉద్దేశించిన గార్‌ ను పాతిపెట్టేశామని ఇప్పటికే ప్రకటించిన చిదంబరం, ఈ బడ్జెట్‌లో దాన్ని ఎంత జాగ్రత్తగా అమలు చేస్తామో బడాకార్పొరేట్‌ సంస్థలకు హామీ ఇచ్చారు. ద్రవ్యలోటును అదుపు చేయడానికి చిదంబరం తీవ్రమైన విమర్శలకు గురైన కేల్కర్‌ కమిటీ సిఫార్సులనే ముందుకు తెచ్చారు. ద్రవ్య పటిష్టతకు ఆయన సూచించిన వాటిని అమలు చేయడమే మార్గమని పేర్కొన్నారు. సబ్సిడీలకు కోత, పరోక్షపన్నుల పెంపు అనేవి వాటిలో ప్రధానమైనవి. అత్యంత ధనవం తులకు అదనపు పన్నులు వేసే ప్రతిపా దనలు కూడ అంతంత మాత్రమే తప్ప వాస్తవంలో ప్రభావం చూపకలిగినంతవిగా లేవు. అభివృద్ధి రేటును అధికం చేయాలని ఆర్ధిక మంత్రి చెప్పినప్పటికీ ప్రణాళికా వ్యయం మాత్రం మొత్తం వ్యయంలో మూడో వంతు మాత్రమే. అందులోను 47 శాతానికి ప్రైవేటు రంగమే బాధ్యత వహిస్తుందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు. వినియోగానికి బదులు, పొదుపును అధికంచేసి పెట్టుబడులను పెంచాలని చెప్పిన చిదంబరం కార్పొరేట్‌ రంగం 34.4 శాతం ఆదాయం పన్ను చెల్లించాల్సిఉన్నా వాస్తవంలో 22.85 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని బడ్జెట్‌ పత్రాలలో తెలిపారు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు, మహిళలు, వెనకబడిన వర్గాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న చిదంబరం వారికోసం ప్రకటించిన చర్యలు అంతంత మాత్రమే. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ల నిధులను గత బడ్జెట్‌ అంచనాలకన్నా 12.5 శాతం పెంచానని చెప్పిన ప్పటికీ, అవి వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా మాత్రం లేవు. రు. 1000 కోట్ల పెట్టుబడితో అంతా మహిళలే ఉండే ప్రభుత్వ రంగ బ్యాంకు ను ప్రారంభిస్తామనడం కూడ ప్రచారానికి ఎక్కువగా పనికొస్తుందే తప్ప వాస్తవంగా వారి పరిస్థితిని ఎంతమేరకు మెరుగుపరుస్తుందన్నది సందేహం.

ఆహార భద్రత ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పిన చిదంబరం, త్వరలోనే పార్లమెంటులో ఆహార భద్రత బిల్లు వస్తుందని ఆశిస్తున్నానని, దాని కోసం ముందుగానే ప్రస్తుత ఆహారసబ్సిడీకి అదనంగా మరో రు.10,000 కోట్లు కేటాయించుతున్నానని తెలిపారు. కాని ప్రస్తుతం రు.90,000 కోట్ల ఆహార సబ్సిడీకి ఇస్తున్నారు. దానికి రు.10,000 కోట్లు కలిపితే రు.లక్షకోట్లు మాత్రమే అవుతుంది. అయితే, ఆహారభద్రతను ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటున్న పద్ధతిలో అది అసంపూర్ణమే అయినప్పటికీ అమలుచేయాలంటే ప్రభుత్వ అంచనాల ప్రకారమే రు.1.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. రు.2లక్షల కోట్లు కూడ అవుతాయన్న అంచనాలు కూడ ఉన్నాయి. అందుచేత ఆహార భద్రత అనేది మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎలా ఉంటుందో చూడాల్సిందే. పైగా, వస్తురూపంలో ఇచ్చే సబ్సిడీలకు ఎగనామం పెట్టడానికి ఉద్దేశించిన నగదుబదిలీ పథకాన్ని కూడ గొప్పగా చెప్పడం ఆర్ధిక మంత్రి మాటలను సందేహించకతప్పని పరిస్థితిలో పడవేస్తుంది. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్సులు, పెన్షన్లు లాంటి వాటికి నగదుబదిలీని వాడితే అభ్యం తరం లేదుకాని, ఆహారసబ్సిడీల లాంటి వాటికి వర్తింపచేస్తే పూర్తిగా వ్యతిరేకించాల్సిందే. అభివృద్ధిరేటును ఎంతో పెంచాలని పేర్కొన్న ఆర్ధిక మంత్రి గత బడ్జెట్‌ అంచనాల ప్రకారం మొత్తం వ్యయాన్ని రు. 14,90,925 కోట్ల నుండి రు.16,65,297 కోట్లకు మాత్రమే పెంచారు. దీనిలో ద్య్రవ్యలోటు రు.5,42,499 కోట్లు ఉంది. ఈ బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు, అధ్యాన్నంగా, అగమ్యగోచరంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను మెరగు పరచడానికి సమర్థవంతమైన చర్యలు ప్రకటించే ధైర్యాన్ని కూడ వ్యక్తం చేయలేకపోయిందని అర్ధమవుతుంది.