కేటాయింపులిలా...

షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ ప్లాన్‌, గిరిజన సబ్‌ ప్లాన్‌కు కేటాయింపులను పెంచారు. డబ్బు రూపంలో పెరిగినప్పటికీ ఆయా తరగతుల జనాభా నిష్పత్తి కంటె ఇది చాల తక్కువ.ఈ నిధులను వేరే పథకాలకు చేయకుండా మళ్లించ వీలు లేదని చిదంబరం అన్నారు. వామపక్షాల ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక చట్టాన్ని రూపొందించిన విషయం విదితమే. మహిళలకు సంబంధించిన కార్యకలాపాలకు రు. 97,134 కోట్లు కేటాయించారు. శిశువులకు సంబంధించిన కార్యక్రమాలకు రు.77,236 కోట్లను కేటాయించారు.మైనార్టీల సంక్షేమ నిమిత్తం కేటాయింపులను పెంచారు. 2012-13లో బడ్జెటరీ అంచనాల కంటే 12 శాతం, సవరించిన అంచనాల కంటే 60 శాతం మొత్తాన్ని పెంచారు. మౌలానా అబ్డుల్‌ కలాం అజాద్‌ ఎద్యుకేషన్‌ ఫౌండేషన్‌కు రు. 160 కోట్లు కేటాయించారు. వికలాంగుల సంక్షేమం నిమిత్తం అడిప్‌ పథకం కింద రు. 110 కోట్ల మొత్తాన్ని కేటాయించారు.

అందరికీ విద్య, ఆరోగ్యం

అందరికీ ఆరోగ్యం, విద్య అన్న లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చిదంబరం ప్రకటించారు. ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖకు రు.37,330 కోట్లు కేటాయించారు. జాతీయ ఆరోగ్య పథకానికి రు.21,239 కోట్లు,వైద్య విద్య, శిక్షణకు రు. 4,727 కోట్లు కేటాయించారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు రు. 150 కోట్లు కేటాయించారు. ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతిలను (ఆయుష్‌) కోసం రు.1,069 కోట్లు కేటాయించారు. ఆరు ఎఐఐఎంఎస్‌ తరహా సంస్థలను నెలకొల్పడానికి గాను రు.1,650 కోట్లు కేటాయించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖకు రు.65,867 కోట్లు కేటాయించారు. వర్తమాన సంవత్సరం కంటే 17 శాతం మేరకు కేటాయింపులను పెంచారు. సర్వశిక్షా అభియాన్‌కు రు. 27,728 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఎ)కు 25.6 శాతం మేర నిధులను పెంచారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనార్టీలు, స్కాలర్‌షిప్పుల కోసం రు. 5,284 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకానికి రు. 13,215 కోట్లు కేటాయించారు.

ఐసిడిఎస్‌లకు పెరిగిన కేటాయింపులు

ఐసిడిఎస్‌లకు గత ఏడాది కంటే 11.7 శాతం పెంచి రు. 17,700 కోట్లు కేటాయించారు.మాతా, శిశు పౌష్టికాహార లోపం సమస్యను అధిగమిం చేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి రు. 1,400 కోట్లు కేటాయించారు. మంచినీరు, పారిశుధ్య శాఖకు రు.15,260 కోట్లు కేటాయించారు. ఫ్లోరైడ్‌, ఆర్సెనిక్‌ శుద్ధికిగాను రు. 1400 కోట్లు కేటాయించారు.

గ్రామీణాభివృద్ధికి పెరిగిన కేటాయింపులు

గ్రామీణాభివృద్ధి శాఖకు రు. 80,194 కోట్లు కేటాయించారు. వర్తమాన సంవత్సరంలో జరిపిన కేటాయింపుల కంటే 46 శాతం పెంచారు. ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించేందుకు ఉద్దేశించిన పిఎంజిఎస్‌వై-2 అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు.

వ్యవసాయ రుణాల లక్ష్యం ఏడు లక్షల కోట్లు

2013-14లో ఏడు లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. స్వల్ప కాల పరిమితి గల పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తారు. ప్రయివేటు రంగంలోని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నుండి తీసుకునే రుణాలకు ఈ పథకాన్ని విస్తరించారు. వ్యవసాయ రంగానికి వర్తమాన సంవత్సరంలో కంటే 22 శాతం పెంచి రు.27,049 కోట్లు కేటాయించారు. వ్యవసాయ పరిశోధనలకు గాను రు. 3,415 కేటాయించారు.హరిత విప్లవానికి రు.1,000 కోట్లు కేటాయిం చారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకానికి రు. 9,954 కోట్లు, జాతీయ ఆహార భద్రతా కార్యక్రమానికి రు. 2,250 కోట్లు కేటాయించారు.

మౌలిక వనరుల బాండ్‌

మౌలిక వనరులకు కల్పిస్తున్న ప్రచారంలో భాగంగా రు.50,000 కోట్ల మొత్తాన్ని కేటాయిం చారు. ఈ పథకానికి చేసే మదుపులపై లభించే వడ్డీపై పన్ను మినహాయింపునిచ్చారు. నాబార్డ్‌కు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. రోడ్ల నిర్మాణానికి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటుచేశారు. పెట్టుబడులపై క్యాబినెట్‌ కమిటీని ఏర్పాటుచేశారు. రాజీవ్‌ గాంధీ పొదుపు పథకాన్ని మరింతగా సరళీకరించారు. రు.25 లక్షల వరకు మొట్టమొదటిసారిగా గృహ రుణం తీసుకునేవారికి లక్ష రూపాయల వడ్డీపై మినహాయింపు కల్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఓడరేవు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో రు. వంద మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో రెండు ప్రధాన ఓడరేవులను నిర్మిస్తారు . పశ్చిమబెంగాల్‌లో మరో పోర్టు నిర్మిస్తారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రాధాన్యత, ప్రయోజ నాలను మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తారు. సిడ్బి రీఫైనా న్సింగ్‌ సామర్ధ్యాన్ని పది వేల కోట్ల రూపాయలకు పెంచారు.

మూడు హామీలు:

బాలికా శిశువులు, మహిళలకు సాధికారత కల్పించేందుకుగాను, వారికి రక్షణ కల్పించేందుకు నిర్భయ ఫండ్‌ పేరుతో ఒక నిధిని ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కింద రు.1,000 కోట్లు కేటాయించారు.