ఎవరి కోసం!

వాతలు పెట్టే ప్రమాదముందని ముందుగా ఎకనా మిక్‌ సర్వే ద్వారా ప్రజలను భయ పెట్టిన ఆర్థిక మంత్రి చిదంబరం ఆ తరువాత బడ్జెట్‌లో వాతలు పెట్టకుండా ప్రజలతో 'అమ్మయ్య, మనని వదిలేశారు' అనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. కానీ పరిశీలించి చూస్తే ఈ బడ్జెట్‌ యుపిఏ ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలకే అద్దంపట్టిందని స్పష్టమవుతుంది. విదేశీ పెట్టుబడులకు మరింత ప్రవేశాన్ని కల్పించడం, దానిలో భాగంగా ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ బిల్లులకు ఆమోదం దక్కించుకోవాలనే తాపత్రయం బడ్జెట్‌లో స్పష్టంగానే కనిపిస్తోంది. ద్రవ్యలోటు తగ్గించు కోవాలంటే కార్పొరేట్లకు, కోటీశ్వరులకు ఇచ్చే పన్ను రాయితీలను తగ్గించి ఆదాయం పెంచుకోవడం ఒక మార్గం. సబ్సిడీలను తగ్గించి ప్రజలపై భారాన్ని మోపడం రెండో మార్గం. ప్రభుత్వం ఈ రెండో మార్గాన్నే ఎంచుకొంది. సబ్సిడీలను తగ్గించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం యుపిఏ ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం. కాని దానికి బడ్జెట్‌లో కేటాయించింది రు.33,000 కోట్లు మాత్రమే. గత బడ్జెట్‌లో రూ.33,000 కోట్లుగా ప్రకటించి, రూ.42,000 వరకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కానీ ఈసారి కూడా దాన్నిరూ.33,000 కోట్లకే పరిమితం చేశారు.

అతి ధనవంతుల ఆదాయపు పన్ను రేటును పెంచడానికి ఆర్థికమంత్రి మనస్సు ఒప్పుకోలేదు. సర్‌ఛార్జీతో సరిపెట్టారు. అందరి పన్నురేట్లనూ యథాతథంగా ఉంచుతున్నామనే వాదనలో భాగంగా దానిని సర్దుబాటు చేశారు. బ్యాంకింగ్‌ రంగంలో బేసెల్‌ 3 షరతులను అమలు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అదే సమయంలో వ్యవసాయ రంగానికి అవసరమైన రుణ సదుపాయాన్ని రూ.7 లక్షల కోట్లకు పెంచుతామన్నారు. ఈ రెండింటికీ వైరుధ్యం వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రుణాలు పబ్లిక్‌రంగ బ్యాంకుల ద్వారా అందచేస్తుంది ప్రభుత్వం. కాని రుణాల బకాయిలు ఉంటే ఆ బ్యాంకులు తమ పెట్టుబడి అవసరాన్ని రుణ బకాయిలను దృష్టిలో పెట్టుకొని పెంచాల్సి ఉంటుంది.

బేసెల్‌ 3 ద్వారా ఇది మరింత కఠినంగా అమలౌతుంది. అపుడు బ్యాంకులు వ్యవసాయ రుణాల నుండి దూరంగా జరిగే అవకాశం ఉంటుంది. జీవిత బీమా సంస్థ 10,000 జనాభా ఉన్న చోట్ల బ్రాంచీలు తెరవాలని, దానికి ఐఆర్‌డిఎ అనుమతి అవసరం లేదని బడ్జెట్‌లో ప్రకటించారు. బ్రాంచీలు తెరిచేందుకు ఎల్‌ఐసి కాని ప్రభుత్వ రంగ బీమా సంస్థలు కానీ సిద్ధమే. ఇన్సూరెన్స్‌ వ్యాప్తికై ఈ సామాజిక బాధ్యతను వహించడం అవసరమే. కాని ఈ బాధ్యతను అప్పచెబుతున్న తరుణంలోనే ప్రభుత్వరంగ బీమా కంపెనీలను బలహీనం చేయడం చాలా దుర్మార్గం. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇన్సూరెన్స్‌ చట్టాల సవరణ బిల్లును ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం ఆరాట పడుతోంది. జీవిత బీమా రంగాన్ని ప్రోత్సహించే విధానంలో భాగంగా ఆదాయపు పన్ను రాయితీలను ఈ రంగానికి పెంచాలి. కానీ ప్రభుత్వం దీనిని పట్టించుకోవడం లేదు. మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన నిధుల్లో ఏటా దాదాపు రూ.2,00,000 కోట్ల రూపాయలు జీవిత బీమా రంగం నుండి వస్తాయి. కాని ఈ రంగానికి ముఖ్యంగా ఎల్‌ఐసికి అందచేయాల్సిన సహకారం ప్రభుత్వం నుండి లేదు. ఏమైనా ఈ బడ్జెట్‌ దేశ ఆర్థిక రంగంలో ఉన్న స్తబ్దతను తొలగించి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశలో అడుగులు వేయలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారాన్ని చూపడంలో విఫలమైంది. ఇది ప్రజల బడ్జెట్‌గా పేర్కొనలేం.


కె వేణుగోపాల్‌

ప్రధాన కార్యదర్శి ఏఐఐఇఏ