2011-12 ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి ప్రణబ్ ముఖర్జీ రక్షణ రంగానికి లక్షా 68వేల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపు (రూ.1,47,341కోట్లు)తో పోలిస్తే రూ.21వేల కోట్లు (దాదాపు 14శాతం) అదనం. ఇందులో 41శాతం మేర నిధులను అంటే రూ.69,199కోట్లను విదేశాల నుండి రక్షణ, ఆయుధ సామాగ్రి కొనుగోళ్ల కోసమే కేటాయించడం గమనార్హం.
ఈ కేటాయింపులను నిశితంగా పరిశీలిస్తే ఇటీవల రక్షణ విధానంలో భారత-అమెరికా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పంద ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రోజురోజుకూ రక్షణ పరికరాల ఉత్పత్తి విధానంలో అమెరికా పై మరింత ఆధారపడేదిశగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి.
ఢిపెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రోసీజర్ (డిపిపి)-2011, డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ-2011 ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. డిపిపి ఆధారంగా ఆఫ్‌సెట్ క్రాంటాక్టుల రూపంలో ఇప్పటికే రూ.9,943 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.3,430 కోట్లు ప్రయివేటు రంగానికి కేటాయించారు. దీంతోపాటు రూ.31,889 కోట్ల విలువైన ఉత్పత్తికి సంబంధించి 75 ప్రయివేటు కంపెనీలకు 135 లైసెన్సులు జారీ చేశారు.
'రక్షణ ఉత్పత్తులు-ప్రయివేటు రంగ పాత్ర' అనే అంశంపై ఈ ఏడాది జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారత పారిశ్రామిక సమాఖ్య (సిఐఐ) రూపొందించిన పత్రం, రక్షణ శాఖ సహాయ మంత్రి మాట్లాడిన తీరు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిబింబించింది. స్వయంవృద్ధి (దేశీయ ఉత్పాదన), స్వావలంబనకు తిలోదకాలిస్తూ అమెరికా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, బ్రిటన్‌లోని ఆయుధ తయారీ పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా రక్షణ కేటాయింపులు ఉన్నాయనడంలో సందేహించనక్కర్లేదు.
ఎఫ్‌డిఐలు మరింత సరళతరం
రక్షణ ఉత్పత్తి మరియు పరిశోధన రంగంలో చొరబడడానికి ఉవ్విళ్లూరుతున్న బహుళజాతి సంస్థలకు, అమెరికా సామ్రాజ్యవాదుల కనుసన్నలలో పనిచేస్తున్న అనేక యుద్ధ పరిశ్రమలకు అనుగుణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ప్రణబ్ గేట్లు బార్లా తెరిచారు. ఇందుకు అనుగుణంగా విధానపరమైన మార్పులు చేశారు. దీని మూలంగా దేశంలో ఉన్న 39 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు, 51 రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థలు (డిఆర్‌డిఒ) అలాగే తొమ్మిది రక్షణ రంగ ప్రభుత్వ పరిశ్రమలకు విఘాతం కలుగుతుంది. వాటి మనుగడకే ప్రమాదం వాటిల్లనుంది. పోటీతత్వమనే నినాదంతో ప్రయివేటు రంగానికి పెద్ద పీట వేయడం రక్షణ ప్రభుత్వరంగ పరిశ్రమలకు ఆశనిపాతంగా తయారైంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడానికి ప్రస్తుతం రక్షణ రంగం సిద్ధంగా లేదన్న రక్షణశాఖామంత్రి ఆంటోని మాటలకు విరుద్ధంగా ఉన్న ఆర్థికశాఖ మంత్రిగారి ప్రతిపాదనల వెనుక భారత్‌తో అమెరికా వ్యూహాత్మక ఒప్పందం ప్రభావం తీవ్రంగా పనిచేసిందని చెప్పక తప్పదు. రానున్న పది సంవత్సరాల్లో పది వేల కోట్ల డాలర్ల విలువల కల్గిన రక్షణ ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఒప్పందంలోని అంశానికి పై నిర్ణయం దోహదం చేస్తుంది.
గత మూడు సంవత్సరాలుగా రూ.2,15,600 కోట్ల విలువ కల్గిన రక్షణ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. వచ్చే మూడేళ్లలో వీటి విలువ రూ. ఐదు లక్షల కోట్లకు పెరగనున్నది. ఈ ఐదు లక్షల పై చిలుకు రక్షణ ఉత్పత్తులను మన దేశంలోనే ఉన్న రక్షణ ఉత్పత్తి సంస్థలైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, రక్షణ ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కేటాయించినట్లైతే ప్రభుత్వం వినిపిస్తున్న '30 శాతం స్వయం సంవృద్ధి - 70 శాతం విదేశాల నుంచి దిగుమతి' వాదనను తిప్పికొట్టవచ్చు. మొత్తం మీద భారత రక్షణ విధానంలో మన దేశసౌర్వభౌమత్వాన్ని మంట గలుపుతూ, స్వయం సంవృద్ధి, స్వావలంబనకు తిలోదకాలిస్తూ రోజురోజుకూ మన దేశ రక్షణ విధానం అమెరికా సామ్రాజ్యవాదుల ఉచ్చులో చిక్కుకుపోయిందని చెప్పవచ్చు.
మొత్తం రక్షణ బడ్జెట్ రూ.1.68లక్షల కోట్లు
జి.టి. గోపాల్ రావు
ఆర్గనైజింగ్ సెక్రటరీ, అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య
ఆయుధ కొనుగోళ్లు రూ.69199 కోట్లు
గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల 14 శాతం