అయ్యా ముఖ్యమంత్రి గారూ..మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మాకన్నీ కష్టాలే..! దయ ఉంచి మా కష్టాలు తీర్చవయ్యా..! ఎన్నడూ లేని విధంగా ప్రకృతి ప్రకోపానికి మా గూడు, నీడ నేలమట్టమై అల్లాడుతున్నాము...గొడుగంత నీడ అందక మండుటెండల్లో పిల్లా పాపలతో కాలం గడుపుతున్నాం...వరద బాధితులను ఆదుకుంటామన్నారు...మీ హామీలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. ఇస్తానన్న పరిహారం నేటికీ అందలేదు...పిడికెడు మెతుకులు కడుపులో పడేందుకు పరిహారమన్నా అందించి ఆదుకోవయ్యా... అంటూ వరద బాధితులు జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కన్నీటితో వేడుకుంటున్నారు.
వరద బాధితుల గూడు చెదిరి ఆర్నెళ్లు గడుస్తున్నా పరిహారం నేటికీ అందలేదు. మొండిగోడల మధ్యనే జీవనం సాగిస్తున్నారు. తమ గోడు ఈ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని వరదల వల్ల నష్టపోయిన మత్స్యకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని గంగాభవానిపురంలో అక్టోబర్‌లో వచ్చిన కృష్ణానది వరద వల్ల ఆ గ్రామంలో ఉంటున్న 42 మత్స్యకార్మికుల గృహాలతో పాటు, వారి జీవనాధారమైన వస్తు సామాగ్రి పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. చేపల వేటే వారి జీవనాధారం. వరదల సమయంలో వేటకు ఉపయోగించే నాటు పడవలు, వలలు కొట్టుకుపోయాయి. కేవలం కట్టుబట్టలతోనే ఒడ్డుకు చేరి దాతల సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన నామమాత్రపు ఆర్థికసహాయంతో ఈ మూడు నెలలు కాలం వెల్లదీశారు. ఈ గ్రామస్తులకు గతంలో ఐఏవై పథకం కింద గృహాలు మంజూరయ్యాయి. ఈ పథకం కింద కేవలం రూ.25 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నందున మిగిలిన డబ్బులు చెల్లించలేదని వారు ఇళ్లు నిర్మించుకోలేదు. 42 కుటుంబాల్లో నాలుగు కుటుంబాల వారు మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన వారంతా సగం వరకు గోడలు నిర్మించుకొని అసంపూర్తిగా నిలిపివేశారు. వరదల సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రోశయ్య ఇచ్చిన హామీ కలగానే మిగిలింది.
మెండిగోడల్లో నివాసం :
కృష్ణానది వరదల్లో సర్వస్వం కోల్పోయిన గంగాభవానిపురం మత్స్యకార్మికులు అర్ధాంతరంగా సగంలోనే ఆగిపోయిన మెండిగోడల్లో నివాసముంటున్నారు. సగం వరకు ఉన్న ఇంటి గోడలపై బస్తాలతో కుట్టిన పట్టాలు వేసుకొని కాలం గడుపుతున్నారు. ఈ గోడలపైనే కొందరు జమ్ముతో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
ప్రభుత్వ అరకొర సహాయం :
వరదలో ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.8 వేలు ఆర్థికసహాయం అందించారు. రూ.30 వేలు విలువ చేసే నాటు పడవలకు రూ.7,500 చొప్పున 16 పడవలకు, రూ.2500 చొప్పున ఐదు వలలకు మాత్రమే మత్స్యశాఖ నుండి ఆర్థికసహాయం అందించారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో కాలం వెల్లదీశాం : బాధితులు
వరదల సందర్భంలో సర్వస్వం కోల్పోయిన తమ కుటుంబాలకు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు, ప్లేట్లు, ఆహార పదార్ధాలు అందించడంతో ఇప్పటి వరకు కాలం వెల్లదీశామని మత్స్యకార్మికులు తెలిపారు. ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని విచారం వ్యక్తం చేశారు. వరద సమయంలో పరామర్శించడానికి వచ్చిన హుజూర్‌నగర్ ఎంఎల్‌ఏ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తమ ఇళ్ల్ల నిర్మించాలని, తిరిగి వేటకు వెళ్లేందుకు కృష్ణానదిలోకి దారి వేయించాలని వేడుకున్నామన్నారు. వాటిని నెరవేరుస్తానని చెప్పారే తప్ప నేటికీ వాటిని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వాలని, మా జీవనాధారమైన వేటకు పడవలు, వలలు అందించాలని కోరుతున్నారు.
విజయవాడ సభను జయప్రదం చేయండి: సిపిఎం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి: సిఐటియు
ప్లీనరీ సమావేశంలో... మూడో ప్రత్యామ్నాయంపై చర్చ : చెరుపల్లి
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
మధ్యాహ్న భోజన పంపిణీలో విబేధాలు
సుద్దాల స్ఫూర్తితో ఉద్యమించాలి
కడుపులో ఇనుప పరికరం వైద్యురాలి నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
ఉద్యమాలు ఉధృతం చేయాలి : సిపిఎం