ఆర్టీఓ కార్యాలయంలో... కలెక్షన్ల పర్వం

  • ఏళ్ల తరబడి తిష్ట వేసిన హెడ్‌ కానిస్టేబుళ్లు
  • రొటేషన్‌ పద్ధతి బదిలీలు పట్టని వైనం
  • కొందరిపై వేటు... ఇంకొందరికి నచ్చిన చోటు
  • లైసెన్స్‌ల జారీ... ఓవర్‌లోడ్‌, ఫిట్‌నెస్‌కు డబ్బులు వసూలు
  • స్కూల్‌, ఆర్టీసీ బస్సుల ఇంజన్‌ మార్పిడీపై ఉదాసీనత

దళారుల వ్యవస్థను అరికట్టడమేమో గానీ..! సిబ్బందే దళారీ పాత్ర పోషిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి పనికీ ఒక రేటు... పైసలిస్తే చాలు అంతా భేష్‌. లైసెన్స్‌ల జారీ... ఓవర్‌ లోడ్‌ రవాణా... ఫిట్‌నెస్‌, ఇంజన్ల మార్పిడీ ఇలా పనేదైనా సరే పైసలిస్తే క్షణాల్లో జరిగి పోతుంటాయి. బదిలీల్లో పారదర్శకత పట్టదు. ముడుపులిచ్చిన వారికి కోరిన చోట పోస్టు... ప్రశ్నించిన వారిపై బదిలీ వేటు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌. ఏళ్ల తరబడిగా ఒకే చోట తిష్ట వేసిన వారు కలెక్షన్ల కింగ్‌లుగా మారిపోతున్నారు. వసూళ్లు చేయడం ఎవరి వాటా వారికివ్వడమే వారి రోజువారి విధులు. అధికారులు చేయాల్సిన పనుల్ని కానిస్టేబుళ్లు...హెడ్‌ కానిస్టేబుళ్లు చేసుకుంటూ పోతున్నారు. అంతా భేష్‌గా ఉందని చెప్పే ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి, అక్రమ పద్ధతుల తంతుపై ప్రజాశక్తి ప్రత్యేక కథనం.

రవాణా శాఖ పరిధిలో జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయం, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ యూనిట్‌, కోదాడలో తనిఖీ కార్యాలయాలున్నాయి. నల్గొండలో ఆర్టీఓతో పాటు ఇద్దరు మోటార్‌ వాహనాల తనిఖీ అధికారులు, మిర్యాలగూడలో మరో ఇద్దరు, కోదాడ, సూర్యాపేట, భువనగిరిలో ఒక్కొక్క ఎంవిఐలున్నారు. వీరితో పాటు ముగ్గురు సహాయక మోటార్‌ వాహనాల తనిఖీ అధికారులున్నారు. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంతో పాటు యూనిట్‌ కార్యాలయాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు, భారీ వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ వంటి ప్రతి పనికీ ఒక రేటుంటుంది. డబ్బులియ్యంది ఎంత వారి పైనానా పెండింగ్‌లోనే ఉంటుంది. డబ్బులిస్తే క్షణాల్లో కాగితాలు కదిలిపోతాయి. అంతా భేష్‌గానే ఉందనే ముద్ర వేసేస్తారు. నిబంధనల ప్రకారం కాకుండా ముడుపుల ప్రకారం పనులు చేయడం ఆర్టీఓ, యూనిట్‌ కార్యాలయాల్లో పరిపాటిగా మారింది. ప్రజాశక్తి దృష్టికి వచ్చిన కొన్ని విషయాలను పరిశీలిస్తే... ఆర్టీఓ, మోటార్‌ వాహనాల తనిఖీ అధికారుల నెల వారి ఆదాయ వనరులు లక్షల్లోనే ఉంటాయనేది జగమెరిగిన సత్యమనే చెప్పాలి. సహాయకులుగా ఉండే కానిస్టేబుళ్లు, హెడ్‌కాని స్టేబుళ్లకూ తక్కువేమీ రావడం లేదు. వీరిలో కొందరు దేశముదుర్లుగా ముద్రపడ్డారు. ముందుగా పరిపాలనా విభాగంలో జరిగే అవినీతి, అక్రమాలను పరిశీలిస్తే... హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను రొటేషన్‌ పద్ధతిలో బదిలీలు చేయాలని, బదిలీల ప్రక్రియంతా పారదర్శకంగా జరపాలని ఎపి ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మార్గదర్శకాలను జారీ చేశారు. అ నిబంధన ప్రకారం హెడ్‌క్యాడర్‌ ఆఫీసుతో పాటు యూనిట్‌ కార్యాలయాల్లో పనిచేసే కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లలో ఎవరూ ఐదు, పదేళ్ల పాటు ఒకే చోట పనిచేసే అవకాశం ఉండదు. కానీ..! నల్గొండలో లక్ష్మీ నర్సయ్య అనే హెడ్‌కానిస్టేబుల్‌ పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. లర్నింగ్‌ లైసెన్సులు జారీ చేసే సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా హరి అనే కానిస్టేబుల్‌ అపాయింట్‌మెంట్‌ నుండి ఇప్పటి వరకూ సుమారు పదేళ్ల పాటుగా జిల్లా కేంద్రంలోనే పనిచేస్తున్నాడు. యూనిట్‌ కార్యాలయంలో పని చేయాల్సిన హరి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్వ్కాడ్‌ డ్యూటీలు చేస్తున్నాడు. ఓవర్‌లోడ్‌ వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేసి వదిలేయడం డ్యూటీగా పని చేస్తున్నాడనే విమర్శలున్నాయి. సయ్యద్‌, లక్ష్మయ్య కూడా నల్గొండలోనే మకాం వేసి ఉంటున్నారు. భువనగిరి యూనిట్‌ కార్యాలయంలో లింగయ్య కూడా ఏళ్ల తరబడిగా అక్కడే పనిచేస్తున్నాడు. రొటేషన్‌ పద్ధతిలో బదిలీలు చేయాల్సి ఉండగా కొందరికి నచ్చిన చోటే ఉండే విధంగా అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇంకొందరికి మాత్రం దూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ వేటు వేస్తున్నారు. ఇటీవల నల్గొండలో పనిచేసే వెంకటయ్య అనే హెడ్‌కాని స్టేబుల్‌ను సూర్యాపేటకు, కె.సత్యనారాయణను కోదాడకు బదిలీ చేశారు. సూర్యాపేటలో పనిచేసే అశోక్‌పై అనేక ఆరోపణలొచ్చాయి. పనిష్‌మెంట్‌ కింద ఆయన్ను కోదాడకు బదిలీ చేశారు. కోదాడకు వెళ్లి కొంత కాలమే అవుతుంది. ఉన్నట్లుండి అశోక్‌కు మళ్లీ సూర్యాపేటకు బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎక్కడ పని చేస్తూ ఆరోపణలు ఎదురుకున్నాడో అక్కడికే మళ్లీ బదిలీ చేయడం ఎలా పారదర్శత అవుతుందో అధికారులే చెప్పాలని తోటి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రొటేషన్‌ పద్ధతిలో బదిలీలు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారి ఆర్టీఓకు ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో పాటించే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం రొటేషన్‌ పద్ధతిలోనే కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

వసూళ్ల పర్వం

ఆర్టీఓ కార్యాలయాలంటేనే వసూళ్ల కేంద్రాలుగా మారాయి. దళారుల వ్యవస్థను రూపుమాపుతామని ఆ మధ్యలో ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేశారు. ఉన్నట్లుండి మళ్లీ దళారుల వ్యవస్థను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. లర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే ఆర్టీఓ, ఎంవిఐ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుని నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లించాలి. ఆ తర్వాత ఎంవిఐ స్వయంగా లైసెన్స్‌ కోసం వచ్చిన వ్యక్తికి రోడ్డు రవాణాపై ఉన్న అవగహనను కంప్యూటర్‌ పరీక్ష ద్వారా పరిశీలించాలి. సదరు అధికారి సంతృప్తి చెందిన తర్వాతనే లైసెన్స్‌ జారీ చేయబడుతుంది. ఇదంతా ఎక్కడా జరగడం లేదు. అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడం మొదలు లైసెన్స్‌ పొందే వరకూ ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ఎంవిఐలు ఎక్కడా ఉండడం లేదు. హెడ్‌కానిస్టేబుళ్లే లర్నింగ్‌ లైసెన్స్‌ల పరీక్ష నిర్వహిస్తున్నారు. అవగహన లేకున్నా ఉన్నా ఒక రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ఆదాయానికి అలవాటు పడిన వాళ్లు బదిలీలు కాకుండా ఒకే చోట ఉండిపోతున్నారు. నల్గొండలో లక్ష్మీ నర్సయ్య లర్నింగ్‌ లైసెన్స్‌ల జారీ సెక్షన్‌లో పదేళ్ల నుండి పనిచేస్తున్నారంటే ఆదాయ వనరులే పాటివో అర్థం కానిది కాదు. బదిలీపై వెళ్లకుండా చాలా ఏళ్లపాటు ఒకే చోట పనిచేస్తున్న వాళ్లు పై అధికారులకు వేలకు వేలు ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కొక్కరు రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు ముడపులిచ్చి స్థానికంగానే ఉండేటట్లు చేసుకుంటున్నారని తోటి ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు.

వాహనాల ఫిట్‌నెస్‌ ధృవీకరణలో కూడా డబ్బులు భారీ ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. వాహనాల కండీషన్‌ సరిగ్గా లేకున్నా ఉన్నట్లుగా ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్‌ బస్సులు, ఆర్టీసీ బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో పట్టింపే లేకుండా పోయింది. 7 ఆర్టీసీ డిపోలలో సుమారు 760 బస్సుల వరకూ ఉన్నాయి. ఇందులో పాత బస్సులు ప్రతి నెలా ఫిట్‌నెస్‌ కోసం వస్తుంటాయి. అందులో పాత బస్సులకు ఇంజన్లు మారుస్తారు. ఏదైనా వాహనం ఇంజన్‌ను మరొక వాహనానికి మారిస్తే దానికి కూడా పన్ను చెల్లించాల్సి ఉంది. ఇంజన్‌ నెంబర్‌ మారితే దానికి రూ. 300 వరకు పన్ను చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా నెలకు 50 వరకూ ఇంజన్‌ మార్చిన బస్సులు వస్తున్నాయి. వాటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో ఆర్టీసీ నుండి ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన లక్షలాది ఆదాయం కాకుండా పోతుంది. గుడ్‌విల్‌ కింద సిబ్బంది చేతివాటానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల సూర్యాపేట డిపోకు చెందిన ఎపి 11 జెడ్‌ 5668 నెంబర్‌ గల బస్సు ఇంజన్‌ మార్చి వచ్చింది. దీనికి పన్ను చెల్లించాలని హెడ్‌కానిస్టేబుల్‌ ప్రశ్నించాడు. అదే బస్సు అంతా బాగానే ఉందంటూ ఎంవిఐ ధృవీకరించడం విశేషం. రెండు నెలలకు సంబంధించి ఆర్టీఓ కార్యాలయాలకు ఫిట్‌నెస్‌ కోసం వచ్చిన బస్సులు, ఇంజన్‌ మార్చినందుకు వసూలు చేసిన పన్నుల వివరాల రికార్డులను పరిశీలిస్తే అవినీతి భాగోతమేంటో బట్టబయలవుతుంది. వాహనాల ఫిట్‌నెస్‌, ఇంజన్‌ మార్పిడీ వంటి వాటిని ఎంవిఐలే స్వయంగా పరీక్షించాలి. హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లే ఈ పనుల్ని చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని వాహన దారులు పేర్కొంటున్నారు. డ్రైవింగ్‌ స్కూల్‌ నుండి టెస్టింగ్‌ కోసం వచ్చే వాళ్లను డ్రైవింగ్‌ నేర్చుకున్న వ్యక్తి పక్కన కూర్చొని టెస్ట్‌ చేయాల్సి ఉంది. కానీ..! పక్కన డ్రైవింగ్‌ స్కూల్‌ యజమాని కూర్చొని వాహనాన్ని నడిపితే దానిని ఒకే చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. స్క్వాడ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో పనిచేసే కొందరు ఓవర్‌లోడ్‌, దొంగ సరుకుల రవాణా, అనుమతుల్లేని రవాణాను అరికట్టాల్సి ఉంది. నిత్యం వాహనాలను తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా అక్రమ పద్ధతులు అనుసరించే వారికి నష్టం చేకూర్చేందుకు విధించిన పన్నుల్ని వసూలు చేయడంలేదనే విమర్శలున్నాయి. చెల్లించాల్సిన పన్నుల కంటే మూడింతలు ఎక్కువ వసూలు చేసి వాటాలు పంచుకుంటున్న వాళ్లకు బదిలీలు ఉండడం లేదని, నిజాయితీగా పనిచేస్తే మాత్రం బదిలీలు చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

నల్గొండ ఇతర విశేషాలు

  • Publiture