తెలంగాణ వాదం పక్కన బెట్టి టిఆర్‌ఎస్, టిడిపి నేతలు తిట్లపురాణాన్ని ఎత్తుకున్నారు. తెలంగాణ ద్రోహులు మీరంటే.. మీరంటూ ఇరు పార్టీల నేతలూ విమర్శనాస్త్రాలు సంధించుకుంటుంటే... అనుచరులు మాత్రం తన్నులాటకు దిగుతున్నారు. టిడిపి శాసన సభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌లు తీవ్రమైన విమ ర్శనాస్త్రాలు సంధించిన విషయం విధితమే. కెసిఆర్‌ను టార్గెట్ చేస్తూ మోత్కుపల్లి నర్సింహులు... చంద్రబాబును టార్గెట్ చేస్తూ కెటిఆర్ మాటల యుద్ధానికి దిగారు. విమర్శ ప్రతివిమర్శలతో రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో టిఆర్‌ఎస్,
టి. టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైతే... జిల్లాలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తన్నుకుంటున్నారు. మోత్కుపల్లి నర్సింహులు టి.టిడిపి ఫోరంలో కీలక నేతగా వ్యవహరిస్త్తూ కెసిఆర్‌ను టార్గెట్ చేయడంతో మింగుడు పడని టిఆర్‌ఎస్ నేతలు జిల్లా స్థాయిలో నర్సింహులును నియంత్రించేందుకు ఎత్తులు వేస్తున్నారు. నర్సింహులుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయించేందుకు టిఆర్‌ఎస్ పూనుకుంది. దీని ఘాటుగా టిడిపి నేతలు సైతం టిఆర్‌ఎస్ దాడిని ఎదుర్కునేందుకు ప్రతి దాడులకు దిగుతున్న పరిస్థితి ఉంది. రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇటీవలే వరంగల్ జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లిన బాబు కాన్వారును జిల్లాలోనే అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్, తెలంగాణ వాదులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు రైతుల పేరుతో పర్యటిస్తే అడ్డుకుంటామని టిఆర్‌ఎస్‌తో పాటు రాజకీయ జెఎసి కూడా ప్రకటించింది. దీంతో జిల్లాలో బీబీనగర్, భువనగిరి, ఆలేరులో బాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బాబు పర్యటనను సవాల్‌గా తీసుకున్న టిడిపి నేతలు భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తల్ని సమీకరించి బాబుకు ఘన స్వాతం పలికారు. భువనగిరి, ఆలేరులో తెలంగాణ వాదుల కంటే టిడిపి శ్రేణులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో బాబును అడ్డుకోలేకపోయారు. ఆలేరులో మాత్రం రోడ్‌షో ముగించుకుని వెళ్తుంటే జంగాల కాలనీ సమీపంలో కాన్వారుపై టిఆర్‌ఎస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేశారు. అంతకు ముందు ఆలేరులో కొందరు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడంతో చంద్ర దండు కార్యకర్తలు, స్థానిక టిడిపి కార్యకర్తలు తెలంగాణ వాదులపై దాడి చేశారు. పోలీసులతో పాటు టిఆర్‌ఎస్ శ్రేణుల్నీ చితకబాదిన పరిస్థితి ఉంది. ఈ సంఘటన దేశం శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపినట్లైంది. టిఆర్‌ఎస్ నాయకులు బాబును అడ్డుకోవడంతో విజయవంతం కాలేకపోయిన విషయాన్ని ఆ పార్టీ నేతలే అంగీకరించిన పరిస్థితి ఉంది. దీంతో బుధవారం మోత్కూర్‌లో పర్యటించిన మోత్కుపల్లి నర్సింహులును అడ్డుకుని దాడి చేశారు. ఎమ్మెల్యే హోదాలో మోత్కూర్‌లో స్త్రీ శక్తి భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు నర్సింహులు వచ్చారు. కెసిఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, తెలంగాణ కోసం అసెంబ్లీ ముందు ఉరేసుకుందామని సవాల్ విసిరి కెసిఆర్‌ను ఇరకాటంలో నెట్టడం వంటి పరిణామాలు టిఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లో పెట్టాయి. దీంతో మోత్కుపల్లి జిల్లాలో పర్యటించేందుకు రావడంతో టిఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కాన్వారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. భౌతికంగా పరిశీలిస్తే మోత్కూర్‌లో తెలంగాణ వాదం బలంగానే ఉంది. ఇటీవల ప్రతి కార్యక్రమమూ విజయవంతమయ్యాయి. మోత్కుపల్లిపై కోడి గుడ్లతో దాడి చేసినందుకు ప్రతిఘటనగా టిడిపి కార్యకర్తలు నర్సింహులుపై దాడి చేసిన వారిపై తిరిగి దాడి చేయగలిగారు. దీంతో టిఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో క్యాడర్ లేని బలహీనత కనిపించింది. కోడిగుడ్లు వేసిన టిఆర్‌ఎస్ శ్రేణులపై టిడిపి కార్యకర్తలు ప్రతిదాడి చేసి పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఆలేరు, మోత్కూర్‌లో తెలంగాణ వాదం బలంగా ఉంది. కానీ..! టిఆర్‌ఎస్ సంస్థాగతంగా బలహీనంగా ఉందనే చెప్పాలి. ఆలేరులో రెండు ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్‌ఎస్ బాబు పర్యటన సందర్భంగా తన బలాన్ని చూపలేకపోయిందనే అభిప్రాయం ఆ ప్రాంతంలో వ్యక్తమైంది. తెలంగాణ వాదమనే విధాన బలం తప్ప రాజకీయంగా టిఆర్‌ఎస్ బలమైన పార్టీగా లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆలేరు, తుంగతుర్తి నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు టిడిపిలో కీలక నేతగా ఉన్నారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నప్పటికీ నర్సింహులు చంద్రబాబు వద్ద పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. టి.ఫోరం నేతల్లో మొదటి...రెండో స్థానం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టిఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ పోతున్నారు. నర్సింహులును కౌంటర్ చేయడంలో డైలమాలో పడుతున్న టిఆర్‌ఎస్ కింది స్థాయిలోనే ప్రతిఘటన చేయాలని భావిస్తుంది. జిల్లాలో తెలంగాణ వాదం పేరుతో టిఆర్‌ఎస్ మోత్కుపల్లిని టార్గెట్ చేస్తుంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్న పరిస్థితులు ఆ రెండు పార్టీ క్యాడర్‌నూ కలవర పరుస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు తెలంగాణ వాదం వినిపిస్తూ పరస్పరం ఘర్షణ పడుతున్నందున కింది స్థాయి క్యాడర్ సైతం ఆ వైరుధ్యాన్ని కొనసాగిస్తూ ఘర్షణ పడాల్సి వస్తుందని కొందరు కార్యకర్తలు పేర్కొంటున్నారు.