ఆగస్టు 7నుండి 10 వరకు విజయవాడలో నిర్వహించనున్న అఖిల భారత విస్తృత స్థాయి సమావేశంలో దేశంలోని కాంగ్రెస్, బిజెపేతర శక్తులతో మూడో ప్రత్యామ్నాయం కోసం చర్చ జరగనున్నట్లు ఎమ్మెల్సీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలూ ఈ సమావేశాల్లో పార్టీ తీసుకొనే నిర్ణయం కోసం ఎదురుచూస్తోన్నారని అన్నారు. పదో తేదీన నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వేలాది మందిని తరలించనున్నట్లు చెప్పారు. జన సమీకరణ చేసేందుకు ఆయా డివిజన్ కమిటీలు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తోన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లపై తమ పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టిన్నట్లు తెలిపారు. అంతే కాకుండా విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ విషయంలో అనేక పోరాటాలు నిర్వహించినట్లు వివరించారు. దీంతో ప్రభుత్వం కొంత వెనుకడుగు వేసిందన్నారు. రానున్నదంతా ఉద్యమాల కాలమేనని చెప్పారు. మేళ్లచెర్వు, దామరచర్ల వంటి గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలుతోన్నాయన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నివారణా చర్యలు చేపట్టాలని చెరుపల్లి కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తిరందాసు గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందన్నారు. ఇటీవల బయ్యారం గనులపై వచ్చిన వివాదాన్ని ఓ మంత్రి అడ్డుకోగా, రొయ్యలపై వచ్చిన సమస్యలను మరో మంత్రి ఆపడం వారి దివాలా కోరు విధానాలకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్‌కార్యదర్శి డబ్బికార్ మల్లేశ్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నకిరేకంటి అంజయ్య, గాదె పద్మ పాల్గొన్నారు.