రెండు రోజుల క్రితం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని పలువురిని ఆందోళనపరిచాయి. కొంతమంది వ్యక్తిగత రాజకీయాంశాలు సినీ ఇండిస్టీపై ప్రభావం చూపుతు న్నాయని నిర్మాతల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన వ్యక్తిగతమైన వ్యాఖ్యలని నిర్మాతల మండలి పేర్కొంది.కొడాలి నాని నిర్మించిన 'అదుర్స్' సినిమా ఇటీవల విడుదలైంది. దాన్ని అడ్డుకోవాలని కొంతమంది తెలంగాణావాదులు పిలుపునిచ్చారు. అయినా కూడా తమ చిత్రం బ్రహ్మాండంగా ఆడిందని, సినిమా విడుదలను అడ్డుకోలేకపోయారని, 'అదుర్స్' ఎలా హిట్ కొట్టిందో..అలాగే సమైక్యాంధ్ర కూడా అలాగే హిట్ సాధిస్తుందని కొడాలి నాని రెండురోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని, ఇవి అతని వ్యక్తిగతమైనవని నిర్మాతల మండలి పేర్కొంది. దీనిపై సోమవారం మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) సమావేశమై విలేకర్లతో మాట్లాడారు. కొడాలి నాని వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు సంబంధం లేదని, చిత్ర సీమకు, రాజకీయాలకు సంబంధం లేదని, ఇలా మాట్లాడటం సరైంది కాదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.అటు ప్రజల్లో ఇటు ఇండిస్టీలో దుమారం రేపిన తన మాటలకు కొడాలి నాని క్షమాపణలు తెలుపుకున్నారు. 'తెలంగాణావాదులు 'అదుర్స్'ను అడ్డుకోలేక పోయారనే మాటలు అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. దీనికి క్షమాపణలు తెలుపుతున్నా' అని అన్నారు.