పురుషాధిక్య సమాజం...అన్న మాట అనేక మార్లు వినే ఉంటాం. సినీ రంగం కూడా ఈ పరిధిలోకే వస్తుంది. మహిళకు కొన్ని రంగాలు సానుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా, క్లిష్టంగా ఉంటాయి. హీరోయిన్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా, టెక్నీషియన్‌గా ఇక్కడ నిలబడాలంటే మహిళ రెట్టింపు కష్టనష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి రంగంలో కూడా స్త్రీ తనదైన ముద్ర చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఒకప్పటికంటే ప్రస్తుతం తెలుగు చలనచిత్రరంగంలో మహిళల ప్రాధాన్యత పెరిగింది. ఈరంగంలో వారి ఆసక్తులు పెరుగుతున్నాయి.
గత ఏడాది 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో విలనిజాన్ని పోషించి చక్కని నటన కనబర్చి మంచు లక్ష్మీప్రసన్న నంది అవార్డు కైవసం చేసుకున్నారు. తాజాగా నిర్మాతగా 'గుండెల్లో గోదారి' చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవైపు నటిగా రంగప్రవేశం చేసి దర్శకురాలుగా ఎదిగిన జీవిత రాజశేఖర్ ఈసారి 'మహంకాళి' అనే చిత్రంతో తన సత్తా చాటనుంది. ఇంకోవైపు.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా ఎదిగి ప్రస్తుతం నిర్మాతగా మారి స్త్రీ నేపథ్యంలో 'ఆల్ ఐ వాంట్' చిత్రాన్ని తీశారు. కాకతాళీయమైనా ఈ ముగ్గురు మహిళలల నాయకత్వంలో వస్తున్న ఈ చిత్రాలు ఈరోజు విడుదల కావడం విశేషం.
ముగ్గురి చిత్రాల్లో కథాంశం భిన్నంగా ఉంది. లక్ష్మీ మంచు నిర్మించిన 'గుండెల్లో గోదారి' అచ్చమైన తెలుగు నుడికారంలాంటి కథ. గోదావరి అందాలు, వరదలు, కష్టాలు, నష్టాలతోపాటు ప్రేమలు కూడా ఇందులో ఉన్నాయి. ఈకథకు ప్రేరణ 1986లో వచ్చిన వరదలు. దీనికి ప్రేమకథను మిళితం చేసి తెరకెక్కించారు. అక్కడి మత్స్యకారుల జీవితాలకు సంబంధించి కావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో 27 ఎకరాల్లో120 గుడిసెలుగా పల్లెసెట్ వేసి చిత్రీకరించారు. గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు. ఇళయరాజా స్వరపర్చిన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో ప్లాటినం డిస్క్ కూడా చేసుకుంది. రొటీన్‌గా వస్తున్న చిత్రాలకు భిన్నంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇవి ప్రేక్షకులను ఏమేరకే చేరుకుంటాయో చూడాలి !
ఝాన్సీ చెప్పే..అమ్మాయిల కథ !
టీవీ వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించిన ఝాన్సీ, నటిగా వెండితెరపై కూడా తనదైన గుర్తింపు అందుకుంది. తాజాగా 'ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రిథింగ్' చిత్రాన్ని నిర్మించారు. శీతల్ మోర్జారియా దర్శకురాలు. ముగ్గురు అమ్మాయిల కథ ఇది. దేశంలోని మూడు వేరు వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ అమ్మాయిలు స్నేహితులుగా మారుతారు. తమ తమ జీవితాశయాల్ని ఎలా నెరవేర్చుకున్నారనది ప్రధాన కథాంశం. పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో 'హైదరాబాద్ నవాబ్స్' తరహాలో ఇంగ్లీష్ యాసతో తెరెక్కించామని ఝాన్సీ అన్నారు. ట్రైలర్స్ ఇటీవలే విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో లక్ష్మీమంచు పాల్గొన్నారు. ఈనెల 8న విడుదల చేస్తున్నామని, సక్సెస్ సాధిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇదే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...'ఝాన్సీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పింది. ఇంకేముంది సినిమా తీసింది. ఏవో కష్టాలు వచ్చివుంటాయి. సమస్యలన్నీ ఏకరువుపెడుతుంది.
బయట పడటానికి సాయం అడుగుతుందే మోననుకున్నా. కానీ ఫంక్షన్‌కు వచ్చాక...నా అంచనా తప్పని తెలిసింది. దిగ్విజయంగా పూర్తిచేసి విడుదల చేస్తుందని తెలిసాక గర్వపడుతున్నా. ఆమెపై మరింత అభిమానం పెరిగింది' అని అన్నారు. 62 నిముషాల నిడివిగల చిత్రాన్ని జాతీయస్థాయి ప్రేక్షకులకు అందించాలనే ఆంగ్లంలో తీశాననీ, తెలుగు మహిళల సత్తా ఏమిటో నిరూపించుకోవాలనే ఈ ప్రయత్నం చేశానని ఝాన్సీ వెల్లడించారు. ఈ మూడు చిత్రాలు విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.
నిజంగానే మహంకాళి !
రాజశేఖర్ నటించిన 'మహంకాళి' సినిమా 2010 అక్టోబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్ళపాటు ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. సినిమాకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. కాళి అని పెడితే కొన్ని ఇబ్బందులు వస్తాయని చాలామంది అన్నారనీ అది నిజమయిందని డాక్టర్ రాజశేఖర్ కూడా వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా ఛేజింగ్ సీన్‌ను చెన్నైలో తీస్తుండగా రాజశేఖర్‌కు గాయాలయ్యాయి. ఆ తర్వాత మహంకాళి అనేది ఓ పోలీసు పేరు అని, సినిమా పేరుగా తీసుకోవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు గర్వించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందనీ, తమ కుటుంబంలో చాలామంది పోలీస్ ఆఫీసర్లున్నారనీ, 'అంకుశం' సినిమా చూశాక అప్పట్లో గర్వించే చిత్రం తీశారనీ ప్రశంసించారనీ, ఇప్పుడు అంకుశం-2గా వస్తున్న మహంకాళి మరింత ఉన్నత స్థాయికి తెచ్చే చిత్రమవుతుందనీ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. మరోవైపు నిర్మాణపరంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఇవన్నీ దాటుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుని జీవిత మహంకాళిగా ముందుకుసాగిందని రాజశేఖర్ కితాబిచ్చారు. ఈనెల 8న దిగ్విజయంగా విడుదలకావడం ఆనందం ఉందన్నారు. మధురిమ కథానాయికగా నటించిన చిత్రాన్ని సురేందర్‌రెడ్డి, పరంధామరెడ్డి నిర్మించారు. జీవిత మాట్లాడుతూ...'సమాజంలో జరుగుతున్న అరాచకాలకు అన్యాయాలకు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏ మేరకు న్యాయం చేశాడనేది చిత్రకథాంశం. బాంబ్ బ్లాస్ట్ మిస్టరీలను ఛేదించి నిజాయితీ అధికారిగా ఎలా నిలిచాడన్నది చిత్రంలో చూడాలని ఆవిడ అన్నారు.