అతని తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినా, అతను ఇప్పుడు జాక్పాట్ కొట్టాడు. ఆ దర్శకుడి పేరు గోపీ గణేష్ ! పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా 'రోమియో' చిత్రాన్ని రూపొందిస్తున్న గోపీ గణేష్ ఇప్పుడు ఏకంగా రామ్చరణ్ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు. గోపీ కథ చెప్పిన తీరు ఎంతగానో నచ్చడంతో, చరణ్ అతనికి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు నిర్మిస్తారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించే చిత్రంతోబాటుగా గోపీ గణేష్ చిత్రం షూటింగు కూడా ఏకకాలంలో జరుగుతుందట ! ఏదేమైనా, తన తొలి సినిమా 'రోమియో' ఇంకా విడుదల కాకుండానే, చరణ్ లాంటి పెద్ద హీరోతో చాన్స్ కొట్టేసిన గణేష్ లక్కీఫెలో !