27న ఊ..కొడతా...

మంచుమనోజ్‌, బాలకృష్ణ కలిసి నటించిన చిత్రం 'ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా'. ఈనెల 27న విడుదల చేస్తున్నట్లు మోహన్‌బాబు ప్రకటించారు. గురువారం ఆయన చిత్రం గురించి తెలియజేస్తూ... 'ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో అనుకున్నాం. కానీ ఇప్పటికే సినిమా రెడీగా ఉండటంతో ముందుకువచ్చాం. బాలకృష్ణ పాత్ర అద్భుతంగా ఉంటుంది. మంచుమనోజ్‌కు ఈ చిత్రంతో 100% స్టార్‌డమ్‌ వస్తుంది. లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని చేకూర్చాలని, మహిళా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. నా సినిమాలను మహిళలే ఆదరించేవారు. ఈ సినిమా శ్రావణ శుక్రవారంనాడు విడుదలకానున్నది' అని తెలిపారు. ఈ సందర్భంగా మంచువిష్ణు నటించిన 'దేనికైనా రెడీ' కూడా సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల చేసి చెబుతాం. అదేవిధంగా లక్ష్మీప్రసన్న 'గుండెల్లో గోదారి' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ముళ్లపూడి రమణ రాసిన నవల ఇది. దీని హక్కులు రామారావు దగ్గర ఉంటే ఆయన అడిగిన వెంటనే మాకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా'నని అన్నారు.

లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ...'రెండేళ్ళు కష్టపడి, ఇష్టపడి ఈ సినిమాను నిర్మించాం. ఆగస్టులో అనుకున్నాం. కానీ ముందుగా ప్రేక్షకుల తీర్పుకోసం ఈనెల 27న వస్తున్నాం' అని చెప్పారు.

మనోజ్‌ మాట్లాడుతూ....'2008 నుంచీ నా డ్రీమ్‌ ఇది. కమర్షియల్‌ సినిమా తీదామన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. కొత్త ట్రైలర్స్‌ విడుదల చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది' అని అన్నారు.