వివిధ గెటప్పులలో..మిస్టర్‌ రాజేష్‌

ఆకాష్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ రాజేష్‌'. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. సోని చరిష్టా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్‌ వైవిధ్యమైన ఏడు పాత్రలు పోషించటం విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రహమత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై యువ నిర్మాత ఖాదర్‌వల్లి నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఈయనకిది తొలి చిత్రం.

ఈ సందర్భంగా నిర్మాత ఖాదర్‌వల్లి మాట్లాడుతూ..'మా హీరో కమ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌గారి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌ మరియు పూర్తి సహాయసహకారాల వల్ల 'మిస్టర్‌ రాజేష్‌' చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలిగాం. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఆకాష్‌ 'లవర్‌బోరు, వెయిటర్‌, సబ్‌-ఇన్స్‌పెక్టర్‌, లారీ డ్రైవర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, బిజినెస్‌మేన్‌ క్యారెక్టర్‌లతోపాటు సైకో క్యారెక్టర్‌' కూడా పోషిస్తున్నారు. సైకో క్యారెక్టర్‌ కోసం ఆయన నిజంగా గుండు గీయించుకున్నారు. అలాగే ఒక్కో క్యారెక్టర్‌ గెటప్‌ ఒక్కోవిధంగా డిఫెరెంట్‌గా ఉండేందుకు ఆకాష్‌ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి క్యారెక్టర్‌కు ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ ఉండేలా చూసుకోవడంతోపాటు, డైలాగ్‌ మాడ్యులేషన్‌ పరంగానూ జాగ్రత్తలు తీసుకున్నారు.

'అపరిచితుడు' చిత్రం విక్రమ్‌కు ఎంత పేరు తెచ్చిపెట్టిందో 'మిస్టర్‌ రాజేష్‌' చిత్రం మా హీరో ఆకాష్‌కి అంత మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమవుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. జులై చివరివారంలో ఆడియోను విడుదల చేసి, ఆగస్టు ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.