చాలా సాదా సీదా జీవితాన్ని ప్రారంభించి, ఒక రంగంలో అసాధారణ స్థాయికి ఎదగటం ఆషామాషీ కాదు. ప్రతిభకు అనుభవాన్ని జోడించి ముందుకు సాగటం కొంతమందికే సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తిగా దాసరి నారాయాణరావును చూపొచ్చు. తాను ఎదగటమే కాకుండా, ఎంతోమంది ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దిన ఘనత కూడా దాసరిదేనని ఇండిస్టీలో చెబుతుంటారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలు రూపొందించిన ఆయన ఇకపై ఏడాదికి నాలుగు చిత్రాలు తన బ్యానర్‌లో రూపొందిస్తూ.... అటు కొత్తవారికి ఇటు తనను నమ్ముకున్న వారికి అవకాశాలు కల్పిస్తానంటున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ప్రతిఏడాది జరుపుకుంటున్నా...ఈ ఏడాది సతీమణి మరణంతో విరమించుకున్నారు. ఆమె జ్ఞాపకార్థం దాసరి పద్మ విగ్రహాన్ని స్వగహంలోని ఆవరణలో శుక్రవారంనాడు ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడిస్తున్నారు.
* తీయబోయే 151వ చిత్రానికి 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' అనే టైటిల్ పెడుతున్నానని తెలుపగానే ఎంతో స్పందన వచ్చింది. ఇటీవలే అభిమాని బంకారమేష్ కుటుంబాన్ని పలకరించడానికి ఒంగోలుకు కారులో వెళ్ళాను. అక్కడ అంతా దీనిగురించే చర్చించుకోవడం చూశాను. మిగతా చోట్లకూడా టైటిల్ బాగుందనే కామెంట్లు వచ్చాయి. ఆ చిత్ర వివరాలు త్వరలో తెలియజేస్తా.
* ఈ ఏడాది నా బ్యానర్‌లో నాలుగు పెద్ద సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందులో ఫాంటసీ కూడా ఉంది. ఈ చిత్రాల్లో కొత్త దర్శకులు, పాత దర్శకులు కూడా ఉంటారు. ఇది కాకుండా, మంచి కథల్తో ఎవరైనా వస్తే వారికి తప్పకుండా దర్శకత్వం అప్పగిస్తాను. ఏడాదికి నాలుగు సినిమాలు గ్యారంటీగా తీస్తా.
*సినిమా పుట్టి వందేళ్ళు కావస్తుంది. వందేళ్ళ చరిత్రలో తెలుగువారిదే పైచేయి. వహీదా రెహ్మాన్, రేఖ, జయప్రద, ఆదుర్తిసుబ్బారావు, ఎల్‌విప్రసాద్, బి.ఎన్. రెడ్డి, దాసరి, బాపయ్య, ఎన్.టి.ఆర్. ఎస్వీఆర్.. సావిత్రి.. రామానాయుడు, రాఘవేంద్రరావు...ఇలా ఎంతో మంది ఉన్నారు. భారతదేశ సినిమా చరిత్రలో తెలుగువారిదే సింహభాగం. గిన్నిస్ రికార్డ్స్ వచ్చినవారంతా తెలుగువారే.
* నేను ఇంతవరకు చాలా కథలు చేశాను. కానీ మైథలాజికల్ సినిమా చేయలేదు. చేస్తే భారతాన్ని టచ్ చేసి తీస్తా. అలాగే, టెక్నాలజీపరంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా నేనూ మరాను. అలా మారాను కాబట్టే 'పరమవీరచక్ర' తీశాను. ఏ సినిమా రిలీజ్ అయినా ఆ చిత్రాన్ని చూస్తుంటాను.
* ఇటీవలే బెంగాల్ దర్శకుడు శాంతారామ్‌గారు..టోటల్ సినిమారంగాన్నుద్దేశించి...తీసేవారికి లాభం లేదు. చూసేవారికి సంతోషం లేదని.. కామెంట్‌చేశారు. ఆయన చెప్పింది నిజం...ఇప్పుడు తెలుగులో జరుగుతున్నదదే.
* 'నీడ'లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని చేయాలనుంది. కానీ జనాలు చూస్తారనే గ్యారంటీ లేదు. స్వర్గం నరకం, శంకరాభరణం, తాతామనవడు వంటి చిత్రాలు ఇప్పుడు తీస్తే ఒక్క ధియేటర్ కూడా దొరకదు. దానికి ఉదాహరణే.. తాజాగా విడుదలైన 'దేవస్థానం'. ఆ సినిమా రాష్ట్రంలో ఒక్క థియేటరలో ఒక్కషోకే పరిమితమైందంటే ఆశ్చర్యమేస్తుంది.
*సినిమాలకు థియేటర్లు దొరక్క చాలా ఇబ్బందిపడుతున్నారు. పెద్దసినిమా రిలీజ్ ఐతే విజయవాడ లాంటి చోట్ల 25 థియేటర్లలో ఒకే సినిమా ఆడుతుంది. అంతకుముందు కలెక్షన్లు ఉన్నా ఆ సినిమాను తీసేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీగా పేర్కొనవచ్చు. ఈరోజుల్లో సినిమాను తీసేసి కొత్త సినిమా వేశారు. రెండోరోజు కలెక్షన్లు డ్రాప్ కావడంతో మళ్ళీ అదే సినిమాను మార్చారు.
* చిన్నచిత్రాల్లో 'ఈరోజుల్లో' చిత్రం ట్రెండ్‌గా నిలిచింది. దాని కోసం ఆ నిర్మాతలు ఎంత కష్టపడ్డారో...చివర్లో డబ్బుల్లేక తక్కువ ధరకు అమ్మేసుకున్నారు. అసలు రిలీజ్ చేయడానికి థియేటర్లే దొరకలేదు. దాంతో రిలీజ్‌టాక్ బాగా రావడంతో...దళారీలు ప్రవేశించారు. దాన్ని వాళ్ళ సినిమాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎవడో క్రియేటివిటీని క్యాష్ చేసుకుంటున్నారు. సినిమారంగంలో క్రియేటివిటీ దోపీడీ ఎక్కువైంది. దోపిడీకి నాలాంటివాడు ఎదురుతిరిగితే వర్గ శత్రువు అంటూ ముద్ర వేసేస్తున్నారు. అందుకే ఏ సమస్యకైనా సమిష్టిగా పోరాడాలి. అది థియేటర్ సమస్య అయినా, పైరసీ సమస్య అయినా చిన్న చిత్రాల సమస్య అయినాసరే... వ్యక్తిగతం కాకూడదు.
* 89లో వంగవీటి మోహన రంగా చనిపోతే ఆవేశంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఏదో ఆశించి, పదవుల కోసం రాలేదు. ఇప్పుడు నేనేదో పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు ఊహాగానాలే. నిజం కాదు. జెండాలు మార్చి బ్లాక్‌మెయిలింగ్ చేయడం నాకు చేత కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ వాదినే. సిద్దాంతపరంగా విభేదిస్తా. ఆత్మాభిమానాన్ని దెబ్బకొడితే.. అప్పుడు ఆలోచిస్తా.