తమిళ్‌లోనూ నువ్వానేనా

అల్లరి నరేష్‌, శర్వానంద్‌, శ్రియ కాంబినేషన్‌లో రూపొందిన 'నువ్వా-నేనా' అనే చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చిత్ర దర్శకుడు నారాయణ తెలియజేశారు. ఇటీవలే విడుదలైన ఈచిత్రానికి అన్నిచోట్ల మంచి స్పందన లభించిందన్నారు. కథ అనుకున్నప్పుడే నరేష్‌ను సంప్రదించామనీ, మరో పాత్రకు ఎవరైతే బాగుంటుందని అనుకుంటుండగా శర్వానంద్‌ పేరు ఆయన సూచించారన్నారు. శ్రియాశరన్‌కు కథ చెప్పగానే వెంటనే అంగీకరించినా.. ఆమె డేట్స్‌కోసం కాస్త ఆలస్యం అయిందన్నారు. 'ఖడ్గం'తో తన కెరీయర్‌ ప్రారంభమైందనీ, చక్రం వరకు కృష్ణవంశీ దగ్గర పనిచేశాననీ, తదుపరి కొత్తబంగారులోకం, హరేరామ, కత్తి తదితర చిత్రాలకు పనిచేశానన్నారు. కథ రాసుకున్నప్పుడు వంశీకృష్ణగారు విని 'సోలో' చిత్రంకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలని సూచించారనీ, అదే ప్రేక్షకులకు బాగా నచ్చిందన్నారు. నరేష్‌; శర్వానంద్‌ కాంబినేషన్‌ అంటే 'గమ్యం'లాంటి సీరియస్‌ మూవీ అనుకుంటారనీ, పూర్తి వినోదాత్మకంగా తీయాలని చిత్రించామని తెలిపారు. ఈ చిత్రం 'దీవానా మస్తానా' ఛాయలున్నాయనే ప్రశ్నకు బదులిస్తూ.... ప్రతి చిత్రంలోనూ ఏదో సన్నివేశం ఒక్కడోచోట కలుస్తుందనీ, అలా ఫోబియో ఉన్న వ్యక్తిగా శర్వానంద్‌ పాత్ర కలిసిందనీ, ఆ చిత్రమే వేరే చిత్రానికి కాపీ అని అన్నారు. ఈ చిత్రాన్ని తమిళ్‌లో అనువాదంకానీ, రీమేక్‌కానీ చేయాలనే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు.