కల్తీకల్లు అమాయకుల ప్రాణాలను బలిగొంటుంది. ఇటీవల కొండపాక మండలం దుద్డిడ గ్రామంలో గుడాల మల్లన్న కల్తీకల్లుతాగా మృత్యువాత పడ్డాడు. అలాగే సిద్దిపేట పట్టణంలో ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తి మరణించాడు. ఇలాంటి రాష్ట్రంలో ఏదోఒక చోట జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న తూర్పుగోదావరి జిల్లా గొల్లపల్లి మండలం కొడవలిలో కల్తీకల్లుతాగి ఇద్దరు చనిపోగా ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. అంతకుముందు అదే జిల్లాలో 19 మంది బలైయ్యారు. ఇలా ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వెలుగులోకొచ్చేవి కొన్నైతే సెటిల్‌మెంట్‌లతో ముగిసిపోయేవి మరికొన్ని. ఇంత జరుగుతున్నా కల్తీ కల్లును అరికట్టాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో జోగుతూ చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాగిన వెంటనే కిక్కునిచ్చి నిషా కలిగేందుకు కల్తీకల్లులో ప్రమాదకరమైన అల్ఫాజోలెంలాంటి విషపూరిత డ్రగ్‌లను వాడుతున్నారు. దీంతో తాగిన వారికి నిషాతో పాటు ఆయుక్షీణం కలుగుతుంది. ఒక సారి కల్తీకల్లును తాగిన వారు దానికి బానిసలుగా మారుతోన్నారు. గతంలో సిద్దిపేట డివిజన్ పరిధిలోని కల్లు దుకాణాలలో క్లోరల్‌హైడ్రేట్, డైజోఫామ్, క్లోరోఫామ్‌లను కృత్రిమ కల్లు తయారీలో వినియోగించేవారు. సిద్దిపేట సర్కిల్ పరిధిలో మొత్తం 41 కల్లు సొసైటీలుండగా, 44 టిఎఫ్‌టి కల్లు దుకాణాలున్నాయి. ఇన్ని దుకాణాలున్నా పట్టణ ప్రాంతాల్లో ఉండే దుకాణాల్లోనే ఎక్కువగా కల్తీ కల్లును విక్రయిస్తున్నట్లు సమాచారం. అనుమతి కల్లుదుకాణాల్లోనే ఇష్టానుసారంగా కల్తీ కల్లు అమ్ముతూ పేదల జీవితాలతో ఆటలాడుతున్నారు. పట్టణంలో నివసించే పేదలు తాము చేసిన కాయకష్టం మరిచి, హాయిగా నిద్రపోవడానికి కల్లును సేవిస్తారు. బ్రాందీ, విస్కీలతో పోలిస్తే కల్లు ధర తక్కువగా ఉండటంతో కల్లు పట్ల వారు ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన కల్లు తాగితే ఆరోగ్యంకూడాను. కాని లాభాల కోసం అందులో క్లోరల్ హైడ్రేట్‌ను వినియోగించడం బహిరంగ రహస్యం. ఇటీవల లాభాలకు ఆశపడి కొంత మంది కాంట్రాక్టర్‌లు కల్లులో ప్రమాదకరమైన ఆల్ఫాజోలెం అనే మత్తు పదార్థాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. దీన్ని పరీక్షించడానికి కావలసిన పరికారాలు స్థానిక ఎక్సైజ్ కేంద్రాల్లో అందుబాటులో లేవు. బెంగుళూర్‌లో మాత్రమే ఆ సౌకర్యం ఉంది. అందు కోసం 10వేల రూపాయలు ఖర్చవుతుంది. ఎక్సైజ్ శాఖ్ గణనీయమైన ఆదాయాలను పొదుతున్నా కొద్దిమొత్తాన్ని ఆ పరికరాలకు వెచ్చించడానికి సంసిద్ధంగా లేదు. కల్తీ కల్లుకు అలవాటు పడిన వారు ఒక్కసారిగా తాగడం మానేస్తే మానసికంగా దెబ్బతినే ప్రమాదమూ పొంచిఉంది. రోజులు గడిచే కొద్ది అలాంటి వారు ఆరోగ్యం దెబ్బతిని మృత్యువాత పడుతున్నారు. దీంతో కల్లుతాగినవారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కల్తీ కల్లును అమ్ముతున్న కాంట్రాక్టర్‌లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదకర రసాయనాలను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు తయారీదారుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను ప్రజాశక్తి వివరణకోరగా తన పరిధిలో కల్తీ కల్లు విక్రయాలు జరగడం లేదని అలా జరిగినట్టు తమ దృష్టికి వస్తే చర్యలు చేపడతామని సిఐ తిమ్మయ్య అన్నారు. 'వారానికొకసారి కల్లు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నాం. సిద్దిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో కల్తీ కల్లు నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. కల్తీ కల్లు అమ్ముతున్నట్లు ఎవరైనా సమాచారం కానీ, ఫిర్యాదులు కానీ చేస్తే అట్టి దుకాణాలపై దాడి చేసి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం' అని సిద్దిపేట ఎక్సైజ్ సిఐ జావెద్ అలీ అన్నారు.
java.lang.NullPointerException