సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసింది. అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉపపోరులో కాంగ్రెస్ తరపున తాడూరి శ్రీనివాస్, టిడిపి నుంచి మాజీ మంత్రి బాబుమోహన్, టిఆర్‌ఎస్ నుంచి హరీష్‌రావు, మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 27న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో లక్షా 86 వేలా 303 ఓటర్లు ఉన్నారు. అందులో లక్షా 32 వేలా 469 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 208 ఇవిఎంల్లో అభ్యర్థుల భవితవ్యం దాగిఉంది. తొలుత లక్ష మెజార్టీ వస్తుందని చెప్పిన టిఆర్‌ఎస్‌కు ఆ పరిస్థితి కనిపించడంలేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తాము గట్టిపోటీనిచ్చామని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉందనేది మాత్రం నేడు తేలనుంది. గతం కంటే ఈ సారి పోలింగ్ శాతం పెద్ద తేడాలేదు. హరీష్‌రావుకు ఎంత మెజార్టీ వస్తుందోనని జిల్లా అంతట చర్చనీయాంశంగా మారింది. దీనిపై జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోందని తెలిసింది.
ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం
ఈ నెల 27న జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. 208 ఇవిఎంలను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లుగా ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు నలుగురు సిబ్బంది, అభ్యర్థి నుంచి ఒకరు చొప్పున 14 మంది ఏజెంట్లు ఉంటారు.
భారీ పోలీసు బందోబస్తు
సిద్దిపేట ఉప ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ సుందర్‌కుమార్‌దాస్‌తో పాటు, ముగ్గురు డిఎస్పీలు, ఆరుగురు సిఐలు, 20 మంది ఎస్‌ఐలు, 8 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరింప చేశారు.