కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఏమిటో పార్లమెంటులో ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్ధమవుతుంది. కార్పొరేట్ రంగానికీ, ధనిక వర్గాలకూ రాయితీలమీద రాయితీలు, సామాన్యులకు పన్నుల మీద పన్నులు, ఆర్థిక రంగం నుండి మరింతగా ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్రయివేటీకరణను ప్రోత్సహించడం... ఇదీ ప్రణబ్ బడ్జెట్ సంగ్రహ స్వరూపం. 2010-11 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి 60,000 కోట్ల రూపాయల మేరకు అదనంగా పరోక్ష పన్నులు విధించారు. ఇవన్నీ ప్రజలమీద పడే భారాలే. అదే సమయంలో కార్పొరేట్ రంగానికి సర్‌ఛార్జి తగ్గిస్తూ, ఇతర ధనిక వర్గాలకు 26,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు. బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ఎక్సయిజ్ సుంకాలు పెంచడం వల్ల వాటి రేట్లు పెరిగాయి. దీని ప్రభావం అన్ని రకాల వస్తువులపై పడనుంది. ఇప్పటికే అధిక ధరలతో బాధపడుతున్న సామాన్యుడు రానున్న కాలంలో మరింతగా ధరాఘాతం ఎదుర్కోబోతున్నాడన్నమాట. ప్రభుత్వ సాయం, పెట్టుబడులు లేక కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి చేయూత నిచ్చే ఒక్క చర్యకూడా బడ్జెట్‌లో లేదు. ఇప్పటికే కరువులు, వరదలతో వెనకపట్టు పట్టిన వ్యవసాయ ఉత్పత్తి రానున్న కాలంలో మరింత తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆహార ద్రవ్యోల్బణం 20 శాతం వరకూ ఉన్న తరుణంలో వ్యవసాయం మరింత తగ్గితే దేశానికి, ముఖ్యంగా దేశంలోని పేద ప్రజలకు ఎదురవనున్న కడగండ్ల గురించి ఆర్థికమంత్రి ఆలోచించినట్లే లేదు. పైగా వ్యవసాయ సబ్సిడీల 'భారం' తగ్గించుకోడానికి ఎరువులకు ఇచ్చే సబ్సిడీలను పోషకాల ఆధార సబ్సిడీలుగా మారుస్తామంటున్నారు. తగ్గుతున్న వ్యవసాయోత్పత్తి పెంచడానికి ఆ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయకపోగా వ్యవసాయంలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తానంటోంది. అంటే వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ రంగంలో చేతుల్లో పెడుతుందన్న మాట. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి కేవలం వెయ్యికోట్ల రూపాయలు మాత్రమే పెంచారు. పెరిగిన ఖర్చులతో పోలిస్తే దీనికి పెంపుదల తగ్గినట్లే లెక్క. మొత్తంగా యుపిఎ2 ప్రభుత్వ బడ్జెట్ దశ-దిశ అంతా ప్రయివేటీకరణ, సరళీకరణ దిశగానే ఉంది. బ్యాంకింగు రంగం నుండి ప్రభుత్వం 25,000 కోట్ల షేర్లు అమ్ముతానంటోంది. యూరియాపైనా, పెట్రోలియం ఉత్పత్తులపైనా కంట్రోల్స్ ఎత్తివేయడానికి పూనుకుంటోంది. ప్రజాపంపిణీ వ్యవస్థనుండి ప్రభుత్వం ఉపసంహ రించుకుంటోంది. ఎఫ్‌సిఐ గోడౌన్లను ప్రయివేటు గోడౌన్లుగా మార్చనున్నట్లు ప్రణబ్ వెల్లడించారు. విదేశీ మెషినరీ దిగుమతులపై సుంకాలు తగ్గించడం ద్వారా చిన్న పరిశ్రమల గొంతు నులమ బూనుకుంది. కార్పొరేట్ రంగానికీ, విదేశీ పెట్టుబడులకూ అనుకూలంగా ఉన్న బడ్జెట్ గనుకనే ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుక్షణం నుండి స్టాక్ మార్కెట్లు పైపైకి పెరగడం ప్రారంభించాయి. కార్పొరేట్ రంగం ప్రణబ్ బడ్జెట్ పట్ల ఎంత సంతోషంగా ఉన్నదో ఇది తెలియజేస్తోంది. కాని బడ్జెట్‌లో సామాన్యుడు సంతోషించే ఒక్క చర్యకూడా లేదు, తీపి మాటలు తప్ప. అందువల్లనే కార్పొరేట్ రంగంతో బాటు, కార్పొరేట్ మీడియా ఆయన బడ్జెట్‌ను ఆకాశానికెత్తుతున్నాయి. కాని ప్రజలవైపునుండి చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన బడ్జెట్. సామాన్యునికి భారాలు పెంచి, సంపన్నులకు రాయితీలు కల్పించే బడ్జెట్. కేంద్ర బడ్జెట్ యొక్క ఈ అసలు స్వరూపాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. బడ్జెట్ భారాలపై బలమైన ప్రతిఘటనను నిర్మించాలి.