అమెరికాలో ఊపందుకుంటున్న నిరుద్యోగ వ్యతిరేక ఉద్యమం

  • ప్రపంచ గమనం

రెండేళ్ల క్రితం గృహరుణాల సంక్షోభంగా ప్రారంభమైన అమెరికా ఆర్థిక సంక్షోభం నేడు మరింత విస్తరించి, కొత్త రూపాన్ని సంతరించు కుంటున్నది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన రక్షణ (బెయిలవుట్‌) ప్యాకేజీతో దేశం ఆర్థిక సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు ఒక వైపు వార్తలు వస్తుండగా మరోవైపు క్రమంగా సంక్షోభం మరింత విస్తరించి రాష్ట్రాలు, స్థానిక సంస్థలు దివాళా తీయడం ప్రారంభించాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రక్షణ ప్యాకేజీ డబ్బు... 78,700 కోట్ల డాలర్లు ఖర్చయిపోతున్నాయి. గత మూడు త్రైమాసికాలుగా కొంచెం అభివృద్ధి చూసిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ త్రైమాసికంలో మళ్లీ వెనకడుగు వేసిందన్న సరికొత్త వార్తలతో స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభం ఐరోపాను తాకింది. గ్రీసు దివాళా తీసింది. సంక్షోభం స్పెయిన్‌, పోర్చుగీసు, ఇటలీలను తాకి ఐరోపా ప్రధాన దేశాలైన బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా వణికిస్తున్నది. సంక్షోభం అమెరికాలో కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్రాలూ, స్థానిక సంస్థలు దివాళా తీసి బడ్జెట్‌లలో కోతలు కోస్తుంటే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న ప్రజలు ఎక్కడి కక్కడ సమీకృతులై ఆందోళనలకు దిగుతున్నారు. పట్టణాలు, నగరాలు, రాష్ట్రాల స్థాయిలో నిరు ద్యోగ వ్యతిరేక ప్రజాందోళనలు మిన్ను ముడు తున్నాయి. ఈ ఆందోళనకు ఒక దేశ వ్యాపిత ఉద్యమ రూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలోని డజన్ల కొద్దీ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగు తున్న ఆందోళనల గురించి ప్రధాన మీడియాలో అసలు వార్తలే రాకపోవడం ఆశ్చర్యం కలిగి స్తోంది.

స్థానిక ప్రభుత్వాల దివాళా

అమెరికాలోని అనేక రాష్ట్రాల పరిస్థితి ప్రస్తుతం గ్రీస్‌, స్పెయిన్‌ దేశాల సంక్షోభాన్ని తలపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాలి ఫోర్నియా రాష్ట్రానికి ప్రఖ్యాత హాలీవుడ్‌ నటుడు, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఆర్నాల్డ్‌ స్వాజ్‌నెగ్గర్‌ గవర్నర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రం మహామాంద్యం తరువాత అంతటి మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక రంగం పుంజుకుంటు న్నది అంటున్నారుగాని ఆ రాష్ట్రంలో అటువంటి ఛాయలు ఎక్కడా కనిపించడం లేదు సరికదా ముందు ముందు మరిన్ని కష్టాలనెదుర్కుం టుందని చెబుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం 12.4 శాతానికి పెరిగింది. అమెరికా సగటు కన్నా ఇది 2.7 శాతం ఎక్కువ. రష్యా ఆర్థిక వ్యవస్థ కన్నా ఈ రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పెద్దది. దీని స్ధూల జాతీయోత్పత్తి 1.8 లక్ష కోట్ల (ట్రిలియన్‌) డాలర్లు. రెండేళ్లుగా నిరుద్యోగం పెరిగి, ఆదాయాలు తగ్గి రాష్ట్ర బడ్జెట్‌ లోటులో నడుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ ఇచ్చిన సహాయం హరించుకుపోవడంతో ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకునే పేరుతో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తోంది. 1900 కోట్ల డాలర్ల బడ్జెట్‌ లోటు పూడాలంటే 13 లక్షల పేద కుటుంబాలకు అందించే సంక్షేమాన్నయినా కోతకోయాలి లేకుంటే 900 కోట్ల డాలర్ల అప్పన్నా చేయాలని చెబుతోంది. అంతేగాని కన్సర్వేటివ్‌ ప్రభత్వుం ధనికుల జోలికి మాత్రం వెళ్లడానికి ఇష్టపడ్డం లేదు.

ఒక్క కాలిఫోర్నియా మాత్రమే కాదు దేశం లోని మొత్తం 46 రాష్ట్రాలు ఇలాగే దివాళా స్థితిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (ఇంకో ఆరుమాసాల్లో ముగుస్తుంది) చివరికి ఈ రాష్ట్రాలన్నీ దివాళా తీయడం ఖాయమని అమెరికాకు బడ్జెట్‌, విధాన ప్రాధామ్యాల కేంద్రం తెలిపింది. ఈ రాష్ట్రాలన్నింటా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు కేంద్ర ఇచ్చిన ఆర్థిక సహాయ ప్యాకేజీలపై బతుకు వెళ్లదీస్తున్నాయి. వీటిలోని 42 రాష్ట్రాలకు కలిపి మొత్తం 5100 కోట్ల డాలర్ల బడ్జెట్‌ లోటు పెరిగింది. ఇది వీటి మొత్తం బడ్జెట్లలో 10 శాతం. గతంలో ఈ రాష్ట్రాలన్నీ బడ్జెట్లు ప్రవేశపెట్టేటప్పుడే లోటు చూపించాయి. దాని మొత్తం 4800 కోట్ల డాలర్లూ కలుపుకుంటే మొత్తం బడ్జెట్‌ లోటు 15 శాతం ఉంటుంది. ఇది పెరగడమే గాని ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

మరింత కుంచించుకుపోతున్న అమెరికా అర్థికం

అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజు కుంటున్నదన్న వార్తల్లో నిజం లేదని అసలు ఆర్థికం చెబుతోంది. 2010 మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత కుంచించుకు పోతుందని, కార్మిక కుటుంబాలు మరింతగా దెబ్బతిని పోతాయని బ్లూమ్స్‌బెర్గ్‌ న్యూస్‌ను ఉటంకిస్తూ ఆర్థిక వ్యవహారాల విశ్లేషకుడు మైక్‌ విట్నే చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ భారీ బెయిలవుట్‌ ప్యాకేజీలు ఫైనాన్స్‌ మార్కెట్లు కుప్పకూలిపోకుండా కాపాడాయి కాని సామాన్య ప్రజల గృహాల్లో మాత్రం కదలిక తేలేకపోయాయి, ఆర్థిక కార్య కలాపాలను పెంచలేకపోయాయి అని ఆయన పేర్కొన్నాడు.

అమెరికా సంక్షోభం ప్రజల చేతుల్లోనుండి 13 లక్షకోట్ల (ట్రిలియన్ల) డాలర్లను లాగేసింది. దాంతో వారిప్పుడు ఆర్థికంగా దివాళాతీశారు, అప్పుడు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. బెయిలవుట్‌ డబ్బులతో లాభాలు పంచుకున్న బ్యాంకులు పేదలకు అప్పులివ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. నిరుద్యోగులై, అప్పులివ్వడానికి 'పనికిరాకుండా పోయిన' ప్రజలు మార్కెట్‌ శక్తులకు ఉపయోగపడరు కదా! అందువల్ల అమెరికా ఆర్థికవ్యవస్థ ఇప్పట్లో కోలుకుంటుందా అంటే కోలుకోదు అని ఎక్కువ మంది అమెరికన్లు చెబుతున్నట్లు బ్లూంబెర్గ్‌ న్యూస్‌ కథనం చెబుతోంది. 'జనవరిలో ఒబామా ప్రభుత్వం వచ్చినప్పటికన్నా ఇప్పుడు సగానికన్నా ఎక్కువమంది ప్రజలు తమ జీవితాలు మరింత దిగజారిపోతున్నాయనుకుంటున్నారు' అని బ్లూంబెర్గ్‌ సర్వే చెప్పింది. రానున్న ఆరు మాసా ల్లో అమెరికా ఆర్థికం పుంజుకుంటుందా అంటే మూడింట రెండు వంతులమంది పుంజుకుం టుందని చెప్పలేకపోతున్నారు. దాంతో ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా మీద నమ్మకాలు కూడా ప్రజల్లో తగ్గిపోతున్నాయి. ఒబామా దేశాన్ని సరైన దిశలో తీసుకుపోతున్నాడని సెప్టెంబర్‌లో 40 శాతం మంది చెప్పారు. ఇప్పుడా సంఖ్య 32 కు తగ్గింది. మొత్తంమీద చూసినప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోకుండానే మరోసారి మాంద్యంలోకి (డబుల్‌ డిప్‌ రిసెషన్‌) జారుకుం టుందని ఆర్థిక వేత్తలు గట్టిగా చెబుతున్నారు.

పెరిగిన నిరుద్యోగం

అమెరికా సంక్షోభం ఇప్పటికే తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. సరికొత్తగా 9.7 శాతం నిరుద్యోగం నమోదైంది. అయితే ఇది వాస్తవ సంఖ్య కాదని నిజానికి నిరుద్యోగం 10 శాతం దాటి చాలా దూరం వెళ్లిందని సర్వేలు తెలుపుతున్నాయి. చాలా మంది అమెరికన్లు ఉద్యోగాల కోసం చూసిచూసి విసిగిపోయి నిరుద్యోగులుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం మానేస్తున్నారని అర్థిక వేత్తలు చెబుతున్నారు. గత ఏడాది జులై నుండి డిసెంబర్‌ మధ్య 17 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ మార్కెట్‌ నుండి తప్పుకున్నారు. వీరంద రికీ ఉద్యోగాలు వచ్చి కాదు. నెలల కొద్దీ చూసి నిరాశతో వెనుతిరిగిన వారి సంఖ్య ఇది. ప్రస్తు తం అమెరికాలో ఉద్యోగాల కోసం వేచి చూసే సమయం రానురాను పెరిగిపోతూ ఇప్పుడు సగటున 29 వారాలు వేచి చూడాల్సి వస్తోంది. 1948 తరువాత ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఇదే ప్రథమం. అంతే కాదు పార్ట్‌ టైమ్‌ చేస్తున్న వారిని నిరుద్యోగ జాబితానుండి తొలగిస్తున్నారు. పార్ట్‌టైమ్‌ చేస్తూ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం వేచిచూస్తున్న వారిని కూడా కలుపుకుంటే నిరుద్యోగం 17 శాతం దాటిపోతోంది.

నిరుద్యోగం ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి పరిశ్రమలు మూతపడడంతో బాటు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలూ, స్థానిక సంస్థలూ సంక్షోభం వల్ల ఉద్యోగాలకు ఉద్వాసన పలకడం కూడా ఒక కారణం. అయితే ప్రస్తుతం అసలే కొనుగోలు శక్తి తగ్గిపోతున్న ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన స్థానిక ప్రభుత్వాలూ, సంస్థలూ పొదుపు చర్యల పేరుతో ఉన్న ఉద్యోగాలకు, సంక్షేమ పథకాలకు కోతపెడు తున్నాయి. దాంతో ప్రజల కొనుగోలు శక్తి మరింత తగ్గిపోతున్నది. ఇటీవల గ్రీస్‌, స్పెయిన్‌లలో మాదిరిగానే ఆర్థికంగా దివాళా తీసిన, తీస్తున్న ప్రభుత్వాలను పొదుపు పేరుతో సంక్షేమ, ఉపాధికల్పనా ప్రాజెక్టులపై కోతలు విధిస్తున్నారు. బడ్జెట్లు లోటులో పడి, కోలుకోలేని దెబ్బతిన్న స్థానిక ప్రభుత్వాలు పాఠశాలలు, ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగులను తొలగిస్తు న్నాయి. చాలా నగరాల్లో స్థానిక సర్వీసులను ఎత్తివేస్తున్నారు. ఈ రంగాల్లోని ఉద్యోగులు వేలు, లక్షల సంఖ్యలో నిరుద్యోగులవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం హరించుకు పోతే ఈ పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. దాంతో ఇప్పుడు కాస్తో కూస్తో నెట్టుకొ స్తున్న చాలా సర్వీసులు మూతపడితే మరింత మంది నిరుద్యోగ సైన్యంలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిరుద్యోగ వ్యతిరేక ఉద్యమం

సంక్షోభ భారాలను ప్రజలమీదికి నెట్టి తాము లాభాలతో బయటపడిపోవడానికి పాలక వర్గాలు చేస్తున్న ప్రయత్నాలను అమెరికన్‌ ప్రజలు చూస్తూ ఊరుకోవడం లేదు. నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. వివిధ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల పరిధిలో ప్రారంభమైన ఆందోళనలకు ఒక దేశ వ్యాపిత రూపం ఇవ్వ డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యం గా నిరుద్యోగ వ్యతిరేక ఆందోళనలో దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘమైన ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ, యువకులు, విద్యార్ధులు ఎక్కువగా పాల్గొనడం విశేషం. ఈ ఆందోళనలన్నింటా వినిపిస్తున్న నినాదం ఒక్కటే. 'వాల్‌ స్ట్రీట్‌కు (చట్టా వ్యాపారానికి) రక్షణ కల్పించిన ప్రభుత్వం రియల్‌ స్ట్రీట్‌ (ప్రజలకు) రక్షణ కల్పించడానికి పూనుకోవాలి'. ప్రయివేటు రంగానికి స్వేచ్ఛ కల్పిస్తే చాలా ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయన్న అమెరికన్‌ ఆలోచనా ధోరణి ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. స్థానిక సంస్థల నుండి రాష్ట్రం, జాతీయ స్థాయివరకు ప్రభుత్వాలే ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండు మిన్ను ముడుతోంది. ''అమెరికాకు తక్షణం ఉద్యోగాలు'' (జాబ్స్‌ ఫర్‌ అమెరికా నౌ) అనే పేరుతో ఒక దేశవ్యాపిత సంఘటన ఏర్పడింది. ఎఎఫ్‌ఎల్‌- సిఐఓతో బాటుగా అనేకానేక స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలు, సహారా సంఘాలు ఈ విశాలమైన సంఘటనలో భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ సంస్థల ఆధ్వర్యంలో గత కొన్ని వారాలుగా నగరం తరువాత నగరం, రాష్ట్రం తరువాత రాష్ట్రంలో సదస్సులు, ప్రదర్శనలు, ఊరేగింపులు, టౌన్‌హాల్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాణిజ్య కేంద్రం న్యూయార్క్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన సోషల్‌ ఫోరమ్‌ సమావేశానికి 20,000 మంది హాజరైనారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఇప్పుడే కావాలి. వాల్‌ స్ట్రీట్‌ను ఆదుకున్న ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి ప్రజలను ఆదుకోవాలి అని నినదించారు. అంతకు ముందు న్యూయార్క్‌ సిటీ హాలులో జరిగిన సమావేశంలో వేలాదిమంది స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల కార్యకర్తలు ఉద్యోగాలకోసం డిమాండ్‌ చేశారు. న్యూయార్క్‌ నగరమే కాదు, గత రెండు మూడు వారాల్లో డెట్రాయిట్‌, ఓక్లాండ్‌ (కాలిఫోర్నియా), వాషింగ్టన్‌, ఓహియో, చికాగో తదితర డజన్ల కొద్దీ నగరాల్లో సదస్సులు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ సంస్థల్లో అత్యధిక భాగం గత ఎన్నికల్లో ఒబామాకూ, డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతిచ్చినవే. ఒబామా ప్రభుత్వం పార్లమెంటులో నిరుద్యో గులకు ఉపాధికల్పించేందుకూ, నిరుద్యోగ భృతి కల్పించేందుకూ శాసనాలు రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలను రిపబ్లికన్లతోబాటు, డెమోక్రటిక్‌పార్టీలోనే కొంతమంది కలిసి అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో ఒబామా చేతగాని తనాన్ని ఈ సంస్థలు తీవ్రంగా దుయ్య బడుతున్నాయి. పార్లమెంటుకు ఈ ఏడాది జరుగనున్న కీలక ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యను కీలకాంశంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 9న వాషింగ్టన్‌లో సమావేశమైన 1000 మంది ప్రజా సంఘాల ప్రతినిధులు, అభ్యుదయ వాదులు ''ఉద్యోగాలు, న్యాయం పొందేందుకు మనం ఉద్యమంలోకి దిగాల్సిన తరుణం అసన్నమయింది'' అని ప్రకటించారు. 'అమెరికా తక్షణ భవిష్యత్తు' (అమెరికా ఫ్యూచర్‌ నౌ) పేరుతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలలనుండి ప్రతినిధులు హాజరైనారు. అమెరికాలో నివసిస్తున్న వలస ప్రజలు ''ప్రస్తుతం ఎదుర్కొంటున్నది కేవలం నిరుద్యోగ సమస్య కాదు, పెద్ద వినాశనాన్ని ఎదుర్కొం టున్నది' అని సెంటర్‌ ఫర్‌ కమ్యూనిటీ ఛేంజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపక్‌ భార్గవ పేర్కొన్నారు. 'నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా అమెరికా ఆర్థిక పురోగమనంలో పడే ప్రసక్తే ఉండదు' అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన ప్రయివేటు సంస్థలు చేయలేవు. కేంద్ర ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. ఆయన సంస్థ ''పది లక్షల ఉద్యోగాలు'' ప్రచార కార్యక్రమం చేపట్టింది. నిరుద్యోగులనుండి దరఖాస్తులు సేకరించి అధ్యక్ష కార్యాలయానికి పంపుతోంది.

ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ అధ్యక్షుడు రిచార్డ్‌ ట్రుమ్కా సమావేశంలో మాట్లాడుతూ ''మనల్ని కలిపి ఉంచే అంశాల పునాదిమీద నిర్మాణం చేపట్టడం అమెరికా పురోగామి సంప్రదాయం, మనల్ని విడదీసే అంశాల విద్రోహానికి గురికా వడం దాని సంప్రదాయం కాదు'' అని పేర్కొన్నారు. ఈ దేశాన్ని నడుపుతున్న బడా పెట్టుబడిని కుప్పకూల్చడానికి రాజకీయ నాయకులు కలిసికట్టుగా ప్రయత్నించాలి, దాని స్థానంలో ప్రజానుకూల విధానాలు అనుసరించే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆరిజోనాలో మా సంస్థ ఇటీవల వలస కార్మికులపై జరుగుతున్న జాతివివక్ష దాడులకు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహిం చింది కాని జాతివివక్షను ఖండిస్తే సరిపోదు మంచి ఉద్యోగాలతో ఆర్థిక న్యాయం జరగాలని మనందరం పోట్లాడాలి అని ఆయన పిలుపు నిచ్చారు. అదే విధంగా స్టీల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు లియో గెరార్డ్‌ మాట్లాడుతూ ''మనం కార్మికులకు సాధికారికత, కొత్త ఉద్యోగాలు సాధించుకోవాలంటే ముందుగా నియంత్రణలేని స్వేచ్ఛా మార్కెట్‌ అనే విఫలమైన ఆర్థిక సిద్థాంతాన్ని వమ్ముచేసి, ఓడించాలి'' అని అన్నారు. 'ఇరవై ఏళ్ల ఈ సిద్ధాంతం వినాశనాన్ని మిగిల్చింది'' అని చెప్పారు. అంతేకాదు, ''ఆర్థికా భివృద్ధి ఫలాలు పైనుండి కిందికి ప్రవహిస్తాయి (ట్రికిల్‌ డౌన్‌) సిద్థాంతాన్ని కూడా నాశనం చేయాలి'' అని అన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ రచయిత బాబ్‌ హెర్బెర్ట్‌ మాట్లాడుతూ మనం చాలా క్షిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. అసాధారణ చర్యలు తీసుకుంటేగాని బయటపడలేం అన్నారు.\

జూన్‌ 17న న్యూయార్క్‌లో ''మన నగరాన్ని రక్షించుకుందాం'' (సేవ్‌ అవర్‌ సిటీ) పేరుతో వేలాది మందితో ఒక సదస్సు జరి గింది. నగర ఐక్య ఉపాధ్యాయ సంఘం, 1.25 లక్షల మంది సభ్యులుగల పబ్లిక్‌ వర్కర్స్‌కు సంఘం, అగ్నిమాపక యూనియన్‌, ఇతర అనేక స్థానిక సంస్థల కార్మిక సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. తక్షణం నగర వాసులకు ఉద్యోగాలు కల్పించాలని సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పార్లమెంటు సభ్యుడు మిల్లర్‌ బ్రౌన్‌ ప్రవేశపెట్టిన ''అమెరికా స్థానిక ఉద్యోగాల బిల్లు''కూ, ఉద్యోగ కల్పన, ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాల పొడిగింపుకోసం పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన సుమారు అరడజనువరకు ఉన్న బిల్లులకు సదస్సు మద్దతు ప్రకటించింది.

చాలా నగరాల్లో జరుగుతున్న సదస్సులకు అమెరికా పార్లమెంటు సభ్యులు కూడా హాజరై మద్దతు తెలుపుతున్నారంటే కింది స్థాయిలో ప్రజాందోళన వారిపై ఎంతటి ఒత్తిడి తెస్తున్నదో అర్థమవుతోంది. డెట్రాయిట్‌లో జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో మిచిగాన్‌ పార్లమెంటు సభ్యుడు జాన్‌ కోన్యేస్‌ మాట్లాడుతూ ''ఉద్యోగాల కల్పన పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రయివేటు మార్కెట్ల బాధ్యతా లేక ప్రభుత్వ బాధ్యతా'' అని ప్రశ్నించారు. దానికి ఆయనే సమాధానం చెబుతూ ''ఉద్యోగాలు కల్పించేందుకు పార్లమెం టునూ, రాష్ట్ర ప్రభుత్వాన్నీ, నగర పాలక సంస్థ నూ కదిలించడానికి మనం ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి'' అని చెప్పారు. పదిలక్షల మంది కన్నా తక్కువ జనాభాగల డెట్రాయిట్‌లో 2.5 లక్షల మంది నిరుద్యోగులుగా ఉండటం సిగ్గుచేటైన విషయమని పార్లమెంటు సభ్యుని ఆంతరంగిక కార్యదర్శి సింథియా మార్టిన్‌ చెప్పారు.

అమెరికా కమ్యూనిస్టు పార్టీ చొరవ

ఆర్థిక సంక్షోభం నుండి అమెరికా బయట పడడానికి నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ఉద్యో గాల కల్పనకోసం పోరాడటం అత్యంత కీలకాం శం అని అమెరికా కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఈ నిర్ధారణకు వచ్చిన తరువాత అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీ ఈ సమస్యపై కృషిని కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నది. దీనికి గాను పార్టీ జాతీయ బోర్డు ఒక కమిటీని నియమించింది. ''మన దేశంలోని కార్మికులు, పౌరహక్కుల సంస్థలు, మహిళలు, యువకులు ఇతర పురోగామి సంస్థలన్నీ ఉద్యోగాలకోసం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడటం కీలకాంశంగా, ఎజెండాలో కేంద్ర అంశంగా మార్చుకున్నాయి'' అని అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్‌ శామ్‌ వెబ్‌ చెప్పారు. ''ముఖ్యంగా బాగా దెబ్బతిన్న కార్మిక వర్గ కమ్యూనిటీల మీద మనం కేంద్రీకరించాలి, మరీ ముఖ్యంగా నల్ల జాతీయులు, లాటిన్‌ అమెరికన్లు, ఇతర వలస కార్మికులపై కేంద్రీకరించాలి. యువజనుల్లో నిరుద్యోగం విపరీతంగా ఉంది'' అని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్యపై అన్ని స్థాయిల్లోనూ పనిని సమన్వయ పరచడానికీ, పోరాటాలు అభివృద్ధి చేయడానికీ పార్టీ జాతీయ బోర్డు నియమించిన కార్యకర్తల కమిటీ కృషి చేస్తుందని శామ్‌ వెబ్‌ చెప్పారు. పార్టీ క్లబ్బులు, జిల్లా కేంద్రాలూ ఈ పనిపై ముఖ్యంగా కేంద్రీక రించాలని కోరారు. ఈ కమిటీకి అమెరికా కమ్యూనిస్టు పార్టీ కార్మిక కమిషన్‌ ఛైర్మన్‌ స్కాట్‌ మార్షల్‌ నాయకత్వం వహిస్తారు. ''జాబ్‌ ఫర్‌ అమెరికా నౌ'' జాతీయ సంఘటన ఏర్పాటును పార్టీ ఆహ్వానించింది.

ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ రూపొందించిన 5 సూత్రాల ఆర్థిక పునరుద్ధరణ, ఉద్యోగ కల్పన కార్యక్రమానికి కూడా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. ''ఈ పోరాటానికి ఇటువంటి జాతీయ సంఘటన ఏర్పాటు చాలా మంచి పని'' అని మార్షల్‌ పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో స్థానిక యూనియన్లు, నిరుద్యోగ కమిటీలు, కమ్యూనిటీ గ్రూపులు, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘాలు, చర్చిలు, లేబర్‌ కౌన్సిళ్లు వగైరాలతో కూడిన సంఘటనలు అనేక వేల సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయని పార్టీ జాతీయ బోర్డు పేర్కొంది. ఈ సంస్థలు చట్టాల కోసం, ప్రభుత్వ చర్యల కోసం పోరాడటమే కాకుండా నీడలేనివారికి నీడకల్పించడం, అంబలి కేంద్రాలు నడపడం వంటి పనులు చేస్తున్నాయి. అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన నూతన కమిటీ ఈ సంఘటనల్లో చేరి పనిచేయ డమే కాకుండా ఇటువంటి దేశవ్యాపిత కృషిని మరింత విస్తరించి, పటిష్ట పరుస్తుందని స్కాట్‌ మార్షల్‌ చెప్పారు.''లక్షలాది మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మనం మన ప్రాంతాల్లోనూ, పని ప్రదేశాల్లోనూ గనుక చొరవ తీసుకుంటే కింది స్థాయిలో జోక్యం చేసుకోడానికీ, కార్యాచరణ పెంపొందించడానికీ ఎన్నో అవకాశాలు వస్తాయి, వాటిని సద్విని యోగం చేసుకోవాలి'' మార్షల్‌ స్థానిక పార్టీ సభ్యులనూ, పార్టీ క్లబ్బులనూ కోరారు. ''మనం అత్యవసర కార్యక్రమంగా దీన్ని చేపట్టాలి'' అన్నారు.

అమెరికాలో నేడు నిరుద్యోగ వ్యతిరేక పోరాటం ఒక విస్తృత ప్రజాందోళనా రూపం తీసుకుంటున్నదని ఈ పరిణామాలన్నీ తెలుపు తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దేశంలోని విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు చాలా చురుకుగా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. వాషింగ్టన్‌లో జరిగిన 'అమెరికా తక్షణ భవిష్యత్తు' సమావేశంలో అమెరికా విద్యార్ధి సంఘం (యుఎస్‌ఎస్‌ఎ) అధ్యక్షుడు గ్రెగ్‌ సెండెనా మాట్లాడుతూ నేటి కళాశాల విద్యార్ధులు రేపటి నిరుద్యోగులుగా మారకుండా ఉంటాలంటే 10,000 కోట్ల డాలర్ల ఉద్యోగ కల్పన బిల్లును పార్లమెంటు ఆమోదిం చాలని అన్నారు. పేద కుటుంబం నుండి వచ్చిన తాను స్కాలర్‌షిప్పు పొందుతూ, రెండు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేసరికి 40,000 డాలర్లు విద్యార్థి లోన్‌కింది అప్పు పడ్డాను. నాలాంటి అనేక లక్షల మంది విద్యార్ధులు నేడు అమెరికాలో ఉన్నారు. ఉద్యో గం లేకపోతే ఈ అప్పు ఎలా తీర్చేది, నాలాంటి వారి పరిస్థితి ఏమిటి అని ఆయన పేర్కొన్నాడు.

అంతే కాదు దివాళా తీసిన రాష్ట్ర ప్రభు త్వాలు, స్థానిక సంస్థలు విద్యార్ధుల స్కాలర్‌ షిప్పులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ కోతపెడు తుంటే, విద్యా బిల్లులు భారీగా పెరిగిపోతుంటే, నిరుద్యోగం ప్రబలి పోతుంటే అనేక నగరాల్లో లక్షలాది మంది విద్యార్ధులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో కాలిఫో ర్నియా రాష్ట్రం మొత్తం, ఇంకా దేశంలోని 30 నగరాల్లో పెద్ద ఎత్తున విద్యార్ధి ర్యాలీలు జరిగాయి. 1970 మే విద్యార్థి పోరాటం 40 వార్షికోత్సవం సందర్భంగా తాను మళ్లీ నేడు అమెరికా విద్యార్ధుల్లో అటువంటి కదలికలు చూస్తున్నానని పత్రికా రచయిత మార్క్‌ టి. హార్రిస్‌ ఇటీవల ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. మొత్తం మీద చూసినప్పుడు అమెరికన్‌ సమాజం నేడు కింది స్థాయిలో అశాంతితో రగిలిపోతున్నది. క్రమంగా ఇది నిరుద్యోగ వ్యతిరేక జాతీయ పోరాట రూపం ధరిస్తున్నది. స్థానిక ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాలని ఒకవైపు ప్రజా ఉద్యమం రూపుదిద్దు కుంటుంటే మరో వైపు దాదాపు అమెరికా రాష్ట్రాలు, స్థానిక సంస్థలన్నీ దివాళా తీసి పొదుపు చర్యల పేరుతో మరిన్ని కోతలకు పాల్పడుతున్నాయి. దాంతో నిరుద్యోగ సైన్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం స్థానిక ఉద్యోగాల కల్పన కోసం బిల్లు ఆమోదించాలన్న డిమాండ్‌ మరింత ఉధృత మవుతోంది. కాని పార్లమెంటులో రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, కొందరు డెమోక్రాట్లు అటువంటి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. ఈ ఘర్షణ రానున్న కాలంలో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

ఎస్‌. వెంకట్రావు

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్