నిద్ర లేవాలి పురుష ప్రపంచం!

ఆ మధ్య పత్రికలో ఓ వార్త చాలా తమాషాగా అనిపించింది. ఆ ఊళ్లో మహిళలు మాత్రమే ఉంటారట! వండుకునేది వాళ్లే, తినేదీ వాళ్లే! పని చేసేది వాళ్లే, ఫలితం పొందేదీ వాళ్లే! మగమహరాజుల ఆర్డర్లాంటి ఆదేశాలూ, అభ్యర్థనల్లాంటి ఉత్తర్వులూ అక్కడ వినిపించవు. పక్కా ఆడవాళ్ల రాజ్యం అన్నమాట. 12 ఏళ్లు నిండిన ప్రతి మగాడూ ఆ ఊరికి పరాయి కిందే లెక్క! ఈ వార్తను చాలామంది మహిళలు చదివి ఉండరు. ఎందుకంటే- ఇంటి మగరాయుళ్లు ముందు జాగ్రత్తగా దానిని సెన్సారు చేసి ఉంటారు. అలాంటి రాజ్యం ఇక్కడా ఏర్పడితే- తాము పప్పులుడికించుకోలేరు కాబట్టి- జాగ్రత్త పాటించి ఉంటారు. అయినా, ఎంత జాగ్రత్త వహించినా మగ దర్జాలకు మాత్రం గడ్డుకాలం తప్పేటట్టు లేదు. ఎవడి సేవ వాడే చేసుకోవాల్సిన ఒంటరి ఎడారి బతుకు దాపురించబోతోంది. ఆడపిల్లల సంఖ్య రానురాను దారుణంగా పడిపోవడమే దీనికి కారణం. దేశంలో తొలి జనాభా లెక్కలు తీసిన 1901లో స్త్రీ, పురుషుల నిష్పత్తి 972 : 1000 ఉంది. 2001 నాటికి 933 : 1000కి పడిపోయింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భరతావని మహిళలు లేని మగ ధరణిగా మిగిలిపోతుంది. వరకట్నాలు అటకెక్కి కన్యాశుల్కాలూ రంగంలోకి వస్తాయి. చేతులు కాల్చుకోవడం, బట్టలుతుక్కోవడం వన్‌సైడెడ్‌ యాక్టివిటీ అయిపోతుంది. మగాడిగా పుట్టే బదులు మానై పుడితే బాగుణ్ణు అని చింతించే రోజులొస్తాయి. తోడు లేని ఒంటరి బతుకు దుప్పటి లేని వింటరు రాత్రి అయిపోతుంది. ఇలాంటి దుస్థితి పగవాడైన మగాడికి కూడా వద్దేవద్దు!

ఈ ప్రమాదం తప్పటానికి కొన్ని దొడ్డ దారులున్నాయి. ఆకాశంలో సగం అంటున్న మహిళలు అవనినిండా ఉండాలంటే వారిని అన్ని రంగాల్లోకీ ఆహ్వానించాలి. అవునన్నా కాదన్నా అవుతున్నది అదే కాబట్టి- చట్టసభల్లోనూ సగం చోటివ్వాలి. వాళ్లకీ మగాళ్ల కష్టనష్టాలు అర్థమవుతాయి. సభలు కొత్త శోభతో రంజిల్లుతాయి. ఇంకా దేశంలో మహిళలు మరీ తక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లాంటి రాష్ట్రాల్లో నిత్య అశాంతికి కారణం ఏమిటో కనుక్కోవాలి. మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా ఉన్న కేరళ అంత అందంగా, ప్రశాంతంగా ఎందుకు వెలిగిపోతుందో పరిశోధించాలి. తెలివైన మగాళ్లు ఈ తేడాలకు కారణమేమిటో తేలిగ్గానే కనుక్కోగలరు కాబట్టి- మహిళాలోకానికి వెంటనే జేజేలు పలకాలి. భవిష్యత్తు కష్టాలు తప్పించుకోవటానికి ఈ తెలివైన నిర్ణయం తక్షణం తీసుకోవాలి. ఇది వందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పురుష ప్రపంచానికి చాలా తెలివైన అవసరం. లేవాలి మహిళా లోకం... దద్దరిల్లాలి పురుష ప్రపంచం!

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్