ఆహా...ఏమి భాగ్యము?

యాత్రలు ఎన్ని రకాలో! విజ్ఞానయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, పర్యాటక యాత్రలు, ప్రేమయాత్రలు...ఈ మధ్య బాగా పాపులర్‌ అయిన పాద యాత్రలు, ఓదార్పు యాత్రలు.. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ... అతి త్వరలో భాగ్యనగరి కార్పొరేటర్లు చేయనున్న యాత్ర మాత్రం ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ చేసుండరు. అది పూర్తిగా 'చెత్త' యాత్ర. అధికారిక చెత్త అధ్యయన యాత్ర. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చెత్త ఎత్తివేసే పనిని రాంకీ ఎన్విరో అనే ప్రయివేటు సంస్థకు అప్పగించాలన్నది బల్దియా ఆలోచన. అయితే ఈ మహానగరంలో పేరుకుపోయే మెగా చెత్తను బహు శుభ్రంగా ఎత్తివేయగలమన్న భరోసా బల్దియాకు కల్పించాల్సిన బాధ్యత రాంకీదే కదా. అందుకుగాను అది ఓ యాత్రకు ప్లాన్‌ చేసింది. రాజధానిలోని 150 మంది కార్పొరేటర్లను ఎంచక్కా విమానంలో ఢిల్లీ, ఆగ్రా తీసుకెళ్లి మరీ తాము చెత్తను ఎంత శుభ్రంగా ఏ పద్ధతుల్లో ఎత్తిపోస్తామో చూయిస్తామంది. రాంకీ నోట యాత్ర మాట రాగానే మన వాళ్లు గాలిలో తేలిపోతూ సిద్ధం సుమతీ అనేశారు. అయితే...ఇంతలోనే మహిళా కార్పొరేటర్లకో 'ధర్మ' సందేహం కలిగింది. అదేమంటే ...తమ పతిదేవులు లేకుండా అంత దూరం ఒంటిగా రావడమెలాగన్నారు. వారి పతిభక్తికి సంతసిస్తూ వారిష్ట ప్రకారమే కానిద్దామంది రాంకీ. మేమేం పాపం చేశాం? మా భార్యలెందుకు రాకూడదు? అంటూ పురుష కార్పొరేటర్లు ప్రశ్నించారు. అందరినీ తీసుకెళ్తే అయ్యే ఖర్చును లెక్కేసుకున్న రాంకీ తల పట్టుకొందట. చెత్త ఎత్తే పని రాంకీకి అప్పగిస్తే తమ ఉద్యోగాలు ఊడతాయని పారిశుధ్య కార్మికులు ఓ పక్క భోరుమంటుంటే...భాగ్యనగరి కార్పొరేటర్లు మాత్రం తమ జీవిత భాగస్వాములతో ఎప్పుడెప్పుడు యాత్రకు బయల్దేర్దామా అని ఎదురు చూస్తున్నారు. అంత దూరాన కూడా పతులకు 'సేవ' చేసుకుని తరించే 'భాగ్యం' కలిగినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అంతేగానీ... రాంకీ సంస్థ యాత్రల ఎరతో భాగ్యనగర వాసుల డబ్బును ఊడ్చే... వీధులు శుభ్రంచేసే కార్మికులను వీధులకీడ్చే ప్లాన్‌లో వుందన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు. ఎంత మంద'భ్యాగ్య'ము!

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్