పెట్రేగుతున్న ఇసుక మాఫియా

  • అడ్డుకుంటే దాడులు
  • ప్రజా ప్రతినిధులకు తప్పని బెదిరింపులు
  • అడుగంటుతున్న భూగర్భ జలాలు

అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర ప్రమాదమని తెలిసినా.. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇసుకను తవ్వితే పర్యావరణాకి ముప్పువాటిల్లుతుందని నిపుణులు సైతం గొంతు చించుకొని మొత్తుకుంటున్నారు. ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఇసుక మాఫియా అడ్డగోలు తవ్వకాలతో కొన్నేళ్లుగా కృష్ణ, తుంగభద్ర నదుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో గతంలో 100 ఫీట్ల లోపు బోర్లు పడేవి. నేడు 300 ఫీట్ల అడుగులకు పైగా బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. కొన్నేళ్లుగా సమృద్ధిగా వర్షాలు లేక భూగర్భ నీటి మట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా.. భూమిలోకి నీరు ఇంకడం లేదు. నీరు ఇంకడంలో ప్రధాన భూమిక పోషించే ఇసుక లభ్యత తగ్గి పోవడమే దీనికి కారణమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మితిమీరుతున్న మాఫియా ఆగడాలు

ఈ మధ్య కాలంలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలను అడ్డుకునే అధికారులను అంతం చేసే స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వ పరంగా వీటికి అడ్డుకట్ట వేయడానకి ఆశించిన స్థాయిలో చర్యలు లేవు. గద్వాల ఆర్డీఓ సి నారాయణరెడ్డి ఈ మధ్య కాలంలో దాదాపు 50 లారీల వరకు పట్టుకొని జరిమానాలు విధించారు. కానీ ఇసుక మాఫియా తమ పలుకుబడిని ఉపయోగించి ఆర్డీఓపై ఒత్తిడి తెచ్చింది. ఆర్డీఓ వెంట ఉన్న సిబ్బందిపై లారీలను ఎక్కించ బోయారు. రెండు రోజుల కిందట మక్తల్‌ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నించిన పాపానికి అడ్డువస్తే అంతం చేస్తామని బెదిరించారు. దీంతో ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకోవాంలటేనే అధికారులు హడలిపోతున్నారు.

నకిలీ పర్మిట్లతో యథేచ్ఛగా రవాణా

ఇసుక అక్రమ తవ్వకాల రవాణాను అడ్డుకోవడానకి జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు, గనులశాఖ అధికారులతో నిఘా విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని ఏడాది కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాగితాలకే పరిమితం కావడంతో ఇసుక మాఫియా ఇష్టానుసారంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నకిలీ పర్మిట్లతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు పర్యావరణానకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

నాలుగు ప్రాంతాల్లో అనుమతులు

నదులు, వాటి పరివాహక ప్రాంతాల్లోని వంకలు, వాగుల్లోని ఇసుక ద్వారానే భూమిలోనికి నీరు ఎక్కువగా ఇంకుతోంది. ఈ అంశాన్ని నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకొని స్థానిక అవసరాలకు అడ్డుగోలుగా ఇసుక తవ్వకుండా, ఇసుక లభ్యత భాగా ఉన్నచోట ఒక మీటరు లోతు మాత్రమే తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్డగోలు ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేడయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు తవ్వాలని నిబంధలు విధించింది. ఈ నిబంధనలు వల్ల కాటిలో కలిసిపోయాయి.

చర్యలకు వెనకాడుతున్న అధికారలు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారంతా బలమైన రాజకీయ వర్గాలకు చెందిన వారు, నేర చరిత్ర ఉన్నవారే. అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కృష్ణ, తుంగభద్ర నదులు వట్టిపోయి దుర్భిక్ష ప్రాంతాలుగా మారే ప్రమాదముంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్