గతంలో ఇచ్చిన హామీలే పరిష్కారానికి నోచుకోలేదని, ఈ సరైనా సమస్యలు పరిష్కారమవుతాయా సిఎం గారూ..! అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు ఆరు సార్లు వచ్చిన సందర్భంగా జిల్లాకు వాగ్దానాల వర్షం కురిపించారు. జిల్లాను పాడిపంటలతో సస్యశ్యామలం చేయడానికి రూ.7000 కోట్లతో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. దీంతో ప్రజలు ఈ ముఖ్యమంత్రి రాకతో జిల్లా రైతుల సమస్యలు తీరుతాయని, వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని బావించారు. బీళ్లుగా మారిన తమ పోలాలు పచ్చగా మారుతాయనుకున్నారు. కానీ వారి కలలు కల్లలుగా మిగిలిపోయాయే తప్పా ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరిచ్చిన దాఖలాలు లేవు. షాద్‌నగర్‌లో మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇస్తామని, మెట్రోవాటర్ సరఫరా, స్టేడియం నిర్మాణం చేస్తామని హామీనిచ్చారు కానీ అమలుకు నోచుకోలేదు. మహబూబ్‌నగర్‌కు బైపాస్ రోడ్డు, భూత్పూర్ రోడ్డును నాలుగులైన్లుగా విస్తరిస్తామన్నారు. కానీ ఇంత వరకూ చేతల్లో చూపిన దాఖలాలు లేవు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పింఛన్లు, ఇందిరమ్మ బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తామన్నారు. ఇంతవరకూ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు.