విద్యుత్ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు జిఓ 11 ను తక్షణం అమలు చేయాలని, కరువు బత్యంతో కూడిన వేతనాలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. నాగరాజు డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు డివిజన్, డివిజనల్ ఇంజనీరు కార్యాలయం ఎదుట మంగళవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి. నాగరాజు మాట్లాడారు. గత డిసెంబర్ 21న నాలుగు డిస్కమ్‌ల ఉన్నతాధికారులు లేబర్ కమిష నర్ (హైదరాబాద్) సమక్షంలో రాష్ట్ర ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్న ట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్న బేసిక్, డిఎతో కూడిన వేతనాలు, ఇతర సర్వీస్ కండిషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీలు అమలు చేయనందుకు నిరసనగా విద్యుత్ రంగంలోని అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కొత్త జిఓ 11ను తక్షణమే విద్యుత్ రంగంలో అమలు చేసినట్లైతే హైస్కిల్డ్, స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనాలు రూ. 1079, 8079, 5579, డిఎ 11. 85 శాతం, 9.50, 6.50 శాతం ఇవ్వాలి. దీనికి కరువు బత్యం పెరిగిన ప్రతి పాయింటుకు అనుగుణంగా రూ. 11.85, రూ. 9.50, రూ 6.55 చెల్లించాలి. ఈ విధంగా డిసెంబర్ 21, 2010 నుంచి అరియర్స్ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులన్నింటిని ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతోనే భర్తీ చేయాలని, కర్నూలు డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు చెల్లించాలని, నవంబర్ 2005 నుంచి విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ప్రతి కాంట్రాక్టు కార్మికునికి ఇపిఎఫ్, ఇయస్‌ఐ, ఇన్యూరెన్స్ అమలు చేయడం జరిగిందని, వారి అకౌంట్లలో సంబంధిత డబ్బులు జమ చేయాలన్నారు. దాదాపు 12 కోట్లురూపాయలు దిగమింగారని, అందుకు బాధ్యులైన అధికారులను, కాంట్రాక్టర్లను అరెస్టు చేసి ఆ డబ్బును కార్మికుల అకౌంట్‌లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కర్నూలు డివిజన్ కార్యదర్శి కె. మల్లిఖార్జున మాట్లాడారు. ఇపిఎఫ్, ఇయస్‌ఐ, ఇన్సూరెన్స్ కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయనందున కొంతమంది కార్మికులు విధి నిర్వహణలో మరణించినా వారి కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించ లేదని తెలిపారు. రిలే నిరాహారదీక్షల్లో యస్, శేషన్న, బుచ్చన్న, రాజు, గోపాలకృష్ణారావు, ఖుద్రత్ బాషాలు కూర్చు న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం, అన్వర్ బాష, శ్రీనివా సులు సునీల్, హబీబ్ బాష, జాఫర్, రుద్ర, లింగమయ్య, శ్రీనివాసులు, గోపినాధ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.