వాహనదారులపై భారం

  • ఒక్కో వాహనానికి రూ.1000.. జిల్లాపై రూ.మూడు కోట్లు
  • హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ల వ్యవహారం

ప్రజాశక్తి - మచిలీపట్నం

అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ ప్లేట్‌ల బిగింపు అనివార్యం అవుతుంది. మే నెలాఖరు కల్లా ఈ పక్రియను పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖాధికారులు సన్నాహాలు ప్రారంభించనున్నారు. ఈ విధానంతో వాహనదారులకు భారంతో పాటు ప్రయోజనం చేకూరనుంది. ప్లేట్‌లు మార్పిడి వ్యవహారం అరాచకాలకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట పడనుంది. ఒకసారి బిగించిన ప్లేట్‌లు మార్చటానికి కుదరదు. ఇటీవల విజయవాడలో నాగవైష్టవి కిడ్నాప్‌, హత్య కేసులో నిందితులు తమ వాహనాల ప్లేట్లను మార్చి కిడ్నాప్‌ చేసి దారుణ దురాగతానికి ఒడి గట్టారు. జిల్లాలో హత్య కేసులు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అక్రమ రవాణాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మాంద్యం దెబ్బకు విలవిలలాడుతున్న సామాన్యునికి సుప్రీంకోర్టు నిర్ణయం భారంగా మారనుంది. ఒక్కో వాహనానికి రూ.1000 చెల్లించటం మధ్యతరగతి వాహనదారులకు ఇబ్బందులు తప్పవు.

జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు మూడు లక్షల వరకు ఉన్నాయి. ప్రతి దానికి హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్‌ బిగించుకొనేందుకు రూ.1000 వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన మూడు కోట్ల రూపాయలు వరకు జిల్లాలోని వాహనదారులపై భారం పడే అవకాశం ఉంది. బందరు రవాణా శాఖ కార్యాలయం పరిధిలో 60 వేల వాహనాలకు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటికి రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లేట్‌లను ఆర్‌టిఓ కార్యాలయల్లోనే వాహనాలకు బిగిస్తారు. ఈ ప్లేట్‌లను ఒకసారి బిగించిన తర్వాత సరిచేయడానికి ఊడదీయటానికి గాని అవకాశం ఉండదు. ఈ హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లపై చక్రం గుర్తుతో క్రోమియం ఆధారంగా తయారైన హోలోగ్రామ్‌, ఇండియా అనే నల్లని అక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. లేజర్‌ పరిజ్ఞానంతో ముద్రితమైన ఏకీకృత వరుస సంఖ్య, తొలగించలేని, తిరిగి ఉపయోగించలేని అమరిక ఉంటాయి. ప్లేట్‌లపై బార్‌ కోడ్‌, హోలోగ్రామ్‌ ఉంటుంది. బార్‌ కోడ్‌లో వాహనం నెంబరు, యజమాని ఫొటోతో పాటు వాహన వివరాలను నిక్షిప్తంగా చేస్తారు. పత్రాలను తనిఖీ చేయకుండానే వాహనానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు వాహన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఉపగ్రహం ద్వారా ఆ వాహన వివరాలను పసిగట్టే వెసులుబాటు ఇక నుండి అందుబాటులోనికి రానుంది. దీనివల్ల చోరీ అయిన వాహనాలను ఇట్టే గుర్తించొచ్చు. దేశంలోని అన్ని వాహనాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ప్రయోజనం ఎలా ఉన్న ఖరీదైన నెంబరు ప్లేట్‌లు బిగింపు వల్ల సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది.


సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్