పంపింగ్‌ స్కీములకు మరమ్మతు చేపట్టాలి

  • అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి

పంపింగ్‌ స్కీముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉస్తేపల్లి, గుడిమెట్ల పంపింగ్‌ స్కీములను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. దీనిపై రైతుల నుండి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మండలంలో 16పంపింగ్‌ స్కీములు ఉన్నాయని, వాటి నిర్వహణ రైతుసంఘం నాయకులు కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని, అంతేకాకుండా ఇసుక తవ్వకాల వల్ల నీరు పంపింగ్‌స్కీములకు దూరంగా ప్రవహిస్తుందని, దీన్ని అధిగమించాలంటే ప్రతి పంపింగ్‌ స్కీం కింద సబ్‌మెర్సిబుల్‌ మోటార్లు ఏర్పాటుచేసి తద్వారా నీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరావు మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న పంపింగ్‌ స్కీములన్నింటికీ 24గంటలూ విద్యుత్‌ సరఫరా అందించాలని, విద్యుత్‌ సమస్య అధిగమించాలంటే పులిచింతల వద్ద పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ఈ స్కీములకు నిరంతరాయంగా విద్యుత్‌ అందించవచ్చని సూచించారు. జిల్లాలోని స్కీముల మరమ్మతులకు ప్రభుత్వం తక్షణమే రూ.100కోట్ల నిధులు విడుదల చేయాలని, తద్వారా రైతాంగాన్ని అదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం నాయకులతో పెద్దఎత్తున జిల్లా కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు సంఘం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, సిపిఎం నాయకులు యార్లగడ్డ జోయ, డివిజన్‌ కార్యదర్శి చనుమోలు సైదులు, తుమ్మల నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, సిఐటియు నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.