మీ సేవ కేంద్రాల ఏర్పాట్లు పూర్తిచేయాలి

  • చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మినీ మాథ్యూస్‌

జిల్లాలోని మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలందించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేయాలని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మినీ మాథ్యూస్‌ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌ నుండి కలెక్టర్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ సదస్సులు, విఆర్‌ఓ, విఆర్‌ఎలుగా ఎంపికైన అభ్యర్థుల నియామకాలు, కొత్త డివిజన్ల ఏర్పాట్లు, పెండింగ్‌ ఆడిట్‌ పేరాలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన సేవలు సత్వరమే అందించడానికి వీలుగా సంబంధిత అంశాల డేటాను అప్‌లోడ్‌ చేయాలని కోరారు. అవసరమైన డేటా వివరాలను జిల్లాల వారీగా కమిషనర్‌ సమీక్షించారు. 2012 జనవరి 18 నుండి మార్చి 17 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి అందిన పిటీషన్లను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేయాలని, వాటిని నూరు శాతం పరిష్కరించాలని కోరారు. విఆర్‌ఓ, విఆర్‌ఎ పోస్టులకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చి ఏప్రిల్‌లో నిర్వహించనున్న శిక్షణకు హాజరయ్యేలా వారిని సిద్ధం చేయాలన్నారు.

కృష్ణాజిల్లాలో మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలందించడానికి అవసరమైన డేటాను అప్‌లోడ్‌ చేశామని, ఏప్రిల్‌లో మీ సేవ కేంద్రాల ప్రారంభోత్సవానికి సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ రిజ్వీ చీఫ్‌ కమిషనర్‌కు వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఓ ఎస్‌.ఎస్‌.ఎ.రాజు, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు ఆర్‌డిఓలు ఎస్‌.వెంకట్రావు, ఐ.వెంకటేశ్వరరెడ్డి, రంజిత్‌బాషా, పి.సుబ్బారావు, డిఐఓ వాసుదేవరావు, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ దివ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.