సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం : ఐద్వా

పాశ్చత్య ధోరణిని విడనాడి మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుందామని ఐద్వా జిల్లా కార్యదర్శి పిన్నమనేని విజయ పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గులు, ఆటల పోటీలు సోమవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా జరిగిన సభలో విజయ మాట్లాడారు. తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు తెచ్చేందుకు ముగ్గుల పోటీలను నిర్వహించడం పట్ల ఆమె అభినందించారు. పండుగ సందర్భంగా యువత పెడితోవ పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అందవల్ల ఇలాంటి సందర్భాల్లో వీరిని సన్మార్గం వైపు నడిపించటానికి ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కృషిచేస్తున్నాయని వివరించారు. యువతీ, యువకులు, మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే విధంగా విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జూదాలు, కోడి పందాలు వాటిని ప్రజలకు దూరంగా ఉంచేందుకు ఈ ఆటల పోటీలు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల్లో మట్టిలో మాణిక్యాలు ఉన్నారన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో క్రీడలు నిర్వహించి వారిలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరలను పెంచి సామాన్యులకు పండుగలకు దూరం చేసిందని విమర్శించారు. మద్యాన్ని ఏరులై పారిస్తోందని విమర్శించారు. దీంతో సామాన్యుల కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయన్నారు. సారా, బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. మహిళలందరూ సమైక్యంగా పోరాడి గ్రామాల్లోని బెల్టు షాపులను అరికట్టేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తన ఖజానా నింపుకునేందుకు మద్యం షాపులకు విచ్చలవిడిగా లైసెన్సులు మంజూరు చేసి సామాన్యుడి జీవితాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సొమ్మును తిరిగి మద్యం రూపంలో లాక్కుంటుందన్నారు. ఇటీవల మైలవరం మండలంలోని పోరాటనగర్‌, కనిమెర్ల, రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు తండాలలో కాపు సారాకు 19 మంది బలయ్యారని దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ప్రభుత్వం ఈ కాపు సారా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావన్నారు. అనంతరం ఆమె ముగ్గుల పోటీలు, స్లో సైకిల్‌, లెమన్‌ స్పూన్‌, టెన్నికాయిట్‌, కబడ్డి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ప్రజానాట్య మండలి కళాకారులు ఈశ్వరచారి అభ్యుదయ గీతాలను ఆలపించారు. సభకు డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి చాట్ల సుధాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మైలవరం డివిజన్‌ నాయకురాలు ఎ.ఉమాదేవి, పి.విజయలక్ష్మి, డివైఎఫ్‌ఐ మాజీ నాయకులు వజ్రాల వెంకటరెడ్డి, అల్లాభక్షు, మహ్మద్‌ జానీ, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి వెంకట్రావు, పంబి వెంకటేశ్వరరావు, రాణి, కె.శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.