సీతారాముల కళ్యాణానికి

  • ముస్తాబవుతున్న భద్రాద్రి
  • ఏర్పాట్లలో అధికారుల నిమగం

ఈ నెల 24న జరగనున్న శ్రీ సీతారామ కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబవుతోంది. రంగు రంగు విద్యుత్‌ కాంతులతో పట్టణమంతా శోభయమానంగా వెలిగిపోతోంది. ఇంకా మూడు రోజులే గడువు ఉన్నందునా అధికారులు వారి వారి పనుల్లో నిమగమయ్యారు. కళ్యాణానికి వేదికైన మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. మిథిలా స్టేడియంలో 20 సెక్టార్లతో 22 వేల మంది, స్టేడియం పై భాగం నుండి 15 వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు పూర్తి కావచ్చాయి. పందిళ్లలో చాందినీ వస్త్రాలతో అందంగా అలంకరిస్తున్నారు. మిథిలా స్టేడియం నుండి 37 వేల మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఆర్‌అండ్‌బి అధికారులు స్టేడియాన్ని సమానం చేయించారు. స్టేడియాన్ని 20 సెక్టార్లుగా విభజించి బారికేడింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. రామాలయం చుట్టూ రంగురంగుల విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసి దేదీప్యమానంగా వెలిగేలా చూస్తున్నారు. పట్టణంలో పలు కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆంజనేయపార్కు, మున్సిపాల్టీ, స్టేడియం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా భక్తుల కోసం తాత్కాలిక వసతులు, మరుగుదొడ్లు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ బందోబస్తు

కళ్యాణానికి ముఖ్యమంత్రి రోశయ్య రానుండటంతో భారీ బందో బస్తు చేపట్టేందుకు పోలీస్‌ అధికారులు ఏర్పాట్లలో నిమగమయ్యారు. సిఎం పర్యటనకు 2500 మంది పోలీసు సిబ్బందిని వినియోగించుకోవడంతో పాటు పట్టణాన్ని పోలీసుశాఖ ఆధీనంలోకి తీసుకొంది. వరంగల్‌ రేంజ్‌ ఐసి నేతృత్వంలోని డిఐజి జితేంద్ర, ఎస్‌పి అనిల్‌కుమార్‌, ఓఎస్‌డి క్రాంతిరాణా టాటా, భద్రాచలం ఏఎస్‌పి రఘురాంరెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్‌పిలూ, ఏడుగురు డిఎస్‌పిలూ, 29 మంది సిఐలూ, 124 మంది ఎస్‌ఐలు, 213 మంది ఎఎస్‌ఐలూ, 1500 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, వంద మంది మహిళా కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులూ, 22 స్పెషల్‌ పార్టీ బృందాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

భక్తులకు అసౌకర్యం కలిగించవద్దు : పిఓ

సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను పిఓ ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి నవమి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. కళ్యాణమండపంలోని సెక్టార్లలో ఉండే భక్తులు ప్రశాంతంగా కూర్చొని కళ్యాణాన్ని తిలకించేందుకు క్రమ పద్ధతిలో బారికేడింగ్‌ అలంకరణలు చేయించినట్లు తెలిపారు. సెక్టార్లలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణమండపం, సులబ్‌కాంప్లెక్స్‌, చలువపందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల బ్లాకులు, గృహనిర్మాణ శాఖ అతిథిగృహం, హెలిప్యాడ్‌లలో చేస్తున్న ఏర్పాట్లను పిఓ పరిశీలించారు. 21 సాయంత్రంలోపు పనులు పూర్తి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ వి.నాగన్న, దేవస్థానం ఇఓ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బి, గృహనిర్మాణ, ఆర్‌డబ్ల్యుఎస్‌, రెవెన్యూ, ఫైర్‌ సర్వీస్‌, విద్యుత్‌, పోలీసు శాఖాధికారులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్