వలస గిరిజనులకు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు

  • మానసిక అనాథ పిల్లలకు బాలికా సంరక్షణ పథకం
  • ఐసిడిఎస్‌ పిడి రమాదేవి

ఛత్తీస్‌ఘర్‌ నుండి వలస వచ్చిన గిరిజన కూలీల పిల్లల కోసం భద్రాచలం డివిజన్‌లో 132 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐసిడిఎస్‌ పిడి పి.రమాదేవి తెలిపారు. స్థానిక ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 3,344 అంగన్‌వాడీ కేంద్రాలు, 639 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. 2004-05లో బాలికల సంరక్షణ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్‌ఐసి బాండ్‌లు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా 2008 మే నాటికి 18 సంవత్సరాలు నిండిన శారీరక, మానసిక, అనాథ పిల్లలు, హెచ్‌ఐవి వ్యాధి భారిన పడిన కుటుంబ పిల్లలకూ, 80 శాతం వికలాంగుల బాలికలకు బాలకలా సంరక్షణా పథకం వర్తిస్తుందన్నారు. ఈ ఎంపిక కోసం మండలంలోని తహశీల్దార్‌, ఎంపిడిఓ, సిడిపిఓ, మెడికల్‌ ఆఫీసర్లతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు. 584 నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు 2006లో ప్రతిపాదనలు పంపామన్నారు. నాబార్డ్‌ నిధుల నుండి 79 అంగన్‌ నూతన భవన నిర్మాణం కుగాను 2.85 లక్షలు, బిఆర్‌జిఎఫ్‌ నుండి మరో 65 వేల రూపాయలతో నూతన భవన నిర్మాణాలను త్వరలో చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న 12 సెంటర్లకు గ్రామాఖ్య సంఘాలతో ఒక కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఇలా కమిటీని నియమించడం వల్ల పిల్లలకు అందించే పోషకాహారం పక్కదారి పట్టకుండా నివారించవచ్చన్నారు. వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలోని చర్ల, వాజేడు మండలాల్లో వారం రోజుల్లో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిడిపిఓ జయమ్మ, సూపర్‌వైజర్‌ సుజాత పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్