''నువ్వు తెచ్చిన పేషెంటుకు చిన్నస్టోన్ ఉంది.అది పేల్చనక్కర్లేదు. మందులతో పోతుంది. ఆడాక్టర్ వారిని నిలువునా దోచాడు. నాకు వందరూపాయలు ఇవ్వడానికి ఇష్టపడరు. డాక్టర్ మీద పోస్తారు. ఇలా అన్నానని డాక్టర్‌కు చెప్పకు. నువ్వు డాక్టర్ కావాలని సీటుకొందామని వెళ్లావట.
కిరణ్‌కు టెన్తులో స్కూలుకే ఫస్టువచ్చింది. అప్పుడు పత్రికా విలేకర్లు వచ్చి ఫోటో తీసుకుని నీవు ఏం చదవాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు. దానికి కిరణ్ ''నేను డాక్టర్ కావాలి. నా చుట్టూ ఉన్న సమాజంలో వైద్య చికిత్సకు అవకాశం లేనివారికి నేను నావైద్యంతో రక్షిస్తాను'' అని చెప్పాడు. ''అంటే ఉచితంగా సేవలు అందిస్తావన్నమాట'' అని విలేకరి అడిగితే పక్కనే ఉన్న తల్లి మురిసిపోయి కొడుకును గట్టిగా హత్తుకుని ''తప్పకుండా చేయరా తండ్రీ'' అని దీవించింది. ఇదంతా మరుసటి రోజు పత్రికలో వచ్చింది.
ఆపేపర్‌ను పటం కట్టించి గదిలో గోడకు వేలాడదీసింది తల్లి. తండ్రి కూడా కొడుకుని డాక్టర్‌గా చూడాలనే ఆశలో ఉన్నాడు. ఆదిశలో కొడుకుని కార్పోరేట్ కాలేజిలో చేర్పించారు. అక్కడ ర్యాంకుల్లో కిరణ్ ఉన్నాడు. అయితే కాలేజిలో ప్రథముడుగా నిలవలేదు. మూడోవాడిగా నిలిచాడు. ఆవెంటనే ఎమ్‌సెట్‌కు వెళ్లడం ఐదువేలు ర్యాంకు ఆపైన ఓసి కనుక తాను నిత్యం కలకం టున్న ఎమ్‌బిబిఎస్ సీటు సాధించడానికి తలప్రాణం తోకకు వచ్చే దిశలోకి నెట్టివేయబడ్డాడు.
తల్లీ, తండ్రి ఇద్దరూ సర్కార్ దుంపలబడుల్లో టీచర్లు. ఉన్న ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకుని ఉన్నత స్థాయిలో నిలపాలనే ఆశలో ఉన్నారు.
ఇప్పుడు మెడిసిన్ సీటు యాజమాన్యకోటాలో కొంటే 30 లక్షలు పలుకుతోంది. ఆసీటుకై తల్లి ప్రయత్నాలలో పడింది. తను ఇన్నేళ్లుగా దాచుకున్నదంతా ఆసీటు కోసం వెచ్చిం చాలని కావాలంటే వడ్డీలకు తెచ్చేసి కొడుకు కోరిక తీర్చాలి అని తల్లి తపన.
తండ్రి కూడా అంత ధర పెట్టి చదివించడానికి ముందు తటపటాయించినా తప్పదని తన కొడుకైనా ఒక మంచి డాక్టర్ కావాలనే ఆశతో ఆదిశలో అడుగులు వేసాడు. బంధువులు కూడ ఆ దంపతులకు ఎంకరేజ్ చేసారు.
కిరణ్ తల్లి, తండ్రీ పడుతున్న తపన చూసాక ఎందుకో ఇంత డబ్బుపెట్టి తాను చదవడం అంత అవసరమా అని పించింది. తనను మెడికల్ కాలేజికి తీసుకునిపోయి అక్కడ యాజమాన్యం ముందు నిలిపి ''మెడిసిన్ సీటుకు మీరు కోరిన ధర చెల్లిస్తాం. ఒకేసారి చెల్లించలేము. మాకు కొన్ని వాయిదాలు ఇప్పించండి'' అని కోరారు. దానికి యాజమాన్యంవారు గాదిగా చూసి ''వాయిదాలా? ఎందుకు ఇవ్వాలి? ఇదేమైనా మెడిసిన్ సీటు అనుకున్నారా లేక సాదాసీదా డిగ్రీ సీటు అనుకున్నారా మూడేళ్లపాటు వాయిదాలు ఇవ్వడానికి. మొత్తం ఒకేసారి కట్టితీరాలి. అయితే నెలరోజుల్లో మొత్తం జమకావాలి'' అని ముఖంమీద గుద్దినట్టు చెప్పారు. అమ్మ వారి కాళ్లావేళ్లా పడిన దృశ్యం కిరణ్‌కు కళ్లముందే కన్పిస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి.
మధ్యలో వేరెవరో వచ్చి ఏమీకానట్టు ఒక సీటు కొనేసి వెళ్లిపోయారు.అతడికి యాజమాన్యం గొప్ప గౌరవం ఇచ్చారు. అతడెవరా అని ఆరాతీస్తే మంత్రిగారి పిఏ అని తెలిసింది. అతడు వాయిదాలు కోరనూలేదు. యాజమాన్యం ఇవ్వనూలేదు. కిరణ్ తన తల్లితండ్రితో ఆగదిలో గోడకు చేరగిలబడి అలా ఉన్నాడు. యాజమాన్యం సాయంత్రంవరకు ఉంచేసి వాయిదాలు కుదరవు గాక కుదరవు అని చెప్పి పొమ్మన్నారు. ఉస్సురంటూ వెనుదిరిగారు. ముగ్గురికి నిలువెత్తు నీరసం ఆవహించింది.
కిరణ్‌కు అర్ధరాత్రి మెలకువ వచ్చింది. తాను ర్యాంకు సాధించి ఉంటే ఈ తిప్పలు అమ్మకు నాన్నకు ఉండేవికావు. వారి ఇరవై ఏళ్ల రెక్కలకష్టానికి రెక్కలు వచ్చేవికావు అనిపించింది. కళ్లలో నీళ్లుతిరిగాయి. లేచి తల్లి పక్కనే పడుకుని అమ్మ నుదుటిపై ముద్దు పెట్టాడు. అమ్మకు తెలివిరాలేదు. మత్తుగా నిద్రపోతోంది. మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయింది. అందుకే ఒళ్లు తెలియని నిద్రలో ఉంది.
''అమ్మా 30లక్షలతో చదవి నేను సాధించేదేమిటి?'' ఆమెకు వినపడకుండా ప్రశ్నించాడు. ఆమె త్రుళ్లిపడి లేచింది. వెంటనే బదులిచ్చింది.
''నిద్రపోలేదా?ఎందుకురా ఆలోచనలతో బుర్ర పాడుచేసు కుంటావు?30కాదురా కోటిరూపాయలైనా నిన్ను చదివిస్తాను. నీ సీటు తెచ్చి నీ చేతిలో పెట్టడం తల్లిగా నా బాధ్యత. మరేం ఆలోచించకుండా నిద్రపో!'' తల నిమిరి నిద్రపుచ్చింది.
ఆశ్చర్యపోయాడు.అమ్మ నిద్రపోలేదా?నాలాగునే మెడిసిన్ సీటుకోసం ఆలోచిస్తోందా? తను ఆమెపక్కన పడుకున్నప్పుడు కళ్లు మూసేసిందా? అయ్యో అమ్మా నాకోసం, నాచదువు కోసం ఎంత తపన పడుతున్నావు అని విలవిలలాడాడు. తల్లి తల నిమురుతుంటే ఎంత కాదనుకున్నా బడలిక మానసికంగా అలసినందున కళ్లు బరువెక్కిపోయి అలా నిద్రలోకి జారు కున్నాడు.
మరుసటిరోజు మళ్లీ మెడికల్‌సీటుకై వేట. ఎవరిద్వారా చెప్పించుకునేనా సాధించాలి. నాలుగు వాయిదాలలో చెల్లింపుకై చెప్పిద్దామనే తపనలో ఉన్నారు. వారంరోజులు స్కూలుకు భార్యభర్తలు సెలవు పెట్టి కొడుకు మెడికల్‌సీటుకై నానా ప్రయత్నాలు చేసారు.ఏరోజుకారోజు ఆశ. ఆవెంటనే ఆశ కాస్తా వమ్ముకావడం జరిగిపోతోంది. వారం గడిచిపోయింది. ఎవరి మాట ఆమెడికల్ కాలేజి యాజమాన్యం విననంటోంది. రెండే రెండు వాయిదాలు అదీ ఒకనెలలో పూర్తిగా చెల్లించేయమంటోంది. ఆమాటమీద నిలబడి పోయారు.వారి మాట, వారి రూల్ శిలాశాసనంగా ఉంది.
లోకల్ ఎమ్‌ఎల్‌ఏని వాడాలనుకుంటే ఆమెడికల్ కాలేజి యాజమాన్యంతో నాకు సరిపడదు అని చెప్పి తప్పుకున్నాడు. ఒక జర్నలిస్టు ద్వారా సీట్లు సమకూర్చే దళారి వద్దకు పరుగెత్తారు. ఒకలక్ష ఇస్తే సీటు వాయిదాల చెల్లింపులతో ఇప్పిస్తామన్నారు. అందుకు సిద్ధపడ్డారు.కానీ అదీ వర్కవుట్ కాలేదు.అయితే ఆదళారి నెల్లిమర్లనుంచి కరీంనగర్‌కు మార్చేసి అక్కడ ఇప్పిస్తానని తీసుకుని పోయి అక్కడ ఇప్పించలేక చేతులు ఎత్తేసాడు. ఆప్రయివేట్ కాలేజి చెప్పడం 30లక్షలు.అడ్వాన్సు తర్వాత వాయిదాలు పదివరకు ఇస్తారు కానీ, వాయిదాల్లో ఎక్కడా 30లక్షలు మెన్షన్ చేయరు.అలా ఇస్తే మాకు ప్రాబ్లెమ్ అని చెబుతున్నారు.ఇదేదో తేడాగా ఉందని వదిలేసారు.
కొడుకు మెడికల్‌సీటు కొండెక్కి కూర్చుంది. కొడుకు కోరిక తీరాలి అంటే ఇలా కుదరదు.ఒకేడాది లాంగ్ టెర్మ్ కోర్సు నేర్పించాల్సిందే. ఇంతకు మించి మార్గంలేదు.ఆ దిశలోకి మళ్లారు.
కిరణ్‌కు మెడికల్ సీటుకోసం తన కుటుంబం పడిన పాట్లు గుర్తుకు వచ్చినప్పుడు మనస్సు కకావికలమైపోతుండేది. ఒకరోజు ఉదయం వరండాలో కూర్చుని పేపర్ చదువుతుంటే చలమయ్య పాలుపోస్తూనే కడుపు పట్టుకుని విలవిలలాడాడు.
''ఏమయ్యింది అలా బాధపడ్తున్నావు'' అడిగాడు కిరణ్.
''ఏమిటోబాబు అప్పుడప్పుడు భరించరాని నొప్పి పొత్తి కడుపులో వస్తోంది.''
''డాక్టరుకు చూపించలేకపోయావా?''
''వాళ్లు నన్ను తినేస్తారు.ఆళ్లతో పడలేం. ధన్వంతరికి చూపితే నాలుగుపొట్లాలు భస్మం ఇచ్చాడు. అవి వేసుకుంటే నిమ్మళిస్తోంది. ఇప్పుడా ధన్వంతరి కూతురు కోసం కలకత్తా వెళ్లాడు. ఎప్పుడొస్తాడో''
''ఒకగంట తర్వాత నువ్వు ఇక్కడికి రా! ఇద్దరం కలిసి డాక్టర్ వద్దకు వెడదాం. నీకు కిడ్నీ ట్రబుల్ ఉంది. ఇలా భస్మాలతో లేపనాలతో జరిగేది కాదు. ప్రాణానికే ముప్పు'' చెప్పి పంపేసాడు.
ఒక గంట తర్వాత రిక్షాలో వచ్చాడు చలమయ్య.
''నొప్పి అలానే ఉంది. డాక్టరుకు చూపీ అయ్యా! ఇంత చిన్నోడివి నీలో దయ ఉంది. నాలాంటోడి బాధ తెలుసుకున్నావు'' అని రిక్షాలో చోటు ఇచ్చాడు. ఇద్దరు కలసి డాక్టర్ వద్దకు వెళ్లారు.
చిన్నపాటి చెకప్ అయ్యాక ''నీకు కిడ్నీ ట్రబులుంది. అది ఏదశలో ఉందో తెలియాలి. ఈటెస్టులు చేయించు అక్కడ డబ్బు చెల్లించు'' అని ప్యాడ్‌పై కొంకిరిబింకిరిగా రాసేసి మరోరోగివైపు తిరిగిపోయాడు డాక్టర్. స్కానింగ్‌లు ఇతర టెస్టులు అన్నింటికి 1400 రూపాయలు అని చెప్పి కిరణ్ చేయిచాచాడు.
''నేనంత పెట్టలేను. పాలు అమ్ముకునేవాడ్ని. ఏదో మాత్రలు రాసీమను బాబు పోదాం'' పొత్తికడుపు నొక్కుకుంటూ చెప్పాడు.
కిరణ్ అయోమయంగా చూస్తుండగా చలమయ్య కుటుంబం వచ్చి కిరణ్ చేతిలో కాగితం అందుకుని డబ్బు కట్టేసారు.
''ఎందుకురా డబ్బు తగలెడతారు?ఈనొప్పి ఎన్నిసార్లు రాలేదు. మందులకొట్టులో నొప్పి తగ్గించేమాత్ర అడిగితే ఆళ్లే ఇస్తారు. అనవ సరంగా వచ్చాను'' అని చలమయ్య గొణుక్కున్నాడు.
టెస్టులు అయ్యాయి. స్టోన్ ఫార్మ్ అయ్యింది. ఆపరేషన్ చేసి స్టోన్సు తొలగించాలి. దానికి పదివేలు ఖర్చు తప్పదు అని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చేయండి డబ్బు నేను తెస్తాను అని చలమయ్య కొడుకు సిద్ధపడ్డాడు.
''అంత డబ్బు మనకాడెక్కడిది?'' చలమయ్య కొడుకుని అడిగాడు.
''నాలుగు ఆవులున్నాయి. రేపే సంతలో ఒకటి అమ్మేస్తాను. అవసరమైతే మిగిలిన ఆవులు అమ్మేస్తాను. ఆవులు చూపించి పదివేలు ఇప్పుడే తెస్తాను.''
''ఒరేరు ఆ పనిచేయకురా పోయేటోడికోసం ఆవులు అమ్మకు. అవే కదా జీవనాధారం''
''ప్రాణాలు పోతుంటే ఆవులుండి ఏటి సుఖం. నువ్వు కడుపు నొప్పితో విలవిలమంటుంటే చూడలేక ఛస్తున్నాం''
వారిమాటలు వింటున్న కిరణ్, అక్కడే ఉన్న నర్సు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కిరణ్ తను వచ్చిన పని అయిపోయిందని మరుసటిరోజు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆరాత్రి చలమయ్యకు ఆపరేషన్ జరిగిపోయింది. ఎలాంటి కత్తికోతలు లేకుండా కిడ్నీ స్టోన్సును పేల్చేసాం అని డాక్టర్ చెప్పాడు. రెండురోజులు హాస్పిటల్‌లో ఉండాలన్నాడు. ఏవో ఇంజక్షన్లు ఇస్తే చలమయ్య గాఢనిద్రలో ఒదిగిపోయాడు.
మరి కడుపునొప్పి రాదు. ఈమందులు రెగ్యులర్‌గా వాడండి అని చెప్పి ఏవేవి తినకూడదో ఒకలిస్టు ఇచ్చేసాడు డాక్టర్. చలమయ్య కుటుంబం సంతోషపడిపోయింది. కిరణ్ వస్తే అతడిని దేవుడన్నారు. నీవు ఇక్కడకి తీసుకురాకుంటే మాఅయ్య బతికేటోడు కాదు. డబ్బు పోయినా మాఅయ్య బతికాడని చలమయ్య కొడుకు ఎత్తిపొగిడాడు.
అప్పుడే నర్సు వచ్చి మీకు ఈరోజే డిశ్చార్జి ఇచ్చేస్తారు.నేను డ్యూటీ దిగిపోతున్నాను. నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని అడిగింది. అందుకు చలమయ్య కొడుకు ముఖం చాటేశాడు.
''ఇప్పుటికే పాడి ఆవు అమ్ముకున్నాను. అదీ ఇక్కడి ఖర్చులకు చాలీచాలకుండా పోయింది. ఇంకేటుందని నీకీయను'' గొణుక్కుంటూనే ఒక పదిరూపాయలు ఇచ్చాడు.
ఆమె విసురుగా అతడిపైకి కొట్టి ''ఛ మీరు మారరు''
''ఆడాక్టర్ మీలాంటి జలగల్ని ఎలా భరిస్తున్నాడో అని కింద పడిన పదిరూపాయల నోటు అందుకున్నాడు. కిరణ్ చలమయ్య కొడుకుకి నచ్చచెప్పి ఓ యాబై ఇప్పించాడు. నర్సు అయిష్టంగా తీసుకుని గొర్రె కసాయినే నమ్ముతుంది అని వాగుకుంటూ వెళ్లిపోయింది. ఆమాట ఎవరిని ఉద్దేశించి అన్నదో కిరణ్‌కు అర్ధంకాలేదు.
ఆసాయంత్రం నర్సు సిన్మాహాలు వద్ద కలిస్తే అడిగాడు.
''నువ్వు తెచ్చిన పేషెంటుకు చిన్నస్టోన్ ఉంది.అది పేల్చనక్కర్లేదు. మందులతో పోతుంది. ఆడాక్టర్ వారిని నిలువునా దోచాడు. నాకు వందరూపాయలు ఇవ్వడానికి ఇష్టపడరు. డాక్టర్ మీద పోస్తారు. ఇలా అన్నానని డాక్టర్‌కు చెప్పకు. నువ్వు డాక్టర్ కావాలని సీటుకొందామని వెళ్లావట. మనకాలనీలో చెప్పుకుంటున్నారు. నువ్వు డాక్టర్ అయ్యాక ఈపేదోళ్లని మధ్యతరగతోళ్లను తినేస్తే నీవు పెట్టిన డబ్బు మూడింతలు వస్తుంది. అందుకే నీకు చెప్పాను'' అని చెప్పి థియేటర్‌లోకి వెళ్లిపోయింది.
కిరణ్ ఇంటికి వచ్చి తను వైద్యుడయ్యాక పేదవారికి సేవలు అందిస్తానని చెప్పిన టెన్తుక్లాస్ పేపర్ పటాన్ని చూసి పేలవంగా నవ్వుకున్నాడు.
నిజమే లక్షలు పోసి చదువుకున్నాక ఉచితసేవలు ఎవరు చేయగలరు. అని పకపకమని నవ్వుకున్నాడు. తెరలు తెరలుగా నవ్వాడు. అంతలోనే బడినుంచి తల్లి వచ్చింది ఆమెను చూసి నవ్వాడు. ''డాక్టర్లు ఉచితసేవలు అందించలేరమ్మా. అదీ సీటు కొనుక్కుని చదివిన డాక్టర్లు వలన కానేకాదు. నేను సీటు కొనుక్కుని చదవను. నువ్వా ప్రయత్నాలు మరిచేయకు. ర్యాంకు సాధించి సీటు సాధిస్తాను'' చెప్పి గాఢంగా నిట్టూర్చాడు.
వై. కుసుమకుమారి