రోజు వలె ఆరోజు కూడా తెల్లవారింది, జీవన పోరాటం మొదలైంది! మురుగుకాలవలపై దోమలు, ఆకాలువలలో కప్పలు పర్యావరణాన్ని, పరిశుభ్రతను భంగపరచాలని చూస్తూ పిచ్చిగా బెకబెకమంటున్నాయి. ఆ సిటీలో ఓ సినిమా థియేటర్ దగ్గర కొత్త సినిమాకి టిక్కెట్లు ఇస్తున్నారు. బ్లాకులో అమ్ముకునేవాళ్లు క్యూలోకి అక్రమంగా చొరబడుతున్నరు. ఒకరికొకరు బాదుకోవడం, తిట్లు, కేకలు... అసభ్యమైన మాటలు, తోపులాటలు ఆరంభమయ్యాయి.ఆంధ్రా పిండివంటకాలు! నాలుగు చక్రాల బండిమీద పొయ్యిపెట్టి మూకుడు, కళాయి మొదలైన వంట పాత్రలతో తాజాతాజాగా తయారుచేస్తూ అమ్మకం ప్రారంభించింది బూరెమ్మ!! పొంగడాలు, పోకుండలు, అరిసెలు, పూర్ణంబూరెలు, బొబ్బర్లు, చల్లగుత్తులు, మసాలా వడలు, జంతికలు, చేగోడీలు వగైరా వగైరా తినుబండార సరుకులు వేడివేడిగా పొగలు కక్కుతూ ఊరిస్తున్నాయి ఆ దారిన వెళ్లే ఎందరినో.....అంతలో ఒక ఆవును గాబరా పెడుతూ పరుగుపెట్టిస్తున్న ఆంబోతు! బీభత్సం! అక్కడ జనం కొద్ది క్షణాల్లో చెల్లాచెదురయ్యారు. బూరెమ్మ పిండివంటకాల బండి తిరగబడిపోయేదే కానీ తృటిలో అలాంటి ప్రమాదం తప్పింది. లేకుంటే ఆవంటకాలు నేలపాలు అయ్యేవి. కొన్ని రకాల ప్రమాదాలు చెప్పిరావు. చిన్న ప్రమాదాలు ఐనప్పటికి మృత్యుదేవత వరిస్తూ వుంటుంది.
రోడ్లు విశాలం చేయవలసిన ప్రాంతాల్లో ఇప్పటికీ జరగడం లేదు. ఏమిటో ఈ రోడ్డు ఎప్పటికి విశాలం అవుతుందో ఏమో? పల్లెల నుండి జనం జీవనోపాధి నిమిత్తం ఈ మధ్యకాలంలో సిటీలోకి వస్తున్నారు. ప్రభుత్వం సిటీబస్‌లు నడపాలని ఎందరో కోరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య దినదినగండం నూరేళ్ల ఆయుష్షు సామెత.... జనాలకు రోజూ గుర్తుకొస్తూ వుంటుంది. ఒక సీనియర్ సిటిజన్ గొణుక్కుంటూ వుండగా ఒక ఆటోలోంచి అక్కడకు దిగిన పాణి మాస్టారు,''హాలో వీరభద్రం గారూ! బాగున్నారా? ఈ మధ్య కొన్ని కవితలు రాశాను వింటారా?'' అని బుక్ తెరిచారు.''చూడండి పాణి మాస్టారూ! మీరు ఎన్నో సమస్యలు చూస్తున్నారు. అలాంటి సమస్యలు విశేషాలు జోడించి కళాత్మకంగా రాసి కవితలు జనాలకి వినిపించండి. సరళమైన భాషలో మీరు కవితలు రాస్తున్నందుకు నాకు చాలా సంతోషం. మరోసారి కలుద్దాం. నాకు అర్జెంట్ పనివుంది'' వీరభద్రం ఆటో ఎక్కాడు.పాణి మాస్టారు వీరభద్రం చెప్పిన మాటలు బుర్రలో గుర్తుపెట్టుకున్నారు. కవితలు రాసే మూడ్‌కోసం బస్టాండ్‌కు వెళ్లడానికి ఆటో ఎక్కేశారు (ఆయన రాసేవి చాలా వరకు గాంధేయవాద సిద్ధాంత కవితలు).ఉదయం పన్నెండు గంటల సమయం అయింది. బూరెమ్మ పిండి వంటకాల బండిదగ్గర కాస్త సద్దుమణిగింది. అక్కడే తిరుగుతున్న కుమారి హేండ్‌బ్యాగులోంచి సెంట్ బాటిల్ తీసింది. రెండు భుజాలకు రెండు చుక్కలు రుద్దుకుంది. గులాబి సెంటువాసన గుప్పుగుప్పుమని గాలిలో ఆహ్వానంలా వుంది. మల్లెపూలు అమ్మే మల్లేశ్వరరావు దగ్గర ఒక దండ కొనుక్కుని తల్లో పెట్టుకుంది.
అక్కడ సినిమా థియేటర్‌కు వచ్చి వెళ్లే కుర్రాళ్లను ఆకర్షించడానికి హాట్ హాట్ హిట్ సినిమా పాటల పల్లవులు... ముసిముసి నవ్వులు నవ్వుతూ లోస్వరంలో పాడుతూ వుంది. ఆ సమీపంలో సాంబారు ఘుమఘుమలు ఓహోటల్ నుండి వస్తున్నాయి. ఆ సువాసనను ఆస్వాదించిన ఆమె ఆకలి బాధ రెట్టింపయింది.మార్నింగ్‌షో, మ్యాటనీ, ఫస్ట్‌షో రోజుకు మూడు ఆటల కోసం వచ్చి వెళ్లే యువ విటుల కోసం... ఆమె ప్రయత్నం చేస్తూ వుంటుంది. రోజుకు రెండు వందల నుండి నాలుగు వందల వరకు సంపాయిస్తూ వుంటుంది. సంపాదనలో మూడువంతులు ఆమె తాగుబోతు మొగుడుకు అప్పగిస్తూ వుంటుంది. ఆమె తల్లిదండ్రులు ఒకసారి తుఫాన్ ఉప్పెనలో జాడ తెలియకుండా కొట్టుకుపోయారు. అప్పటి నుండి ఆమె దూరపు బంధువు మేనమామ (అమ్మ తమ్ముడు) ఆమెను పెంచాడు. ఆ మేనమామ కొడుకు వీరన్న తిరుగుబోతు, తాగుబోతు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మంచి మాటలతో ఆమెను నమ్మించాడు. నెమ్మదిగా డబ్బుకోసం ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించాడు. ఆ తాగుబోతు మొగుడంటే ఆమెకు ఎందుకో చెప్పరాని భయం. ఒక్కొక్కసారి ఆ మొగుడితో తెగతెంపులు చేసుకుని తొమ్మిదేళ్ల కూతురిని వెంటపెట్టుకుని ఎటైనా వెళ్లిపోదాం అనుకుంటుంది. తనలాగా తన కూతురి జీవితం కూడా వ్యభిచార బతుకైతే తను ఎంతమాత్రం భరించలేదు. తన కూతురు మంచిగా ఎదగాలి. బాగా చదువుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారం అందుకోవాలి. తన బిడ్డను ఒక లాయరుగా చూడాలి. కానీ ఆమె వీధుల్లో తిరిగే వ్యభిచారిగా ముద్రపడింది.
ఆమెకు రక్త పరీక్షలు వగైరా చేయించి ఆమెలో మంచి మార్పు తీసుకురావాలని సాంబయ్య మాస్టారు ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ ఆమె మనసు అటుఇటుగానే వుంది.కరివేపాకు, కాయగూరలు తొట్టి రిక్షాలో వేసుకుని ఇంటింటికీ అమ్మకం సాగించే రాములు కూడా కుమారిలో మంచి మార్పు తీసుకురావాలని ఆలోచన చేశాడు. తనతోపాటు కాయగూరలు, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు అమ్మడానికి చాలాసార్లు పిలిచాడు.ఏదోరోజు కుమారి తనతోపాటు రిక్షాలో కూరలు కరివేపాకు అమ్మడానికి రాగలదని ఎదురుచూడసాగాడు.కానీ కుమారి స్నేహితురాలు రమణమ్మ రాములు మీద లేనిపోనివి కల్పించి చెప్పింది. ఆమె ఒక సీనియర్ వ్యభిచారిణి. ''ఆ రాములు మాటలు నమ్మావంటే నిలువునా నిన్ను ఉప్పుటేరులో ముంచేస్తాడు. నీకో సంగతి తెలుసోలేదో! వాడు పెట్టే బాధలు భరించలేక వాడిని వదిలేసి మరొకడితో వాడి పెళ్లాం ఎటో వెళ్లిపోయింది. కుమారి! మనం ఏపని చేస్తున్నామో ఆ పనిలోనే వుందాం'' అని నచ్చచెప్పింది రమణమ్మ.మార్నింగ్ షో మొదలయింది. ఆ థియేటర్ బయట జనం ఇద్దరు కూడాలేరు. విటుల వేటలో వున్న కుమారికి కడుపునొప్పి ఆరంభమయింది. ఆమెలో వున్న సుఖవ్యాధులు తరచూ ఆమెను తెగ బాధపెడుతున్నాయి. రోగం బాధ మరీ ఎక్కువగా వున్నప్పుడు కూడా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం లేదు. నాటు వైద్యులను ఆశ్రయిస్తుంది. ఒక్కొక్క పర్యాయం ఆమె ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. దుర్వాసన కొడుతుంది. తల తిరుగుతుంది. ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. రాత్రిపూట విపరీతమైన దగ్గు, క్షయ లక్షణాలు కూడా ఆమెలో మొదలయ్యాయి.
ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి సత్రం అరుగుమీద కూర్చుంది. ఆమె పాత ఖాతాదారుడు 'ఏమిటి కుమారి బాగున్నావా?' అని పలకరించాడు వెంకన్న.
''ఏదో బాగున్నానులే బావా'' అంత ఆకలిలోనూ హుషారుగా నవ్వుతూ అతన్ని కవ్విస్తూ అంది కుమారి.
''మీ అమ్మాయి పెద్ద మనిషి అయిందా?''
''ఇంకా లేదు బావా''
''జాగ్రత్త సుమా! పిల్లను మాత్రం నీలాగా వీధుల్లో తిప్పకు''
కొంత ఆలోచనా జ్ఞాన లోపం, మూఢనమ్మకాలు... ఇంకా ఎందరో మనుషులను పట్టి పీడిస్తున్నాయి. సామాజిక వ్యవస్థ అవస్థ పాలవుతూ మానవ జీవనరాగం అపశ్రుతులు పలుకుతూ వుంది. తన బిడ్డను స్కూల్‌కి పంపితే... తెలివి తేటలు అబ్బుతాయని తనకూ ఆ ఆలోచన ఎప్పుడో కలిగింది. కానీ మొగుడు వీరన్న బిడ్డను స్కూల్‌కు పంపుతానంటే ఆడ్డుపడుతున్నాడు. కుమారికి దుఃఖం ముంచుకొచ్చింది.
అక్కడ రోడ్ పక్కన ఊరకుక్కలు, విసిరేసిన ఎంగిలాకుల కోసం కాట్లాడుకుంటున్నాయి. ఒక ఊరపంది తన పిల్లలతో అక్కడ బురద కాలువలో దొర్లుతూ తనదైన ఆనందం అనుభవిస్తుంది. ముక్కుపుటాలు పగిలినంత దుర్వాసన. అలాంటి కాలువ సమీపంలోనే మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఓ వృద్ధుడు అమ్ముతూ వున్నాడు. అతనికి సమీపంలోనే బియ్యం ఏరుకునే చేటలో మూడునెలల శిశువును పెట్టి యాచిస్తోంది ఓ అనాకారి తల్లి.
కుమారి చెరువు సెంటర్‌కు వచ్చింది మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మరో పెద్ద సెంటర్‌కు వెళ్లాలని. బస్‌గానీ, ఆటోగానీ వస్తే వెళ్దామనుకుంది. ఆ సమీపంలోనే ఇద్దరు యువకులు ప్రపంచం గురించి ముచ్చటించుకుంటున్నారు.
''ఒరేరు! ఇప్పుడు ప్రపంచం ఎంత మారిపోయిందంటే పుట్టే నెలల బిడ్డలకు మాటలు నేర్పే తల్లిదండ్రులు అమ్మా నాన్నా అని గానీ, మమ్మీ డాడీ అని గానీ మొదటి పదాలు చెప్పడంలేదు. బాలు, బ్యాటు, సిక్సర్ వగైరాలు నేర్పుతున్నారురా! అవునురా!''
''ఇంక లవర్స్ పరిస్థితి చాలా విచిత్రంగా వుంటోంది. మన కాలేజీలో చదివే అమ్మాయిలు, అబ్బాయిలకు లవర్స్ తరచూ మారుతుంటారు. ఎప్పుడు ఏ ఇద్దరు సన్నిహితంగా వుంటారో తెలియడంలా''
''అవునురా! చూశావా రోజులు ఎలా వున్నాయో! మొత్తమ్మీద ప్రపంచంలో రకరకాల వ్వవస్థలు అవస్థల పాలవుతున్నాయి''
''ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం అవగాహనకోసం, ఎయిడ్స్ పేషెంట్లలో జీవించే జీవిత కాలప్రమాణాన్ని పెంచడానికి మన ప్రభుత్వం, ఇతర దేశాల ప్రభుత్వాలు 24 గంటలు నిర్విరామ కృషి చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ ప్రపంచంలో ఆక్రమ సంబంధాలు నడుస్తున్నాయిరా!''
''చాలా జాగ్రత్తగల కుర్రాళ్లు! తన వెంట ఎందుకు పడతారు? అనుకుని ముందుకు కదిలింది కూమారి.
జనరల్ హాస్పిటల్ ఏరియాలో మరో పాత విటుడు ఆమెను పలకరించాడు. ''భోజనం చేశావా?!'' అడిగాడు.
''ఇంకా భోజనం ఎక్కడీ బోణికాలేదు'' అంది. అతడు వయసులో వున్నప్పుడు చూసిన చింతామణి నాటకం గుర్తొచ్చింది.
''పద భోజనం చేద్దాం. బోణీ కూడా చేస్తా!'' అన్నాడు. ఆమె, ఆ విటుడు... సమీపంలోని భోజనం హోటల్‌కి వెళ్లారు. కడుపారా భోజనం చేశారు. ఆ హోటల్ భోజనం (నాన్ వెజిటేరియన్) విందు భోజనం లా వుంది. ఒక్కసారి కుమారికి నీరు కారిపోయిన నిరాశ, నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.
మనసా వాచా కర్మణా తన వృత్తి ధర్మాన్ని నిర్వహించింది కుమారి (గుట్టు చప్పుడు కాని ఏటి ఒడ్డున పూరిపాకలో).
''సరే వెళ్లొస్తా. మళ్లీ కలుద్దాం'' అతడు వెళ్తూ ఆమె చేతిలో రెండు వంద నోట్లు పెట్టాడు. అతను ఒక లారీ డ్రైవర్.
''గుడ్డిలో మెల్ల... పరవాలేదు సంపాదన'' అనుకుంది ఆమె.
రోజులు తరబడి లారీలను నడిపే డ్రైవర్లు, వారికి సహాయకారులుగా వుంటున్న క్లీనర్లు ఇళ్లకు వెళ్లే అవకాశం లేక దారిలో ఇంద్రియనిగ్రహం పాటించలేక వ్యభిచారులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారిలో త్వరితగతిన సుఖవ్యాధులు ప్రబలి అవి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను చేస్తున్నాయి. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. అంటించుకునే వ్యాధి అని అనుభవనీయులు చెప్పింది అక్షరాలా వాస్తవం.
కుమారిలో హెచ్.ఐ.వి లక్షణాలు కొన్ని ఆరంభమయ్యాయి. కానీ ఆమె నిర్లక్ష్యంగా వుంది. స్వచ్ఛందంగా మనసుపెట్టి ఆసుపత్రిలో రక్తపరీక్ష చేయించుకోవడానికి అటుఇటుకాని ఆలోచనలో వుంది. తాను ఉంటున్న సమీప గ్రామానికి ఆటోరిక్షా ఎక్కింది. ఆ ఆటోరిక్షాలో డ్రైవర్‌తో సహా తొమ్మిది మంది వున్నారు. ఓవర్‌లోడ్. ఆటో నడుపుతున్నది అనుభవం లేని కుర్రోడు. ఆ ఆటోరిక్షాకు బ్రేకులు కూడా సరిగా లేవు. ఆ ఆటోఎక్కిన పాసింజర్లు నిరక్ష్యరాస్యులు. స్పీడు పెంచాడు ఆటోవాలా. సుమారు గంట గడిచే సరికి నేషనల్ హైవే ఎక్కింది ఆటోరిక్షా. ఒకచోట ఒక స్వచ్ఛంద సేవా సంస ్థవారు ఆటోను ఆపి నిరోధ్ పాకెట్లు పంచిపెట్టారు. ముఖ్యంగా నేషనల్ హైవేమీద ప్రయివేటు వాహనాలలో ప్రయాణం చేసే ప్రయాణీకులు విచ్చలవిడి శృంగారానికి పాల్పడుతున్నట్లు ఆ స్వచ్ఛంద సంస్థ సర్వేలు అంచనాలు తెలియజేస్తున్నాయి.
ఒక పక్క పేదరికం. మరోపక్క ప్రాణాలను అర్థాంతరంగా మట్టుపెట్టే హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వంటి రోగాలు ముందు జాగ్రత్త లేని మనుషుల జాబితాలో కుమారి వంటి వాళ్లు ఎందరో.
ఈరోజు రెండు వందల సంపాదనలో వంద మొగుడికి ఇవ్వాలి. మిగతా వందలో రోజువారి అప్పు చెల్లింపు చీటీ పద్దుకు ముప్పై రూపాయలు కట్టాలి. ఇంక మిగిలిన 70 రూపాయలలో బియ్యం, కాయగూరలు, వంటచెరుకు కొనాలి. కుమారి దారిపొడవునా లెక్కలు వేస్తూనే వుంది. నిలకడలేని కాయగూరల ధరలు, కిరాణా దినుసులు.
ఆటో ఆమె గ్రామం సమీపించింది. ఆటో రిక్షా కిరాయి చెల్లించడం కోసం బొడ్డులో దోపిన కొంగుముడిని బయటికి తీసింది. కానీ ముడి విడిపోయి వుంది. రెండువందల రూపాయలు గల్లంతు. ఆమెకు ఒక్కసారి ముచ్చెమటలు పట్టాయి.
''అయ్యో ధనలక్ష్మి ఎక్కడో జారిపోయింది, బాబూ నీకు ఆటో కిరాయి రేపు ఇస్తా'' అంది బాధగా.
అలాగే డబ్బులు వున్నప్పుడు ఇవ్వమ్మా అంటూ ఆటోవాలా ముందుకు సాగాడు.
ఆ ఆటోలోనే చిల్లర దొంగ ఎక్కాడు. లాఘవంగా కుమారికి లోకాభిరామాయణం చెపుతూ ఆమె కొంగుముడి విప్పి రెండు వందలు కాజేశాడు. ఆ సంగతి ఆమె గమనించలేకపోయింది ( ఆతడి మాటల మైకంలో పడిన ఆమె కొంగుముడిలో వున్న రెండు వందల సంగతి తాత్కాలికంగా మర్చిపోయింది).
''అయ్యో ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్లాలి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. సంపాదించిన డబ్బు దారిలో పోయిందంటే తాగుబోతు మొగుడు నమ్మడు. కూతురు నీలిమ ఎదురుగా వచ్చింది.
''ఏంటమ్మా ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్?'' అని అడిగింది.
అనుకోని సంఘటన ఆమెను బాగా ఒత్తిడికి గురిచేసింది. నడిరోడ్డుమీద సొమ్మసిల్లిపడిపోయింది. జనంలో ఒకరు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
కొద్ది క్షణాల్లో అక్కడకు అంబులెన్స్ వచ్చింది. కుమారిని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సకాలంలో తగిన వైద్యం చేశారు. చేసిన రక్త పరీక్షలో ఆమెకు హెచ్.ఐ.వి వుందని వైద్యులు గమనించారు. అంతలో విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆసుపత్రికి చేరుకున్నాడు. పరిస్థితి అతనిలో పరివర్తన కలిగించింది. అతను కూడా స్వచ్ఛందంగా రక్తపరీక్ష చేయించుకున్నాడు. కూతురు నీలిమకు రక్తపరీక్ష చేయించాడు. వీరిలో కూడా హెచ్.ఐ.వి పాజిటివ్ వున్నట్లు వైద్య సిబ్బంది పరీక్షలో తెలుసుకున్నారు.
వైద్య సిబ్బంది సలహా మేరకు వారు ముగ్గురు ఎయిడ్స్ పునరావాస కేంద్రానికి పంపటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొట్టకూటి కోసం అక్రమసంబంధాలు, విచ్చలవిడి శృంగారానికి స్వస్తి పలకడానికి అవకాశం కలిగినందుకు కుమారి, ఆమె భర్త అంత బాధలోనూ మరొపక్క సంతోషించారు.